
Story Board: వర్షాకాలం వస్తే చాలు.. హైదరాబాద్ ఆగమాగం అవుతోంది. అందుకే వాన పడుతోంటే చాలు.. నగరవాసులు భయపడిపోయే దుస్థితి దాపురించింది. నగరంలో వర్షాన్ని మించిన విలన్ లేదనే స్థాయిలో వాన కష్టాలు ఉంటున్నాయి. అసలు వర్షాకాలం సమీపిస్తుందంటేనే గుండెల్లో దడ మొదలవుతోంది. ఎక్కడ ఏ నాలా కాలనీని ముంచేస్తుందో, ఎక్కడ ఏ మ్యాన్‌హోల్ మృత్యుకుహరమై మనుషులను మింగుతుందో, ఎక్కడ ఏ చెట్టు ఉన్నట్టుండి కూలిపోయి ఎవరి ప్రాణాలు తీస్తుందో.. ఏ రోడ్డు ఏ నదిలా మారిపోతుందో, ఏ కాలనీలోని వీధిలో పడవల మాదిరిగా వాహనాలు కొట్టుకుపోతాయో, ఏ అపార్ట్‌మెంట్ సెల్లార్ నీళ్లతో నిండిపోతుందో, అందులో ఉన్న వాహనాలన్నీ వరద నీటిలో తేలి పోతాయో.. ఇలా చెప్పుకుంటూ పోతే చాంతాడంత జాబితా అవుతుంది. దేనితో దేనిని పోల్చాలో కూడా కష్టమవుతుంది. ఏటా వర్షాకాలంలో ఎక్కడా కనిపించని ఘోరమైన సీన్లన్నీ హైదరాబాద్ లో కనిపిస్తాయంటే అతిశయోక్తి కాదు.
హైదరాబాద్‌ను తొలివర్షం ముద్దాడేసింది. నగరాన్ని ముద్ద ముద్ద చేసింది. ట్రాఫిక్ అష్టకష్టాలు పడేలా చేసింది. రోడ్లన్నింటినీ వాగులు, నదుల మాదిరిగా చేసి పడేసింది. అపార్ట్‌మెంట్ సెల్లార్లను నీటితో నింపేసింది. మరి.. తొలి వర్షానికే ఇలా అయితే.. వర్షాల మీద వర్షాలు కురుస్తుంటే పరిస్థితి ఎలా ఉంటుందో.. అన్న సంకటం అందరినీ పట్టి పీడిస్తోంది. వర్షాలు వస్తూవస్తూనే నగర ప్రజలకు కష్టాలను తెస్తున్నాయి. వర్షం కురిసినప్పు డల్లా రహదారులపై నీరు నిలుస్తుండటంతో జనం ఇబ్బందులు పడుతున్నారు. రోడ్లమీద ట్రాఫిక్ అవస్థలు తప్పడం లేదు. వాహనాలు ముందుకు కదలడం లేదు. ఒక కిలోమీటర్ దూరానికే గంటలకు గంటలు సమయం పడుతోంది. వాహనాలు రిపేర్లకు వస్తున్నాయి. యాక్సిడెంట్లు జరుగుతున్నాయి. ఫలితంగా హైదరాబాద్ ప్రజలకు ప్రతియేటా వరద కష్టాలు తప్పడం లేదు.
సాధారణ వర్షాలు పడితేనే హైదరాబాద్ నరకాన్ని తలపిస్తుంది. ఇక. కుండపోత వాన ఎడతెరపిలేకుండా కురిస్తే ఊహించడమే కష్ట మవుతుంది. ఓ మాదిరి వర్షం కురిస్తేనే జనజీవనం స్తంభించిపోతోంది. అలాంటిది భారీ వర్షం కురిస్తే మాత్రం పరిస్థితి అస్తవ్యస్థమయిపోతోంది. రోడ్లన్నీ జలమయమవుతున్నాయి. వాహనదారులు ఇబ్బందులు పడుతున్నారు. నాలాలు ఉప్పొంగు తున్నాయి. ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలు ఇంటినుంచి కాలు బయట పెట్టాలంటే భయపడిపోతున్నారు. వరదలు వస్తే హైదరాబాద్ శివారులోని అనేక కాలనీలు నీటి మధ్య చిక్కుకుపోతున్నాయి. నగరం నడిమధ్యలో ఉన్న కాలనీలు కూడా నాలాల మధ్య బందీలవుతున్నాయి. ఇక, పక్కనే చెరువులు ఉన్న ప్రాంతాల్లోని ఇళ్లు నీళల్లో పడవలవుతున్నాయి. తాగునీటిలో సీవరేజీ వ్యర్థజలాలు కలుస్తున్నాయి. భారీ వర్షం కురిసిన ప్రతీసారీ సిటీ నిండా మునుగుతోంది. ముంపు సమస్య అలాగే ఉండి పోయింది. అక్కడి ప్రజల కష్టాలు కూడా అలాగే ఉండిపోయాయి. నిజానికి హైదరాబాద్‌లో వర్షం దంచికొడితే చాలు.. వందలాది కాలనీలు జలదిగ్బంధంలో చిక్కు కుంటాయి. వేలాది ఇళ్లు నీట మునుగుతాయి. ఒక గంటలో 2 సెంటీమీటర్ల కంటే ఎక్కువ వర్షం కురిస్తే ముంపు ప్రాంతాలకు ముప్పు పొంచివున్నట్లే.
రహదారులపై వరద నిలవడానికి ప్రధాన కారణం ఏళ్ల తరబడి పూడికతీత సక్రమంగా జరగకపోవడం.. నాలాలు ఆక్రమణకు గురై కుంచించుకుపోవడమే. వాన పడితే చాలు హైదరాబాద్‌లో అదో నరకం. సరిగ్గా ఆఫీస్ నుంచి ఉద్యోగులు, స్కూల్స్ నుంచి విద్యార్థులు బయటకెళ్లిన సమయానికే వర్షం పడితే.. ఇంటికి చేరుకోవడానికి వాళ్లు పడే బాధలు అన్నీ ఇన్నీ కావు.వర్షం పడ్డ ప్రతీసారి రోడ్ల మీదకు వరద నీరు చేరడం.. భారీగా ట్రాఫిక్ జామ్ అవడం తరుచూ జరుగుతోంది. ట్రాఫిక్ లో చిక్కుకున్నారంటే గంటలు గడిచినా.. వాహనాలు ముందుకు కదలని పరిస్థితి. నగరం నుంచి శివారు ప్రాంతాలకు చేరుకునేవాల్సిన వారైతే.. ఏ అర్థరాత్రో ఇంటికి చేరుకుంటున్నారు. అందుకే వాన పేరెత్తితేనే నగరవాసులు హడలిపోతున్నారు. వాహనదారులు ట్రాఫిక్ చట్రంలో ఇరుక్కుంటున్నారు. ఓ వైపు భారీ వర్షం, మరో వైపు రోడ్లపై పోటెత్తుతున్న వరదతో ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని ముందుకుసాగుతున్నారు. చివరకు అత్యంత రద్దీగా ఉండే ఐటీ కారిడార్లో వర్షం పడినప్పుడు పరిస్థితి గురించి ఎంత తక్కువ చెప్పుకుంటే అంత మంచిది.ఆ స్థాయిలో ఐటీ ఉద్యోగులు తిప్పలు పడుతున్నారు. సరిగ్గా వానొచ్చినప్పుడే పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ కూడా మొరాయిస్తోంది. దాంతో వర్షాలు పడ్డప్పుడు మరిన్ని వ్యక్తిగత వాహనాలు రోడ్డెక్కుతున్నాయి. దీంతో అప్పటికే వాహనాల రద్దీ భరించలేకపోతున్న రోడ్లపై మోయలేని భారం పడుతుంది. అదేమంటే సొంత వాహనం ఉంటే ఎంత లేటైనా ఇంటికి ధైర్యంగా చేరతామనే గ్యారంటీ ఉంటుంది. అదే పబ్లిక్ ట్రాన్స్‌పోర్ట్‌ని నమ్ముకుంటే.. అవి మొరాయించినా.. సర్వీసులు రద్దైనా.. ఇంటికెళ్లేది మర్నాడేనని నగరవాసులు ఫిక్సైపోతున్నారు. దీనికి తోడు వర్షాకాలంలో పబ్లిక్ ట్రాన్స్ పోర్ట్ సన్నద్ధత కూడా అంతంతమాత్రంగా ఉండటం, సర్వీస్ ఏ మాత్రం మెరుగుపడకపోవడం కూడా సమస్యను మరింత జటిలం చేస్తోంది. వర్షం వస్తే నగరాలన్నీ నదులను తలపిస్తున్నాయి. ఇళ్లను, కాలనీలను వరదనీరు ముంచెత్తుతోంది. ఫ్లైఓర్లపైనే నీరు నిలిచిపోతోంది. మెట్రో స్టేషన్లు స్విమ్మింగ్ పూల్స్‌గా మారుతున్నాయి. రహదారులపై నడుము లోతు దాకా నీళ్లతో ప్రజలు తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. దేశ ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్న పట్టణాలు, మెట్రో నగరాల్లో వరదల సమస్య ఏటికేడు మరింత జఠిలం అవుతోంది.
అది నగరమైనా, పల్లె అయినా వరద నీరు సాఫీగా వెళ్లే ఏర్పాట్లు ఉండాలి. ముఖ్యంగా స్థానిక జల వనరులను కంటికి రెప్పలా కాచుకోవాలి. కానీ, వాటి గురించి పట్టించుకుంటున్న వారెవరు? వలసలు పెరుగుతున్న తరుణంలో పట్టణ భూముల్లో ప్రతి అంగుళమూ బంగారు తునకగా మారింది. దాంతో కబ్జారాయుళ్ల కళ్లు చెరువులూ కుంటలపై పడుతున్నాయి. ఏ వైపు నుంచి ఎలా డబ్బు దండుకోవాలన్న ధ్యాసే తప్ప నిజమైన ప్రజాసంక్షేమం పట్టని నాయకుల అండదండలూ వారికి దండిగా అందుతున్నాయి. లంచాల కోసం అనుక్షణం అర్రులుచాచే కొందరు అధికారుల సంగతి ఇక సరేసరి. ఇంకేముందీ! ఇలాంటి వాళ్ల గూడుపుఠాణీలతోనే హైదరాబాద్‌లో చెరువు భూముల్లోనే వందల కోట్ల రూపాయల విలువైన భారీ భవనాలు యథేచ్ఛగా మొలుచుకొస్తున్నాయి. నేతలూ అధికారుల సహకారంతో అక్రమ నిర్మాణదారులు ఎలాంటి వెరపూ లేకుండా దందాలు కొనసాగిస్తున్నారు. వారు కట్టిన ఇళ్లు కొనుగోలు చేసిన అమాయకులు తరవాతి కాలంలో జడివానలకు తమ నివాస ప్రాంతాలు మునిగి బావురుమంటున్నారు! కేంద్ర జల్‌శక్తి శాఖ గణన ప్రకారమే దేశవ్యాప్తంగా 38 వేల జలవనరులు ఆక్రమణల పాలయ్యాయి. వీటిలో అత్యధికం ఉత్తర్ ప్రదేశ్, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్, తెలంగాణల్లోనే ఉన్నాయి. చెరువులూ కుంటలను నామరూపాలు లేకుండా చేయడమంటే స్థానిక జలావరణ వ్యవస్థను చావుదెబ్బ తీయడమే. జేబులు కొట్టే చిల్లర దొంగలనే జైళ్లకు పంపుతున్నప్పుడు- పర్యావరణాన్నీ జనజీవితాలను సర్వనాశనం చేస్తున్న అవినీతి అసురగణాలకు ఇంకెంత కఠిన శిక్షలు పడాలి?.
ఇదేదో ఒక్క హైదరాబాద్ బాధే కాదు. దేశంలో ఉన్న ప్రతి నగరం.. అంతెందుకు చివరకు పట్టణం కన్నీటి వ్యథ కూడా ఇదే. నదుల పక్కన నాగరికతలు విలసిల్లిన రీతిగానే.. ఇప్పుడు చెరువుల్ని ముంచేసి పట్టణాలు, నగరాలు విస్తరించడం కొత్త ట్రెండ్ గా మారింది. పైగా చెరువుల్లో ఇళ్లు కట్టుకుంటే భూగర్భజలాలకు లోటుండదనే దురాలోచనే.. అర్బన్ జీవితాన్ని జలప్రళయం పాలు చేస్తోంది. నిజంగా జలప్రళయం వస్తే.. అది ప్రకృతి ప్రకోపం. అది మనం నియంత్రించే స్థితి ఉండదు. కానీ కొన్నాళ్లుగా దేశంలో యావత్తు నగరాలు, పట్టణాల్లో వస్తున్న వరదలన్నీ.. ప్రకృతి విపత్తులు కానే కావు. ఇవన్నీ మానవ నిర్మిత విపత్తులేననేది నిపుణులు, అధ్యయనాలు తేల్చిచెప్పిన నిప్పులాంటి నిజం. అన్నీ తెలిసినా సరే ఎప్పటికప్పుడు సీరియస్ నెస్ నటించడమే తప్ప.. గత అనుభవాల నుంచి గుణపాఠాలు నేర్చుకున్న దాఖలాలు దివిటీ వేసి వెతికినా కనిపించడం లేదు. ప్రభుత్వాలు, అధికార యంత్రాంగం.. ఎవరికి వారే తమ తప్పులేదని తప్పించుకోవటానికి, సాకులు వెతకటానికే ప్రాధాన్యత ఇస్తున్నారు. అంతేకానీ గతంలో వరద వచ్చినప్పటి కంటే.. ఇప్పుడు సమస్య తీవ్రత తగ్గించగలిగామని గట్టిగా, ధైర్యంగా చెప్పుకోగల స్థితిలో మాత్రం ఎవరూ లేరనేది కాదనలేని వాస్తవం.
అలాగని నగరాలు, పట్టణాల్లో విపత్తు నిర్వహణ యంత్రాంగం, విపత్తులు ఎదుర్కోవటంలో అనుభవానికి లోటేం లేదు. చివరకు నిధులు కూడా దండిగానే ఉంటాయి. అయినా సరే నిర్లక్ష్యం కొంప ముంచుతోంది. ఒక నగరానికి ఎన్నిసార్లు వరద వచ్చినా 90 శాతం కొన్ని ప్రాంతాల్లోనే సమస్య వస్తుంది. అంటే వానొస్తే వరద ఎక్కడ్నుంచి వస్తుందో.. ఎలా తీవ్రమౌతుందో.. అలాగే ముంపు సమస్య ఏర్పడే ప్రాంతాలేమిటో యంత్రాంగానికి కచ్చితంగా తెలుసు.అయినా సరే ఎప్పటికప్పుడు తాత్కాలిక ఉపశమనే చర్యలే కానీ.. శాశ్వత పరిష్కార మార్గాలూ చూడాలనే చొరవ కరువౌతోంది. ఎప్పటికప్పుడు వరదలు వచ్చినప్పుడు, ముంపు సమస్య ఎదురైనప్పుడు.. నామ్ కే వాస్తే నిపుణుల కమిటీ వేయడం, ఆ నివేదికలు సర్కారుకు పంపామని ప్రకటన ఇచ్చి చేతులు దులుపుకోవటమే అధికారుల పని. ఇక్కడ ప్రభుత్వాలు కూడా ఏమీ తక్కువ తినలేదు. ఆ నివేదికల్ని సమగ్రంగా అధ్యయనం చేసి.. భవిష్యత్తులో సమస్య రాకుండా చూస్తామని ఆర్భాటపు ప్రకటనలు చేస్తారు. కానీ కొద్దిరోజులకే మరో ఇష్యూ తెరపైకి రాగానే.. దీని సంగతి గాలికి వదిలేస్తారు. దీంతో వరద, ముంపు సమస్య ఎక్కడ వేసిన గొంగళి అక్కడే ఉన్నట్టుగా ఉంటోంది. దేశంలోనే సాంకేతిక విద్యకు అత్యున్నత విద్యాసంస్థలైన ఐఐటీలు కొలువైన నగరాల్లోనూ వరద ముప్పు తప్పడం లేదంటే.. ముంపు సమస్య వస్తోందంటే.. ఈ నేరపూరిత నిర్లక్ష్యానికి మనకు మనమే జవాబు చెప్పుకోవాల్సిన అవసరం చాలా ఉంది. తమ నగరాల్లో ఉన్న సమస్యలకు పరిష్కారం చూపలేని ఐఐటీలు.. ఇక దేశ సమస్యల్ని ఎలా పరిష్కరించగలవనే ప్రశ్నలు తెరపైకి రావడం సహజమే. కొన్నిచోట్ల ఐఐటీలు చొరవ తీసుకుని.. పరిష్కార మార్గాల్ని సూచించినా.. యథాప్రకారం ప్రభుత్వాలు మీనమేషాలు లెక్కపెడుతున్నాయి. దీంతో ఎన్నో ఆశలతో నగరాలకు వలస వచ్చిన సామాన్యులకు చుక్కలు కనిపిస్తున్నాయి.
గట్టిగా ఎనిమిది సెంటీమీటర్లు వర్షం పడితే చాలు.. విశ్వనగరం షేక్ అయిపోతోంది. హైదరాబాద్ కు ఉన్న సమస్యలన్నీ బయటపడిపోతాయి. ఎక్కడపడితే అక్కడ నీళ్లు నిలిచిపోతాయి. కాలనీలన్నీ చెరువుల్లా మారిపోతాయి. ఓ డ్రైనేజీ సిస్టం అంటూ ఉండదు. ట్రాఫిక్ జామ్ అయిపోతుంది. చాలా చిత్రంగా కాసేపట్లో వర్షం పడుతుంది. ఎవరూ ఇళ్ల నుంచి బయటకు రావద్దు. ఆఫీసుల నుంచి త్వరగా ఇళ్లకు వెళ్లండి.. లాంటి ప్రకటనలు వస్తుంటాయి. వర్షం పడినంతసేపు.. ఆ తర్వాత కూడా సిటీలో యుద్ధ వాతావరణం కనిపిస్తుంది.
హైదరాబాద్ శరవేగంగా ఎదుగుతోంది. ఇప్పటికే మహానగరంగా ఉన్న హైదరాబాద్.. విశ్వనగరంగా రూపు మార్చుకుంటోంది. గత పాతికేళ్లుగా ప్రభుత్వాలు మారినా.. హైదరాబాద్ అభివృద్ధి మాత్రం ఆగలేదు. దీంతో హైదరాబాద్ అత్యంత ఆకర్షణీయ గమ్యస్థానంగా పేరు తెచ్చుకుంది. డైనమిక్ సిటీగా ఉన్న హైదరాబాద్ వివిధ వర్గాల్ని సూదంటురాయిలా ఆకర్షిస్తోంది. విద్య, వైద్యం, ఉద్యోగాలు, వ్యాపారాలు,పెట్టుబడులు.. ఇలా ఒకటేంటి ఏ రంగం చూసుకున్నా.. హైదరాబాద్ కు తిరుగులేదనే విధంగా దూసుకుపోతోంది. అంతర్జాతీయ సదస్సులు, కాన్ఫరెన్సులకు కూడా హైదరాబాద్ వేదికగా మారింది. అలా హైదరాబాద్ అభివృద్ధిలో దూసుకుపోతోంది. కాస్ట్ ఆఫ్ లివింగ్, అనుకూల వాతావరణం, నివాసయోగ్యత లాంటివి హైదరాబాద్ కు వరంగా మారుతున్నాయి. ఇప్పటికే ఐటీ, ఫార్మా హబ్ గా ఉన్న హైదరాబాద్.. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ హబ్ గా మారబోతోంది. కానీ ఇవన్నీ నాణానికి ఓవైపే. మరోవైపు హైదరాబాద్ ని కొన్ని సమస్యలు కూడా వేధిస్తున్నాయి. వానొస్తే సిటీ పరువు పోతోంది. డ్రైనేజీ సమస్యతో నరకం కనిపిస్తోంది. ట్రాఫిక్ అయితే ప్రతి రోజూ చిక్కుముడే. ఈ సమస్యలకు ప్రధాన కారణం పెరుగుతున్న జనాభాకు తగ్గట్టుగా వసతులు పెరగకపోవడమే. ఈ కష్టాల నుంచి బయటపడాలంటే కచ్చితంగా ఓ యాక్షన్ ప్లాన్ కావాలి. ముంబై, ఢిల్లీ, చెన్నై నగరాలతో పాటు హైదరాబాద్‌లోనూ వరదనీరు బయటకు పోయేందుకు సరైన ఏర్పాట్లు లేవు. ఈ విషయం చాలా సర్వేల్లో తేలింది. అందుకే చినుకు పడితే సిటీలోని రోడ్లన్నీ చెరువులుగా మారుతున్నాయి. కాలనీలు నీట మునుగుతున్నాయి.
దేశంలో విశాఖ, ముంబై లాంటి నగరాలు 180 డిగ్రీల కోణంలోనే విస్తరించగలవు. ఎందుకంటే ఆయా నగరాలకు ఓవైపు సముద్రం ఉంటుంది. ఆ వైపు నగర విస్తరణ సాధ్యం కాదు. అలాంటి చోట్ల అపరిమిత అంతస్తులకు అనుమతి ఇచ్చినా అర్థం చేసుకోవచ్చు. కానీ హైదరాబాద్ పరిస్థితి వేరు. ఇక్కడ 360 డిగ్రీల కోణంలో లక్షల ఎకరాల్లో భూములు అందుబాటులో ఉన్నాయి. ఇక్కడ అపరిమిత అంతస్తులకు అనుమతులు అక్కర్లేదు. కావాల్సినంత భూమి అందుబాటులో ఉంది కాబట్టి.. పరిమిత అంతస్తులకు అనుమతి ఇచ్చినా.. నగర విస్తరణకు లోటుండదు. కానీ నగరాన్ని అడ్డంగా విస్తరించకుండా.. నిలువుగా పెంచుకుంటూ పోతున్నారు. ఎకరం స్థలంలో వంద మందికి ఇరవై ఇళ్లు నిర్మించవచ్చు. కానీ ఎకరం స్థలంలో 32 ఫ్లోర్లు కట్టి.. 3200 మందిని ఎక్కిస్తారు. వాళ్లకు నీళ్లు ఎక్కడి నుంచి వస్తాయి. వాళ్ల మురుగునీరు ఎక్కడకి పోతుంది. దీని వల్లే డ్రైనేజీ సమస్య వస్తోంది.
ఎకరం స్థలంలో వంద మంది బతకడానికి సరిపోయే వసతులు, మౌలిక సదుపాయాలు ఉంటాయి. అక్కడ 40 అంతస్తుల భవనాలు, మల్టీ స్టోరీడ్ బిల్డింగులు కడితే.. 2 వేల మంది జనం పోగుపడతారు. 100 మందికి సరిపోయే సదుపాయాలను.. 2 వేల మందికి ఎలా సర్దుతారు. అదే 5 అంతస్తులకు మించకుండా అనుమతులు ఇస్తే.. నగరం అడ్డంగా విస్తరిస్తుంది. అప్పుడు అందరికీ అన్ని సదుపాయాలు వస్తాయి. దీనికి ప్రధానంగా జీహెచ్ఎంసీ రూల్స్ మార్చాలి. ఫ్లోర్ స్పేస్ ఇండెక్స్ విషయంలో పరిమితి ఎత్తేయడం.. కృత్రిమ సమస్యలకు దారితీస్తోంది.
అసలు సిటీలో కొత్త లే అవుట్ కి పర్మిషన్ ఇస్తున్నప్పుడే దానికి సరిపోయే డ్రైనేజీ వ్యవస్థను ఏర్పాటు చేయాలి. రెసిడెన్షియల్ అనుమతులకు నియంత్రణ ఉండాలి. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, ఏఎస్ రావు నగర్, మధురా నగర్, మాదాపూర్ లాంటి ఏరియాల్లో రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ కమర్షియల్ గా మారుస్తున్నా.. అనుమతులు ఇస్తున్నారు. కానీ ఆ ఏరియా జనాభాకి సరిపోతుందా.. లేదా అని చూసుకోవడం లేదు. రెసిడెన్స్ లో ఓ పది మంది ఉంటారు. అదే ప్లేస్ లో 20 అంతస్తుల మల్టీస్టోరీడ్ బిల్డింగ్ కడితే వెయ్యి మంది 24 గంటలు అక్కడ పనిచేస్తూ ఉంటారరు. వాళ్ల నీటి వినియోగం, వాష్ రూమ్స్, మెయింటినెన్స్ వంద రెట్లు పెరుగుతుంది. అందుకే కమర్షియల్ అనుమతులు ఇచ్చేటప్పుడు దాని డ్రైనేజీ సిస్టమ్ ని మార్చాలి. 10 మందికి సరిపోయే స్థలంలో వెయ్యి మంది కోసం నిర్మాణాలు చేసినప్పుడు.. అదే వెయ్యి మంది కోసం డ్రైనేజీ వ్యవస్థ కూడా నిర్మించాల్సిందే. నిజానికి వరద నీటి వ్యవస్థ, సీవరేజ్ వాటర్ సిస్టం వేర్వేరుగా ఉండాలి. ప్రస్తుతం రెండూ ఒకే వ్యవస్థగా మారాయి. దీంతో కెపాసిటీ సరిపోవడం లేదు. వరద నీటి కాలువల పక్కన ఉన్న స్థలాలు చాలా వరకూ కబ్జా అయ్యాయి. ఒకప్పుడు ఈ సిస్టమ్ కోసం చాలా ఓపెన్ ప్లేస్ ఉండేది. ఆ స్థలంలో వర్షం నీరు ఇంకేది. ఇప్పుడా పరిస్థితి లేదు. ఒకప్పుడు హైదరాబాద్‌లో వెయ్యి చెరువులు ఉండేవి. ఇప్పుడు చూద్దామన్నా ఒక్కటి కనిపించదు. రామంతాపూర్, బోయిన్‌పల్లి, రాయదుర్గంలాంటి చెరువుల చుట్టూ ఇళ్లు నిర్మించారు. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, హైటెక్ సిటీ లాంటి ఎత్తైన ప్రాంతాల నుంచి వచ్చే నీళ్లు ఎక్కడికి పోవాలి..? వాస్తవానికి అక్కడే ఉన్న దుర్గం చెరువులోకి వెళ్లాలి. కానీ ఇప్పుడా చెరువులోకి నీళ్లు పోయే పరిస్థితి లేదు. లోతట్టు ప్రాంతాల్లో కట్టిన ఇళ్లలోకి నీరు చేరుతోంది. నేలను సిమెంట్‌తో ప్లాస్టరింగ్చేయడంతో నీళ్లు ఇంకే ఛాన్స్లేకుండాపోయింది. ఇలాంటి పరిస్థితి చాలాచోట్ల ఉంది.
వాస్తవానికి భారీ వర్షాలు పడినప్పుడు నీళ్లు పోవడానికి ఏర్పాట్లు ఉండాలి. రోడ్ల నిర్మాణం పూర్తి అన్ సైంటిఫిక్‌గా ఉంటోంది. ఎక్కడ సమతలంగా ఉండాలి..? ఎక్కడ పల్లం ఉండాలి..? నీళ్లు ఎటు నుంచి ఎటుపోవాలనే ప్లానింగ్ లేదు. దీంతో వానొస్తే వరద ఇళ్లల్లోకి ప్రవహిస్తోంది. భూకంపాలు, వరదలు లాంటి ప్రకృతి ప్రమాదాలు జరగని ఎత్తైన ప్రాంతంలో హైదరాబాద్ ఉంది. ఇలాంటి సేఫ్సిటీలో విపత్తులను మనకు మనమే కొని తెచ్చుకుంటున్నాం. గ్రేటర్ హైదరాబాద్‌లో వాహనాల సంఖ్య రోజురోజుకూ పెరిగిపోతూనే ఉంది. దాదాపుగా జనాభాతో పోటీపడే విధంగా సంఖ్య పైపైకి దూసుకుపోతోంది. హైదరాబాద్, రంగారెడ్డి, మేడ్చల్ జిల్లాలను కలుపుకుంటే దాదాపుగా కోటి వాహనాలు ఉన్నట్టుగా రవాణా శాఖ గణాంకాలు తెలియజేస్తున్నాయి. గ్రేటర్ పరంగా చూస్తే వాహనాల రిజిస్టేష్రన్లలో హైదరాబాద్ జిల్లా ముందు వరుసలో ఉంది.
సాధారణంగా హైదరాబాద్ నగరంలో ప్రజా రవాణా వ్యవస్థలైన ఆర్టీసీ బస్సులు, ఆటోలు, ఎంఎంటీఎస్. గత కొన్ని సంవత్సరాలుగా మెట్రో రైలు ఉన్నప్పటికీ వ్యక్తిగత వాహనాలకు మాత్రం డిమాండు తగ్గడం లేదు. సాధారణ రోజుల్లో ఆర్టీసీ బస్సుల్లో దాదాపు 24 లక్షల మంది ప్రయాణిస్తుండగా.. మూడున్నర లక్షల మంది ఎంఎంటీఎస్‌లో తమ గమ్యస్థానాలు చేరుకుంటున్నారు. మెట్రో రైలులో రోజుకు 1.20 లక్షల మంది వరకు ప్రయాణిస్తున్నారు. అయితే ఇంతస్థాయిలో ప్రజా రవాణాకు ఆదరణ లభిస్తున్నప్పటికీ వ్యక్తిగత వాహనాలపై ప్రయాణిస్తున్న వారి సంఖ్య కూడా భారీగానే ఉంటోంది. దీంతో ట్రాఫిక్ చిక్కులు తప్పడం లేదు.
హైదరాబాద్ ట్రాఫిక్ సమస్య గురించి చెప్పాలంటే అదో భారతం అవుతుంది. మొదట్లో హైదరాబాద్ లో కొన్ని ట్రాఫిక్ జామయ్యే ప్రాంతాలుండేవి. ఆ పాయింట్ల దగ్గర ఎక్కువ మంది ట్రాఫిక్ పోలీసుల్ని పెట్టి.. క్రమబద్ధీకరిస్తే సమస్య తీరేది. కానీ క్రమంగా ట్రాఫిక్ పోలీసులే కాదు.. ఆటోమేటిక్ ట్రాఫిక్ సిగ్నళ్లు కూడా చేతులెత్తేసేంతగా ట్రాఫిక్ సమస్య ఇంతింతై వటుడింతై అన్నట్టుగా పెరిగింది. ప్రస్తుతం హైదరాబాద్ ట్రాఫిక్ సమస్యను చూసిన వారెవరికైనా.. కళ్లు తిరగటం ఖాయం. ఎందుకంటే ఎక్కడ ఎందుకు ట్రాఫిక్ జామ్ అవుతోందనేది ఎవరూ చెప్పలేని బ్రహ్మపదార్థంలా మారిపోయింది. ఇక ఎంతసేపు ట్రాఫిక్ జామ్ అనే ప్రశ్న అయితే అడగకపోవడమే మంచిది. ఎందుకంటే ఒక్కసారి రోడ్డెక్కిన తర్వాత గమ్యస్థానం చేరడం అనేది.. ట్రాఫిక్ దయ.. మన ప్రాప్తం అన్నట్టుగానే ఉంటోంది.
ఏతావాతా ఏటా ప్రతి వర్షాకాలంలో హైదాబాదీలు వాన కష్టాల గురించి చెప్పుకోవడం నిత్యకృత్యమైపోతోంది. అప్పటిదాకా విశ్వనగరంగా కనిపించే హైదరాబాద్.. కాస్త వర్షానికే చెరువుల నగరంగా తనకున్న పేరు నిలబెట్టుకుంటోంది. ఎక్కడచూసినా నీళ్లే కనిపిస్తాయి. అసలు రోడ్డెక్కడుందో.. మ్యాన్ హోల్ ఎక్కడుందో కూడా ఎవరూ కనిపెట్టలేని దుస్థితి కొన్ని నిమిషాల వ్యవధిలోనే కనిపిస్తుంది. అసలే వానతో తిప్పలు పడుతున్న నగరవాసులకు.. ట్రాఫిక్, మ్యాన్ హోల్స్ లాంటి అనుబంధ సమస్యలతో తల ప్రాణం తోకకొస్తోంది. హైదరాబాద్ రోడ్లపై వానలో ప్రయాణం అంటే.. పెద్ద యుద్ధం చేసి గెలిచినట్టే అనే అభిప్రాయాలున్నాయి. వర్షం పడుతున్నప్పుడే.. ఆగిన తర్వాత కూడా కొన్ని గంటల వరకూ సేమ్ సీన్ కనిపిస్తోందంటే అతిశయోక్తి కానే కాదు.