Reading Time: 2 minutes

ఒమన్ తీరంలో హైటెన్షన్: భారతీయ నావికులతో వెళ్తున్న షిప్‌లపై దాడులు.. వారంలో మూడోసారి

Caption of Image.

మిడిల్ ఈస్ట్ యుద్ధ జ్వాలలు సముద్ర మార్గాలను అతలాకుతలం చేస్తున్నాయి. ఒమన్ తీరంలోని షాహిద్ పోర్ట్ సమీపంలో భారతీయ సిబ్బందితో వెళ్తున్న ఎంటీ జల్వీర్ అనే వాణిజ్య నౌకపై తాజాగా దాడి జరిగింది. ఈ నౌకలో మొత్తం 20 మంది భారతీయ నావికులు ఉన్నట్లు ‘ఫార్వర్డ్ సీమెన్స్ యూనియన్ ఆఫ్ ఇండియా’ వెల్లడించింది. ఒమన్ తీరంలో కేవలం ఈ ఒక్క వారంలోనే భారతీయ సిబ్బంది ఉన్న నౌకలపై దాడి జరగడం ఇది వరుసగా 3వ సారి కావడం అంతర్జాతీయంగా తీవ్ర కలకలం రేపుతోంది.

ఈ ఘోర ప్రమాదాన్ని ఒమన్‌లోని భారత రాయబార కార్యాలయం ధృవీకరించింది. ఒమన్‌లోని షినాస్ పోర్ట్ సమీపంలో నౌక ప్రమాదానికి గురైనట్లు సమాచారం అందిందని, తాము పరిస్థితులను నిశితంగా గమనిస్తున్నామని ఎంబసీ ఎక్స్ పోస్టులో ప్రకటించింది. నావికుల రక్షణ కోసం స్థానిక అధికారులతో నిరంతరం సంప్రదింపులు జరుపుతున్నట్లు పేర్కొంది. నౌకలోని 20 మంది సిబ్బందిలో ఐదుగురిని ఆ దారిలో వెళ్తున్న ఇతర నౌకలు రక్షించి ఒమన్‌కు తరలించినట్లు ఇరాన్‌కు చెందిన వార్తా సంస్థ వెల్లడించింది. మిగిలిన వారి భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది.

ఈ వారంలోనే ‘ఎంటీ జల్వీర్’ కంటే ముందు మరో రెండు నౌకలపై దాడులు జరిగాయి. పలావు జెండాతో వెళ్తున్న ‘సెట్టెబెల్లో’ అనే ఆయిల్ ట్యాంకర్‌పై అమెరికా దళాలు జరిపిన దాడిలో ముగ్గురు భారతీయ నావికులు గల్లంతయ్యారు. ఇరాన్‌పై విధించిన దిగ్బంధనాన్ని ఉల్లంఘించడానికి ప్రయత్నించినందుకే ఆ ట్యాంకర్‌పై కాల్పులు జరిపినట్లు అమెరికా సైన్యం ప్రకటించింది. అంతకుముందు సోమవారం నాడు 24 మంది భారతీయ నావికులతో వెళ్తున్న ‘ఎంటీ మారివెక్స్’ అనే నౌకపై స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్ కు దక్షిణంగా దాడి జరగడంతో అందులో భారీగా మంటలు చెలరేగాయి.

►ALSO READ | యూటర్న్ తీసుకున్న నేపాల్ : ఇండియా మామిడి పండ్లు బ్యాన్ చేయలేదంటూ కబుర్లు..

ప్రపంచ ఇంధన సరఫరాకు అత్యంత కీలకమైన ‘స్ట్రెయిట్ ఆఫ్ హార్ముజ్’ జలసంధి.. ఫిబ్రవరి ఆఖరులో ఇరాన్‌పై అమెరికా-ఇజ్రాయెల్ జరిపిన దాడులతో ప్రారంభమైన మిడిల్ ఈస్ట్ యుద్ధం కారణంగా పూర్తిగా మూతపడింది. ఇటీవల కాలంలో అమల్లోకి వచ్చిన తాత్కాలిక కాల్పుల విరమణ చర్చలు కూడా ఈ సముద్ర మార్గాన్ని తిరిగి తెరవడంలో విఫలమయ్యాయి. యుద్ధం ప్రారంభమైనప్పటి నుండి ఇరాన్ ఈ మార్గాన్ని బ్లాక్ చేయగా.. దానికి పోటీగా ఏప్రిల్ నుంచి అమెరికా సైన్యం కూడా ఇక్కడ సొంతంగా దిగ్బంధనాన్ని అమలు చేస్తోంది. దీంతో అంతర్జాతీయ షిప్పింగ్ తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటోంది. 

©️ VIL Media Pvt Ltd.