
తృణమూల్ కాంగ్రెస్ పార్టీలో సంక్షోభం. ఓడిపోయిన పార్టీకి.. అధినేత మమతా బెనర్జీపై లోక్ సభ ఎంపీలు తిరుగుబాటు చేశారు. ఇప్పటికే 16 మంది ఎంపీలు మమతాకు వ్యతిరేకంగా గళం విప్పటంతోపాటు.. లోక్ సభలో తమను ప్రత్యేకంగా గుర్తించాలంటూ స్పీకర్ కు లేఖ ఇచ్చారు.
ఇలాంటి సమయంలో మమతా బెనర్జీకి అండగా.. పార్టీకి మద్దతుగా నిలిచారు ఆ పార్టీ ఎంపీ, సీనియర్ నటుడు శతృఘ్న సిన్హా. మమతను మోసం చేయలేను.. మోసం చేయను.. కష్టాల్లో ఉన్న పార్టీని విడిచి వెళ్లను అని ప్రకటించారు శతృఘ్న సిన్హా. తిరుగుబాటు ఎంపీలతో కలిసి పార్టీ నుంచి వెళ్లిపోతున్నారంటూ వస్తున్న వార్తలను ఖండించారాయన.
పశ్చిమబెంగాల్ రాష్ట్రం అసన్ సోల్ లోక్ సభ నియోజకవర్గం నుంచి.. టీఎంసీ ఎంపీగా ఉన్నారు శతృఘ్న సిన్హా. నన్ను గెలిపించిన జనం కోసం అండగా ఉంటానని.. నన్ను గెలిపించిన పార్టీ కోసం నిలబడాతాను అని వెల్లడించారాయన. 2019 లోక్ సభ ఎన్నికల్లో పాట్నాసాహిబ్ నియోజక వర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయాను అని.. అప్పట్లోనే రాజకీయాలకు గుడ్ బై చెప్పాలని భావించానని.. ఆ సమయంలో మమతా బెనర్జీ దైర్యం చెప్పారని.. తనకు అండగా నిలబడ్డారని వివరించారాయన.
నాకు మద్దతు అవసరం అయినప్పుడు మమతా బెనర్జీ నాకు సాయం చేశారు.. ఆమెకు మద్దతు అవసరం అయినప్పుడు నేను ఆమెను విడిచిపెట్టలేను.. మమతా బెనర్జీకి.. తృణమూల్ కాంగ్రెస్ పార్టీకి మద్దతు ఇవ్వటం నా బాధ్యత, కర్తవ్యం అని స్పష్టం చేశారు శతృఘ్న సిన్హా. తిరుగుబాటు దళంలో చాలా మంది ఎంపీలు చేరారు.. అలాంటి వారిలో నా స్నేహితులు కూడా ఉన్నారు.. నన్ను కూడా ఆహ్వానించారు.. వారి ఆహ్వానాన్ని నేను తిరస్కరించాను.. నన్ను పార్టీలో చేరమని కోరిన బీజేపీతో సహా తిరుగుబాటు ఎంపీలు అందరినీ నా ధన్యవాదాలు అంటూ చురకలు అంటించారాయన.
నేను మమతా బెనర్జీతోనే ఉంటాను.. టీఎంసీ పార్టీలోనే కొనసాగుతాను అంటూ వెల్లడించారు శతృఘ్నసిన్హా. పార్టీ టికెట్ ఇచ్చి.. గెలిపించిన పార్టీకి.. కష్టకాలంలో అండగా ఉన్న మమతా బెనర్జీ వెంటే నా ప్రయాణం అని స్పష్టం చేశారు టీఎంసీ ఎంపీ, సీనియర్ బాలీవుడ్ నటుడు శతృఘ్న సిన్హా.