Reading Time: 2 minutes

ఈవీల తయారీకి రూ.24 వేల కోట్లు.. రెండేళ్లలో ఖర్చు చేయనున్న కంపెనీలు

Caption of Image.
  • ఎలక్ట్రిక్​ కార్లకు భారీ డిమాండ్​
  • రెండేళ్లలో 15 శాతం తగ్గిన ధరలు
  • భారీగా పెరుగుతున్న అమ్మకాలు
  • క్రిసిల్​ రిపోర్ట్​ వెల్లడి

న్యూఢిల్లీ: పెట్రోల్, డీజిల్​ ధరలు పెరుగుతున్న నేపథ్యంలో ఆటోమొబైల్ ​కంపెనీలు ఎలక్ట్రిక్ ​వెహికల్స్ (ఈవీల) ​తయారీకి ప్రాధాన్యం ఇస్తున్నాయి. రేటింగ్​ఏజెన్సీ క్రిసిల్ ​గురువారం విడుదల చేసిన రిపోర్ట్​ ప్రకారం.. రాబోయే  రెండేళ్లలో ఆటో కంపెనీలు తమ ​రూ. 60వేల కోట్ల మూలధన వ్యయంలో రూ. 24వేల కోట్ల కంటే ఎక్కువ మొత్తాన్ని  ఈవీల తయారీకి కేటాయించనున్నాయి.  చార్జింగ్ స్టేషన్ల కొరత, తక్కువ  లాభదాయకత వంటి సవాళ్లు ఉన్నప్పటికీ ఎలక్ట్రిక్  ఫోర్  వీలర్ల వాడకం పుంజుకుంటోంది.  కొత్త మోడళ్ల డెవలప్​మెంట్​, సరఫరా గొలుసు స్థానీకరణ,  ఉత్పాదక సామర్థ్యం పెంపునకు కంపెనీలు 40 శాతం మొత్తాన్ని కేటాయిస్తాయని అంచనా. 

ధరలు తగ్గడం, ఎక్కువ మోడల్స్ ​అందుబాటులోకి రావడం, టెక్నాలజీ పెరిగిన కారణంగా ఎలక్ట్రిక్ పీవీలకు ఆదరణ కనిపిస్తోంది. ఈ ఏడాది మేతో ముగిసిన మూడు నెలల్లో సగటు నెలవారీ ఫోర్​ వీలర్ల అమ్మకం వార్షికంగా 40 శాతం పెరిగి దాదాపు 26వేల యూనిట్లకు చేరుకుంది. మార్కెట్ విస్తరణ సగటు 4.6 శాతం నుంచి 6.1 శాతానికి పెరిగింది. తాత్కాలిక అంతరాయాలు ఉన్నప్పటికీ ఎలక్ట్రిక్ కార్ల దీర్ఘకాలిక వృద్ధి బలంగా ఉంది.

  •  వృద్ధికి గల కారణాలు

గత ఏడాది సెప్టెంబర్​లో జీఎస్టీ తగ్గించడం వల్ల ఫోర్​వీలర్ల ధర పతనమైంది. ఫలితంగా ఈవీల వృద్ధి కొన్ని నెలల పాటు నెమ్మదించింది. తదనంతరం నుంచి అమ్మకాలు పెరుగుతూనే ఉన్నాయి.   గత ఆర్థిక సంవత్సరంలో సుమారు 2.2 లక్షల యూనిట్ల నుంచి వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి దాదాపు ఐదు లక్షల యూనిట్లకు చేరుతాయని అంచనా. 

దీనివల్ల మార్కెట్ విస్తరణ 8 నుంచి 10 శాతానికి పెరుగుతుంది. మోడళ్లు పెరగడం, డ్రైవింగ్ రేంజ్ మెరుగుపడటం, తక్కువ రేట్లు ఈ వృద్ధికి మూడు ముఖ్య కారణాలు. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఎలక్ట్రిక్​ మోడళ్ల సంఖ్య రెట్టింపై దాదాపు 20కి చేరింది. రూ. 15 లక్షల లోపు విభాగంలో మరిన్ని మోడల్స్ ​సంఖ్య వచ్చే ఆర్థిక సంవత్సరం నాటికి 35 దాటవచ్చు. 

ప్రీమియం ఈవీలు ఇప్పుడు ఒక్కో చార్జ్‌‌‌‌‌‌‌‌కు 500 నుంచి 700 కిలోమీటర్లు వెళ్తున్నాయి. మిడ్​రేంజ్​ మోడళ్లు 300 నుంచి 450 కిలోమీటర్ల మైలేజ్​ఇస్తున్నాయి. గత రెండు ఆర్థిక సంవత్సరాల్లో ఈవీల ధరలు 15 శాతం దాకా తగ్గాయి. ఇక నుంచి ఈవీల వినియోగాన్ని కొనసాగించడానికి స్థానీకరణ వేగం, చార్జింగ్ స్టేషన్ల విస్తరణ,  పన్ను మినహాయింపులు కీలకమని క్రిసిల్​రిపోర్ట్​ పేర్కొంది.

©️ VIL Media Pvt Ltd.