Reading Time: 2 minutes
పోలీస్ అని నమ్మి కారు ఇచ్చాడు.. 3 నెలల తర్వాత బయటపడిన అసలు కథ!

ఇక్కడ ఫోటోలో కనిపిస్తున్న ఎస్ఐ పేరు అనిల్ కుమార్… కళ్యాణదుర్గం పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పనిచేస్తున్నానని… కళ్యాణదుర్గం నియోజకవర్గం లోని తిమ్మసముద్రంలో మనోహర్ అనే వ్యక్తి దగ్గర నుంచి కారు అద్దెకి తీసుకున్నాడు. స్థానిక పోలీస్ స్టేషన్లో పనిచేసే సబ్ ఇన్స్పెక్టర్ కదా అని కారు యజమాని మనోహర్ కూడా నమ్మాడు. కారు యజమాని మనోహర్ ఎందుకు అంతగా నమ్మాడు అంటే… మనోడు ఫోన్లో ఆ స్థాయిలో బిల్డప్ ఇచ్చాడు. ఏకంగా వాట్సాప్ లో పోలీస్ యూనిఫామ్ తో ఉన్న ఫోటో పంపించి ఇంకా తన మీద నమ్మకం లేదా అంటూ నకిలీ సబ్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్… తిమ్మసముద్రం కు చెందిన మనోహర్ దగ్గర 75 వేల రూపాయలకు నెలకు అద్ది చెల్లించేటట్లు కారు రెంట్ కు తీసుకున్నాడు. ఇక అంతే కారు యజమాని మనోహర్.. నకిలీ సబ్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ ఒకరిని ఒకరు చూసుకున్నది లేదు. కారు తీసుకెళ్లి మూడు నెలలైనా అద్దె చెల్లించకపోవడంతో అనుమానం వచ్చిన కారు యజమాని మనోహర్ కళ్యాణదుర్గం రూరల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక్కడే అసలు విషయం బయటపడింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు… ఫోటోలో పోలీస్ యూనిఫాంలో ఉన్న అనిల్ కుమార్ అసలు పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ ఏ కాదని… నకిలీ ఎస్సైగా బురిడీ కొట్టించాడని పోలీసులు గుర్తించారు.

ఆ కాకి యూనిఫామ్ వెనుక ఉన్నది అసలైన పోలీస్ కాదని… ఖతర్నాక్ కిలాడి… అమాయకులను ముంచేస్తూ అనంతపురం జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల నకిలీ ఎస్సై మోసాలకు ఎట్టకేలకు పోలీసులు చెక్ పెట్టారు. అవును నేను సబ్ ఇన్స్పెక్టర్‌ని… నాకు అర్జెంట్గా ఒక కారు కావాలి. నెలకు అక్షరాల 75 వేల రూపాయల రెంటు ఇస్తా అంటూ… ఫేక్ పోలీస్ సబ్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ అనే కేటుగాడు అనంతపురం జిల్లాలో తిరుగుతున్నాడు తస్మాత్ జాగ్రత్త. ఫోన్లో అచ్చం పోలీస్ అధికారి మాదిరి ఎంత గంభీరంగా మాట్లాడతాడంటే… మీకు నమ్మకం కుదరకపోతే వాట్సప్ లో పోలీస్ యూనిఫామ్ ఫోటోలు కూడా పంపిస్తాడు. ఆ కాకి డ్రెస్ చూసి… నోట్లోంచి వచ్చే పోలీస్ లాంగ్వేజ్ విని… ఎవరైనా సరే నిజంగానే సబిన్స్పెక్టర్ అని నమ్ముతారు. సరిగ్గా అలాగే కారు యజమాని మనోహర్ కూడా అనిల్ కుమార్ మాటలు విని నమ్మి కారు అద్దెకు ఇచ్చాడు.

 

కారు అద్దెకు తీసుకుని వ్రాయించిన ఆ నకిలీ ఎస్సై అనిల్ కుమార్ నెలకు 75 వేలు ఇస్తానన్న మాట దేవుడెరుగు కనీసం మొహం కూడా నేరుగా చూడలేదు. ఒక నెల కాదు.. రెండు నెలలు కాదు.. ఏకంగా మూడు నెలలు గడిచిన అద్దె ఊసే లేదు. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. దీంతో కారు యజమానికి అనుమానం వచ్చింది. వెంటనే కళ్యాణదుర్గం రూరల్ పోలీసులను ఆశ్రయించి కారు యజమాని మనోహర్ నకిలీ సబ్ ఇన్స్పెక్టర్ పై ఫిర్యాదు చేశాడు. బాధితుడు ఫిర్యాదుతో రంగంలోకి దిగిన కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు నకిలీ ఎస్సై కోసం రూట్ మ్యాప్ సిద్ధం చేశారు. కారు అద్దెకు తీసుకుని వడయించిన ఆ కేటుగాడు కళ్యాణదుర్గం పరిసర ప్రాంతాల్లోనే తిరుగుతున్నాడు అన్న సమాచారంతో..‌ పోలీసులు వాహనాలు తనిఖీ చేయడం మొదలుపెట్టారు. సరిగ్గా వాహనాలు తనిఖీ చేస్తున్న సమయంలోనే అటుగా ఒక కారు వచ్చింది. పోలీసులు కారును ఆపి చెక్ చేయగా అందులో ఉన్న వ్యక్తిని చూసి స్వయంగా పోలీసులే ఒక్క క్షణం షాక్ గురయ్యారు.

అచ్చం నిజమైన సబ్ ఇన్స్పెక్టర్ లాగే కాకి డ్రెస్ వేసుకొని నకిలీ సబ్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ దర్జాగా కూర్చున్నాడు. పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో ఆ నకిలీ ఎస్ఐ యాక్టింగ్ ఎంతో సేపు సాగలేదు. అసలైన పోలీసుల ట్రీట్మెంట్‌తో నకిలీ బాగోతం బయటపడింది. పోలీసుల విచారణలో మరిన్ని షాకింగ్ నిజాలు బయటపడ్డాయి. కేవలం కారు అద్దెకి తీసుకొని తిరగడమే కాకుండా… అనంతపురం జిల్లాలో అనేక చోట్ల ఘరానా మోసాలకు పాల్పడ్డానని… కొంతమంది అమాయకులకు పోలీసు ఉద్యోగాలు ఇప్పిస్తానంటూ లక్షలాది రూపాయలు వసూలు చేశారని ఆ నకిలీ సబ్ ఇన్స్పెక్టర్ అనిల్ కుమార్ పోలీసులకు చెప్పాడు. ప్రస్తుతం ఆ కేటుగాడు కటకటాల వెనక ఊచలు లెక్క పెడుతున్నాడు. కేవలం ఒంటిపై పోలీస్ యూనిఫామ్ చూసో వాట్సాప్ లో పోలీస్ డ్రెస్ వేసుకున్న ఫోటోలు చూసో ఎవరిని బ్లైండ్ గా నమ్మొద్దు. ఖాకీ వెనుక ఇలాంటి కిలాడీలు కూడా ఉంటారు. తస్మాత్ జాగ్రత్త అంటున్నారు పోలీసులు.