
Intelligent Bird : ఆకాశంలో ఎగిరే పక్షుల్లో చాలా వరకు మనల్ని తమ అందంతో ఆకట్టుకుంటాయి. అయితే కొన్ని పక్షులు మాత్రం తమ తెలివితేటలతో ఆశ్చర్యపరుస్తాయి. అలాంటి వాటిలో ఆఫ్రికన్ గ్రే చిలుకకు ప్రత్యేక స్థానం ఉంది. ఈ పిట్ట చూడటానికి మామూలుగా కనిపించినా, ఆలోచించే శక్తి, మాటలను అనుకరించే నైపుణ్యం, సోషల్ గా ఉండే తీరులో ప్రత్యేకమైనది. అందుకే ఇది ప్రపంచవ్యాప్తంగా శాస్త్రవేత్తల దృష్టిలో పడింది. కొందరు దీనిని పక్షుల ప్రపంచంలోని “మేధావి”గా కూడా అభివర్ణిస్తారు. ఒక చిన్న పక్షి ఎలా మనిషి స్వరాన్ని అనుకరించగలుగుతుంది? ఎందుకు ఇది ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన పెంపుడు పక్షిగా మారింది? అదే సమయంలో ఈ జాతి ఎదుర్కొంటున్న ప్రమాదాలేమిటి? అనే ప్రశ్నలకు సమాధానమే ఆఫ్రికన్ గ్రే చిలుక కథ.
ఆఫ్రికా ఖండానికి చెందిన ఈ ప్రత్యేక చిలుక వెండి బూడిద రంగు రెక్కలు, ప్రకాశవంతమైన ఎరుపు రంగు తోకతో గుర్తించబడుతుంది. ముఖంపై కనిపించే తెల్లటి చార దీనికి ప్రత్యేక ఆకర్షణను ఇస్తుంది. మగ, ఆడ చిలుకలను బయటకు చూసి తేడా చెప్పడం కూడా చాలా కష్టం. అయితే దీని అసలైన ప్రత్యేకత అందంలో కాదు, మెదడులో ఉంది. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సుమారు 350 చిలుక జాతుల్లో ఆఫ్రికన్ గ్రే అత్యుత్తమ అనుకరణకారిగా గుర్తింపు పొందింది. ఇది మనుషుల మాటలను మాత్రమే కాదు, స్వరాన్ని కూడా అద్భుతంగా అనుకరించగలదు.
ఈ చిలుకల తెలివితేటలపై అనేక పరిశోధనలు జరిగాయి. కొన్ని అధ్యయనాల ప్రకారం ఆఫ్రికన్ గ్రే చిలుకల గ్రహణశక్తి, సమస్యలను పరిష్కరించే సామర్థ్యం ఐదేళ్ల చిన్నారికి సమానంగా ఉంటుందని శాస్త్రవేత్తలు గుర్తించారు. ఇవి కేవలం నేర్చుకోవడమే కాదు, కొన్ని సందర్భాల్లో నిర్ణయాలు తీసుకోవడం, గుర్తుంచుకోవడం, పరిస్థితులకు అనుగుణంగా స్పందించడం కూడా చేస్తాయి. అంతేకాదు, తమకు తెలిసిన విషయాలను ఇతర చిలుకలకు పంచుకోవడం, అవసరమైనప్పుడు సహాయం చేయడం వంటి సామాజిక లక్షణాలు కూడా వీటిలో కనిపిస్తాయి.
ఆఫ్రికన్ గ్రే చిలుకలు ఒంటరిగా జీవించవు. ఇవి గుంపులుగా సంచరిస్తాయి. ఉదయం ఆహారం కోసం బయలుదేరి, సాయంత్రానికి మళ్లీ చెట్లపై ఉన్న తమ విశ్రాంతి ప్రదేశాలకు చేరుకుంటాయి. సాధారణంగా 30 వరకు పక్షులు కలిసి ఆహారం కోసం వెళ్తాయి. తాటి పండ్లు, కోలా మొక్కల పండ్లు వీటి ప్రధాన ఆహారం. బలమైన ముక్కులతో పండ్లను పగులగొట్టి తింటాయి. కొన్నిసార్లు వ్యవసాయ పంటలపై కూడా దాడి చేసి మొక్కజొన్న వంటి పంటలకు నష్టం కలిగిస్తాయి.
ఇవి తమ జీవిత భాగస్వామి పట్ల కూడా విశేషమైన విధేయత చూపుతాయి. సాధారణంగా మూడు నుంచి ఐదు సంవత్సరాల వయస్సులో జతను ఎంచుకుని, జీవితాంతం అదే భాగస్వామితో కలిసి ఉంటాయి. చెట్లలోని బోలు ప్రాంతాల్లో గూళ్లు నిర్మించుకుని, ఆడ పక్షి మూడు నుంచి నాలుగు గుడ్లు పెడుతుంది. పిల్లలు బయటకు వచ్చిన తర్వాత తల్లిదండ్రులు కలిసి వాటిని పెంచడం వీటి కుటుంబ వ్యవస్థలో ముఖ్యమైన భాగం.
అయితే ఈ తెలివైన పక్షి ప్రస్తుతం తీవ్రమైన ముప్పును ఎదుర్కొంటోంది. నేషనల్ జియోగ్రాఫిక్ నివేదికల ప్రకారం, గత కొన్ని దశాబ్దాల్లో 13 లక్షలకుపైగా ఆఫ్రికన్ గ్రే చిలుకలు చట్టబద్ధంగా ఎగుమతి చేయబడ్డాయి. అదే సమయంలో అక్రమ వేట, అక్రమ వ్యాపారం కూడా భారీగా పెరిగింది. గుంపులుగా జీవించడం వల్ల వీటిని పట్టుకోవడం సులభంగా మారింది. వేటగాళ్లు చెట్లను నరికి గూళ్లను ధ్వంసం చేయడం, గుడ్లను తీసివేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నారు. ఇంత అద్భుతమైన తెలివితేటలతో ప్రపంచాన్ని ఆశ్చర్యపరుస్తున్న ఆఫ్రికన్ గ్రే చిలుక, ఇప్పుడు సంరక్షణ కోసం మనుషుల సహాయం అవసరమైన జాతిగా మారింది.