Reading Time: 7 minutes
Story Board About Why Are Gold Prices Falling After Record Highs Did Pm Modis Appeal Make A Difference

Story Board: లీటరు పెట్రోల్ ధర తగ్గినా రాని కిక్కు. కేజీ ఉల్లిపాయల ధర దిగొచ్చినా తెలియని ఒక ఆనందం.. ఎండకాలం ముదిరిపోయాక..ఒక్కసారిగా పడిన తొలి రుతుపవనాల చినుకులా సంబరం…థియేటర్లో ఎన్నో రోజులుగా ఎదురుచూస్తున్న సినిమా టికెట్.. బ్లాక్‌లో కాకుండా కౌంటర్‌లోనే దొరికినంత సంతోషం….ఒక్క బంగారం ధరలు పతనమన్న వార్త మధ్యతరగతి ఇళ్లల్లో కనిపిస్తోంది. ముఖ్యంగా మహిళల మొహాల్లో వెయ్యి వాట్ల బల్బు వెలిగినంత హ్యాపీనెస్ జిగేల్‌మంటోంది. మగవారికి జీతం పెరిగినప్పుడు వచ్చే సంతోషం ఒకెత్తయితే..మహిళలకు బంగారం ధర తగ్గినప్పుడు వచ్చే ఆనందం ఇంకో ఎత్తు. ఎందుకంటే, మధ్యతరగతి మహిళల దృష్టిలో బంగారం అనేది కేవలం ఒక నగ కాదు..అది వారి కష్టార్జితం, దాచుకున్న రహస్య పొదుపు, ఆపదలో ఆదుకునే ఒక నమ్మకం. నెలనెలా దాచుకున్న చిట్టీ డబ్బులు తీసి ఓ చిన్న ముక్కుపుడకో, ఉంగరమో కొనడం ఆడవాళ్లు ఆర్థికభద్రతగా భావిస్తారు. పెళ్లిళ్లు పెట్టుకున్న తల్లిదండ్రులకైతే..బంగారం రేట్లు తగ్గడం గుండె మీద భారం దిగినంత ఊరట. మొన్నటి వరకు తులం బంగారం లక్షా అరవై వేల దాకా వెళ్తే..ఇక మన జీవితంలో బంగారం కొనలేమేమో అని చాలామంది నిట్టూర్చారు. కానీ ఇప్పుడు ధరలు దిగివస్తుండటం కొనేవారికి కాస్త రిలీఫ్. బంగారాన్ని పెట్టుబడిగా చూసేవారికి కొంచెం ఇష్టం..కొంచెం కష్టంగా అనిపించినా…గోల్డ్ రేట్స్ తగ్గుతుండటాన్ని ఎక్కువమంది స్వాగతిస్తున్నారు.

బంగారం ధర పది రోజుల్లో ఏకంగా 10 వేల 690 రూపాయలు తగ్గింది. గురువారం 24 క్యారెట్ల తులం బంగారం లక్షా 45 వేల 640కి దిగి వచ్చింది. ఒక్కరోజులోనే 2 వేలకు పైగా తగ్గింది. కొన్ని రోజులుగా బంగారం ధరలు తీవ్రంగా ఒడిదొడుకులకు లోనవుతున్నాయి. బుధవారం మార్కెట్‌ సెషన్‌లో తులంపై 4300, గురువారం రోజు గరిష్టంగా చెన్నైలో 3270 వరకు తగ్గింది. నిన్నమొన్నటి వరకు ఆకాశమే హద్దుగా దూసుకెళ్లిన పసిడి..ఇప్పుడు ఒక్కసారిగా కిందకి దిగివస్తోంది. జూన్ 2న 24 క్యారెట్ల బంగారం ధర లక్షా 56 వేల 622. అదే 22 క్యారెట్ల గోల్డ్ లక్షా 43 వేల 200. జూన్ 3న 24 క్యారెట్ల పుత్తడి లక్షా 56 వేల 622. 22 క్యారెట్ల రేటు కూడా మారలేదు. జూన్ 4న 24 క్యారెట్ల పసిడి లక్షా 56 వేల 110. 22 క్యారెట్లు లక్షా 43 వేల 100. జూన్ 5న లక్షా 55 వేల 730కి ధర పడిపోయింది. 22 క్యారెట్ల బంగారం లక్షా 42 వేల 750కి దిగివచ్చింది. జూన్ 6న ఏకంగా 3 వేలు తగ్గిన 24 క్యారెట్ల పసిడి…లక్షా 52 వేల 730కి డౌన్‌ అయ్యింది. 22 క్యారెట్ల గోల్డ్ కూడా లక్షా 40 వేలకు పడింది. జూన్ 7న ధరల్లో ఎలాంటి మార్పు లేదు. జూన్ 8న వెయ్యి తగ్గిన 24 క్యారెట్ల బంగారం రేటు…లక్షా 51 వేల 690కి దిగి వచ్చింది. 22 క్యారెట్లు లక్షా 39 వేలకు పడిపోయింది. జూన్ 9న 14 వందలు పెరిగిన 24 క్యారెట్ల బంగారం లక్షా 53వేల 160కి పెరిగింది. అదే 22 క్యారెట్లయితే, లక్షా 40 వేల 400 అయ్యింది. జూన్ 10న ఏకంగా 5 వేల 300 తగ్గింది పసిడి. 24 క్యారెట్ల పుత్తడి లక్షా 47 వేల 770కి పడిపోయింది. అదే 22 క్యారెట్ల గోల్డ్ లక్షా 35 వేల 450కి దిగొచ్చింది. జూన్ 11న 24 క్యారెట్ల బంగారం 2వేలకు పైగా తగ్గి లక్షా 45 వేల 640కి పడిపోయింది. 22 క్యారెట్ల పసిడి లక్షా 33 వేల 500కి డౌన్‌ అయ్యింది. పది రోజుల్లో 22 క్యారెట్ల బంగారం 9 వేల 720కి పైగా తగ్గింది.

2026 ప్రారంభంలో అంతర్జాతీయ మార్కెట్లో రికార్డ్ స్థాయిలో ఒక ఔన్స్ బంగారం ధర దాదాపు 5,500 నుంచి 5,600 డాలర్ల దగ్గర ఆల్‌టైమ్ హైని తాకింది. కానీ, గడిచిన కొన్ని వారాల్లోనే అది ఏకంగా 4,200 డాలర్ల స్థాయికి పడిపోయింది. అంటే దాదాపు 15 నుంచి 20 శాతం వరకు క్షీణత. ఇరాన్‌ యుద్ధం మళ్లీ ఉద్రిక్తతలను పెంచుతోంది. ద్రవ్యోల్బణం భయపెడుతోంది.. అయినా సరే, సేఫ్ హెవెన్ గా భావించే బంగారం ధరలు ఎందుకు తగ్గుతున్నాయి.. దీని వెనుక గ్లోబల్ ఎకనామిక్ గేమ్ ఏంటన్న విశ్లేషణ సాగుతోంది. అంతర్జాతీయ మార్కెట్లో బంగారం ధరలు 15శాతానికి పైగా తగ్గితే, ఇండియాలో కేవలం 4 నుంచి 5 శాతమే తగ్గాయి. దీనికి కారణం మన రూపాయి విలువ డాలర్‌తో పోలిస్తే బలహీనపడటం. అలాగే 2026 మేలో భారత ప్రభుత్వం కస్టమ్స్ డ్యూటీని 6శాతం నుంచి 15శాతానికి పెంచడం. ఈ డ్యూటీ పెంపుతో మన దేశీయ మార్కెట్లో పూర్తి స్థాయిలో తగ్గుదల ప్రభావం కనిపించలేదు.

ప్రపంచవ్యాప్తంగా బంగారం ట్రేడింగ్ అంతా అమెరికన్ డాలర్లలోనే జరుగుతుంది. డాలర్‌కు, గోల్డ్‌కు ఎప్పుడూ వ్యతిరేక సంబంధమే. ప్రస్తుతం అమెరికా ఆర్థిక వ్యవస్థ ఊహించిన దానికంటే బలంగా ఉంది. డాలర్ బలంగా మారినప్పుడు, ఇతర కరెన్సీలు ఉపయోగించే దేశాలకు బంగారం కొనడం ఖరీదైన వ్యవహారం. దీనివల్ల అంతర్జాతీయంగా పుత్తడికి డిమాండ్ తగ్గి, ధరలు తగ్గుముఖం పడతాయి. 2026 ప్రారంభంలో, యూఎస్ ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గిస్తుందని అందరూ భావించారు. వడ్డీ రేట్లు తగ్గితే బంగారం ధరలు పెరుగుతాయి. కానీ సీన్ రివర్స్ అయింది. అమెరికాలో ఇటీవల విడుదలైన ఉద్యోగాల గణాంకాలు చాలా బలంగా వచ్చాయి. దీనికి తోడు పశ్చిమాసియా సంక్షోభం కారణంగా ముడిచమురు ధరలు బ్యారెల్‌కు పైపైకి ఎగబాకాయి. చమురు పెరగడంతో ద్రవ్యోల్బణం మళ్లీ పెరుగుతుందనే భయాలు మొదలయ్యాయి. ఫలితంగా, యూఎస్ ఫెడ్ తన వడ్డీ రేట్ల కోతను సెప్టెంబర్ 2026 లేదా ఆ తర్వాతకు వాయిదా వేసింది. వడ్డీ రేట్లు ఎక్కువగా ఉన్నంత కాలం, పెట్టుబడిదారులు బంగారాన్ని వదిలి బాండ్లపై దృష్టి పెడతారు. ఎందుకంటే బంగారం ఎలాంటి వడ్డీని ఇవ్వదు, కానీ యూఎస్ బాండ్లు ప్రస్తుతం దాదాపు 1.74శాతం రియల్ ఈల్డ్‌ను అందిస్తున్నాయి. దీంతో గోల్డ్ డిమాండ్ తగ్గి…రేట్లు డౌనయ్యాయి.

మార్జిన్ కాల్స్, ఫోర్స్‌డ్ సెల్లింగ్ కూడా బంగారం ధరలు దిగిరావడానికి కారణం. మార్కెట్లు పడిపోయినప్పుడు, పెద్ద పెద్ద ఫండ్ మేనేజర్లు, ఇన్వెస్టర్లు భారీగా నష్టపోతారు. వారికి మార్జిన్ కాల్స్ వస్తాయి. నష్టాలను పూడ్చడానికి తక్షణమే నగదు అవసరమవుతుంది. అటువంటప్పుడు వారు ప్రపంచంలోనే అత్యంత లిక్విడిటీ ఆస్తి అయిన బంగారాన్ని విక్రయించి క్యాష్ చేసుకుంటారు. అంటే, బంగారంపై నమ్మకం లేక కాదు.. ఇతర నష్టాలను కవర్ చేయడానికి బంగారాన్ని బలవంతంగా అమ్ముతున్నారు. 2008 ఆర్థిక సంక్షోభంలో, 2020 కోవిడ్ క్రాష్‌లో కూడా మొదట బంగారం ఇలాగే పడిపోయి, తర్వాత పుంజుకుంది. రెండేళ్లుగా చైనా, రష్యా, ఇండియాతో సహా ప్రపంచ దేశాల సెంట్రల్ బ్యాంకులు టన్నుల కొద్దీ బంగారాన్ని కొనుగోలు చేస్తూ వచ్చాయి. అయితే, వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ లేటెస్ట్ రిపోర్ట్ ప్రకారం, 2026 మొదటి క్వార్టర్‌లో సెంట్రల్ బ్యాంకుల కొనుగోళ్లు దాదాపు 22శాతం తగ్గాయి. బంగారం ధరలు విపరీతమైన గరిష్ట స్థాయికి చేరడంతో, బ్యాంకులు కూడా కొత్త కొనుగోళ్లను కాస్త ఆపి, ప్రాఫిట్ బుకింగ్ వైపు మొగ్గు చూపాయి. అలాగే రష్యా సెంట్రల్ బ్యాంకు కూడా భారీగా భౌతిక బంగారం అమ్మేసుకుంటోంది. ఉక్రెయిన్‌ నాలుగేళ్లుగా యుద్ధం చేస్తున్న రష్యా…వార్‌ను కంటిన్యూ చెయ్యడానికి అవసరమైన వనరులను సమకూర్చుకోవడానికి గోల్డ్ వదిలించుకుంటోంది. ఈ నాలుగు నెలల్లో సుమారు 30 టన్నుల గోల్డ్‌ను సెల్ చేసింది.

ఫిజికల్‌ గోల్డ్ కు డిమాండ్ తగ్గడం కూడా రేట్ల పడిపోవడానికి మరో కారణం. భారత్, చైనా వంటి దేశాల్లో ఆభరణాల డిమాండ్ గణనీయంగా పడిపోయింది. 2025, 2026 లలో ధరలు లక్షన్నర దాటడంతో సామాన్య, మధ్యతరగతి ప్రజలు బంగారం కొనడం తగ్గించేశారు. పెళ్లిళ్ల సీజన్ ఉన్నప్పటికీ, లైట్ వెయిట్ జ్యువెలరీ లేదా పాత బంగారాన్ని మార్పిడి చేసుకోవడం పెరిగింది. మన దేశంలో బంగారం ధర పూర్తిగా అంతర్జాతీయ మార్కెట్ మీద మాత్రమే ఆధారపడి ఉండదు. కొన్ని లోకల్ ఫ్యాక్టర్స్ పనిచేస్తాయి. డాలర్-రూపాయి మార్పిడి రేటు అందులో ఒకటి. డాలర్ ఇండెక్స్ పెరగడం వల్ల రూపాయి విలువ దాదాపు 95 రూపాయల మార్కును దాటి వెళుతోంది. రూపాయి బలహీనపడితే మనం దిగుమతి చేసుకునే బంగారం ఖరీదవుతుంది. దిగుమతులు కూడా తగ్గుతాయి. డిజిటల్ గోల్డ్, ETFల ట్రెండ్ బాగా పెరిగింది. భౌతిక బంగారం కంటే ఇప్పుడు యువత గోల్డ్ ఇటిఎఫ్‌లు, డిజిటల్ గోల్డ్ వైపు మొగ్గు చూపుతున్నారు. అయితే ధరలు భారీగా పెరగడంతో మార్చి, ఏప్రిల్ నెలల్లో ఈ ఈటిఎఫ్ ఇన్‌ఫ్లో కూడా తగ్గింది. డిమాండ్ సప్లై సూత్రం ప్రకారం…డిమాండ్ డౌనయ్యింది…రేటు దిగొచ్చింది.

భారతదేశం 90 శాతం బంగారాన్ని దిగుమతి చేసుకుంటోంది. అలాగే 90శాతం చమురుకు దిగుమతే ఆధారం. చమురు దేశ ఆర్థిక వ్యవస్థకు ఇంధనమైతే….బీరువాల్లో మూలిగే గోల్డ్‌తో దేశానికి ఎలాంటి ఉపయోగం లేదు. దీనికి తోడు డిమాండ్‌కు తగ్గట్టు ప్రతి ఏడాది డాలర్లను చెల్లించి బంగారం దిగుమతి చేసుకుంటే…నిత్యావసరమైన క్రూడాయిల్, ఇతర ఆహార, మెడిసిన్‌, ఫెర్జిలైజర్స్ దిగుమతికి ఇబ్బంది. అందుకే దేశంలో విదేశీ మారక నిల్వలను కాపాడటానికి ఒక్క ఏడాది పాటు అనవసరమైన బంగారం కొనడం ఆపాలని ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలను కోరారు. పశ్చిమ ఆసియా యుద్ధంతో చమురు ధరలు పెరిగాయని…ఆయిల్ కొనడానికి డాలర్లు కావాలి కాబట్టి.. బంగారం దిగుమతులు తగ్గించాలని పిలుపునిచ్చారు. ప్రధాని మోడీ ప్రకటన వచ్చిన మరుసటి రోజే కేంద్ర ప్రభుత్వం రంగంలోకి దిగింది. బంగారం, వెండి దిగుమతులపై కస్టమ్స్ డ్యూటీని 6శాతం నుంచి ఏకంగా 15శాతానికి పెంచుతూ సంచలన నిర్ణయం తీసుకుంది. సుంకం పెరగడం వల్ల విదేశాల నుంచి అధికారికంగా బంగారం దిగుమతి చేసుకోవడం ఖరీదైన వ్యవహారంగా మారింది. ఇది దేశీయంగా బంగారం కొత్త కొనుగోళ్లను చాలా వరకు నియంత్రించింది. మోడీ పిలుపునిచ్చిన 10 రోజుల్లోనే దేశంలోని కొన్ని ప్రాంతాల్లో జ్యువెలరీ షాపుల్లో సేల్స్ 80శాతం పడిపోయాయి. కస్టమర్ల ఆలోచనాధోరణి కూడా కొంత మారిందని కొందరు బులియన్ మార్కెట్ నిపుణుల అభిప్రాయం. 10 మందిలో ఆరుగురు ఈ ఏడాది బంగారం కొనకూడదని ఫిక్స్ అయ్యారు.

సాధారణంగా ధరలు తగ్గుతున్నప్పుడు జనం షాపులకు క్యూ కట్టి విపరీతంగా బంగారం కొనేస్తుంటారు. కానీ ఈసారి ప్రధాని స్వయంగా హెచ్చరించడం, దానికి తోడు పన్నులు పెరిగి దేశీయంగా ధరలు ఆశించినంత వేగంగా తగ్గకపోవడంతో.. మధ్యతరగతి ప్రజలు, జ్యువెలరీ ప్రియులు కొత్త కొనుగోళ్లను వాయిదా వేసుకున్నారు. పెళ్లిళ్ల సీజన్ ఉన్నప్పటికీ చాలామంది పాత బంగారాన్ని మార్పిడి చేసుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చారు. ప్రధాని కేవలం సెంటిమెంట్‌తోనో, రాజకీయ కోణంలోనో బంగారం కొనొద్దన్న మాట అనలేదు. దీని వెనుక పెద్ద ఆర్థిక పరిస్థితులు, వ్యూహం వున్నాయి. ఇండియా తన దేశీయ అవసరాల కోసం బంగారాన్ని విదేశాల నుంచి భారీగా దిగుమతి చేసుకుంటుంది. దీని కోసం మనం బిలియన్ల కొద్దీ అమెరికన్ డాలర్లను చెల్లించాల్సి వస్తుంది. ఇటీవల అంతర్జాతీయ ఉద్రిక్తలతో డాలర్‌తో పోలిస్తే రూపాయి విలువ 95 రూపాయల మార్క్‌ను టచ్ చేసింది. ఇలాంటి సమయంలో దేశంలో బంగారం కొనుగోళ్లు పెరిగితే, డాలర్లు విదేశాలకు తరలిపోయి రూపాయి మరింత బలహీనపడే ప్రమాదం ఉంది. దీంతో అత్యవసరమైన చమురు, మెడిసిన్, ఎరువులు కొనడం మరింత భారమవుతుంది. మోడీ పిలుపు, 15శాతం డ్యూటీ భారం వల్ల బంగారం దిగుమతుల వేగం తగ్గి, విదేశీ మారక నిల్వలు పెరిగాయి. 938 మిలియన్ డాలర్లు పెరిగి….దేశంలోని 69 బిలియన్ల విదేశీ మారక నిల్వలు సురక్షితంగా ఉన్నాయి. ప్రధాని మోడీ పిలుపు ఇందుకు దోహదం చేసింది.

భౌతిక రూపంలో బంగారం కొని లాకర్లలో దాచడం వల్ల దేశ ఆర్థిక వ్యవస్థకు ఎలాంటి ఉపయోగం ఉండదు. అందుకే, మోడీ పిలుపుతో ఇన్వెస్టర్లు కూడా రూట్ మార్చారు. ఫిజికల్ గోల్డ్ వైపు కాకుండా సావరెన్ గోల్డ్ బాండ్లు, గోల్డ్ ఈటీఎఫ్‌ల వైపు దృష్టి పెట్టారు. డిజిటల్ చెల్లింపుల విస్తరణ, యూపీఐ వినియోగం పెరగడం, ఫిన్‌టెక్ ప్లాట్‌ఫామ్‌ల అభివృద్ధి డిజిటల్ గోల్డ్ మార్కెట్ వృద్ధికి ప్రధాన కారణాలుగా నిలుస్తున్నాయి. ఫోన్‌పే, గూగుల్ పే, పేటీఎం లాంటి యాప్‌ల ద్వారా వినియోగదారులు ఎప్పుడైనా, ఎక్కడ్నుంచైనా బంగారాన్ని కొనుగోలు చేసే అవకాశం ఉంది. దీంతో సంప్రదాయ బంగారం కొనుగోలు విధానాలకు ప్రత్యామ్నాయంగా నిలుస్తున్నాయి డిజిటల్ గోల్డ్ కొనుగోళ్లు.

వరల్డ్‌ గోల్డ్ కౌన్సిల్ ప్రకారం.. భారతదేశంలో 2025లో డిజిటల్ గోల్డ్ కొనుగోళ్లు 69 శాతం పెరిగి 13.5 టన్నులకు చేరుకున్నాయి. ఇదే సమయంలో యూపీఐ ద్వారా డిజిటల్ గోల్డ్ కొనుగోళ్ల విలువ భారీగా పెరిగింది. 2025 జనవరిలో సుమారు ఎనిమిది వందల కోట్లుగా ఉన్న లావాదేవీలు… డిసెంబరు నాటికి 21 వందల కోట్లకుపైగా చేరినట్లు పరిశ్రమ వర్గాలు చెబుతున్నాయి. 2024 ఏప్రిల్‌తో పోలిస్తే 2025 ఆగస్టు నాటికి డిజిటల్ గోల్డ్ లావాదేవీల సంఖ్య 377 శాతం పెరగడం… ఈ రంగం విస్తరిస్తున్న వేగాన్ని సూచిస్తోంది. ముఖ్యంగా 20 నుంచి 35 ఏళ్ల మధ్య వయస్సు కలిగినవారు ఈ పెట్టుబడి విధానాన్ని ఎక్కువగా ఎంచుకుంటున్నట్లు చెబుతున్నారు మార్కెట్ నిపుణులు. స్టాక్స్, మ్యూచువల్ ఫండ్స్ మాదిరిగానే మొబైల్ ఫోన్‌లో కొన్ని క్లిక్‌లతో బంగారం కొనుగోలు చేయగలగడంతో… పెట్టుబడులు ఈజీ అవుతున్నాయి. చిన్న మొత్తాలతో పెట్టుబడి ప్రారంభించే అవకాశం కూడా యువతను డిజిటల్ గోల్డ్ వైపు ఆకర్షిస్తోంది. సాధారణంగా భౌతిక బంగారం కొనుగోలు చేయాలంటే వేల రూపాయలు అవసరమవుతాయి. డిజిటల్ గోల్డ్‌లో ఒకటి నుంచి వంద రూపాయల చిన్న మొత్తాల నుంచే పెట్టుబడి ప్రారంభించవచ్చు. దీంతో విద్యార్థులు, యువ ఉద్యోగులు, చిన్న పెట్టుబడిదారులు కూడా డిజిటల్‌ బంగారంలో పెట్టుబడి పెట్టగలుగుతున్నారు. అదనంగా… నెలవారీ ఆటోమేటిక్ సేవింగ్స్ విధానాల ద్వారా క్రమం తప్పకుండా బంగారం కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది.

వినియోగదారుడు కొనుగోలు చేసిన డిజిటల్ గోల్డ్ మొత్తానికి సమానమైన స్వచ్ఛమైన బంగారాన్ని సేవా సంస్థలు భద్రపరిచిన సురక్షిత వాల్ట్‌లలో నిల్వ ఉంచుతాయి. వినియోగదారుడు కోరుకున్నప్పుడు దానిని విక్రయించవచ్చు లేదంటే నిర్దిష్ట పరిమాణానికి చేరిన తర్వాత భౌతిక బంగారంగా మార్చుకోవచ్చు. దీంతో నిల్వ, భద్రత, లాకర్ ఖర్చులు వంటి సమస్యలు లేకుండా బంగారంలో పెట్టుబడి పెట్టే అవకాశం లభిస్తోంది. అంతర్జాతీయంగా నెలకొంటున్న ఆర్థిక అనిశ్చితులు, ద్రవ్యోల్బణ భయాలు, భౌగోళిక ఉద్రిక్తతల కారణంగా బంగారం ధరలు పెరుగుతున్నాయి. సురక్షిత పెట్టుబడిగా భావించే బంగారంపై పెట్టుబడిదారుల ఆసక్తి పెరగడంతో డిజిటల్ గోల్డ్ కొనుగోళ్లు కూడా వేగంగా పెరుగుతున్నాయని మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. దీర్ఘకాలికంగా సంపదను కాపాడుకునే సాధనంగా బంగారాన్ని పరిగణించే భారతీయుల సంప్రదాయ దృక్పథం ఈ వృద్ధికి తోడ్పడుతోంది.

అయితే… డిజిటల్ గోల్డ్ రంగంలో కొన్ని సవాళ్లున్నాయి. ప్రస్తుతం ఈ విభాగానికి సంబంధించి పూర్తి స్థాయి నియంత్రణ వ్యవస్థ లేకపోవడం పెట్టుబడిదారుల్లో కొంత ఆందోళన కలిగిస్తోంది. మార్కెట్ నియంత్రణ సంస్థ సెబీ.. డిజిటల్ గోల్డ్ ఉత్పత్తులు తన ప్రత్యక్ష నియంత్రణ పరిధిలో లేవని గతంలో స్పష్టం చేసింది. దీంతో సేవలు అందిస్తున్న సంస్థ విశ్వసనీయత, బంగారం నిల్వ విధానం, స్వతంత్ర ఆడిట్ ప్రక్రియలు, కొనుగోలు అమ్మకాల నిబంధనలను పరిశీలించాలని పెట్టుబడిదారులకు సూచిస్తున్నారు నిపుణులు. ఏడాది పాటు బంగారం కొనొద్దన్న ప్రధాని నరేంద్ర మోడీ పిలుపు…తారకమంత్రంలా పని చేసిందనడానికి తగ్గిన గోల్డ్ డిమాండ్, అదే వరుసలో దిగివచ్చిన రేట్లే నిదర్శనం.

బంగారం కొనేవారికి, ఇన్వెస్టర్లకు నాలుగు నెలలు ఒక రోలర్ కోస్టర్ రైడ్‌ని తలపించాయి. అంతర్జాతీయ మార్కెట్‌లో ఒక ఔన్స్ పసిడి ధర కేవలం నాలుగు నెలల వ్యవధిలోనే ఎవరూ ఊహించని రికార్డులను సృష్టించింది. అంతే వేగంగా కిందకూ పడిపోయింది. 2026 ప్రారంభంలో ప్రపంచవ్యాప్త యుద్ధ ఉద్రిక్తతలు, సెంట్రల్ బ్యాంకుల విపరీతమైన కొనుగోళ్లతో అంతర్జాతీయ స్పాట్ గోల్డ్ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ఒక ఔన్స్ ధర 5,595 మార్కును తాకి సరికొత్త ఆల్‌టైమ్ రికార్డ్‌ను సృష్టించింది. ఈ స్థాయి గరిష్టాల తర్వాత మార్కెట్ కాస్త కూల్ అయింది. మార్చి, ఏప్రిల్ నెలల నాటికి ధరలు 4,630 డాలర్ల నుంచి 4,680 డాలర్ల శ్రేణికి చేరుకుని కొంత స్థిరంగా సాగాయి. గడిచిన కొన్ని వారాల్లో, ముఖ్యంగా జూన్ మొదటి వారంలో బంగారం ధరలు నిలువునా మునిగాయి. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్లో ఒక ఔన్స్ బంగారం ధర 4 వేల 90 డాలర్లకు అటుఇటుగా కదలాడుతోంది.

ఔన్స్ గోల్డ్ రేటు తగ్గిపోవడానికి ఒక కారణం యూఎస్ ఫెడ్ రివర్స్ గేర్. అమెరికాలో ఉద్యోగాల గణాంకాలు బలంగా రావడంతో, వడ్డీ రేట్ల కోతను యూఎస్ ఫెడ్ వాయిదా వేసింది. ఇది బంగారానికి మైనస్ అయింది. అమెరికా డాలర్ ఇండెక్స్ 100 మార్కును దాటి బలోపేతం కావడంతో గ్లోబల్ ఇన్వెస్టర్లు బంగారాన్ని అమ్మి డాలర్లలో పెట్టుబడి పెట్టారు. 5,600 డాలర్ల దగ్గర బంగారం అత్యంత ఖరీదైన ఆస్తిగా మారడంతో గ్లోబల్ ఫండ్స్ అన్నీ లాభాలను స్వీకరిస్తూ అమ్మకాలకు దిగడంతో రేట్లు నేలకు దిగాయి. తగ్గుముఖం పట్టిన బంగారం ధరలు…ఇంకెంతగా తగ్గుతాయన్నది బులియన్ మార్కెట్‌లో హాట్‌టాపిక్‌ అయ్యింది. రాబోయే కాలంలో బంగారం ధరలు ఎలా వుంటాయన్నదానిపై బులియన్ మార్కెట్‌లో రకరకాల అంచనాలు వినిపిస్తున్నాయి.
ప్రముఖ గ్లోబల్ ఫైనాన్షియల్ సంస్థలైన జె.పి. మోర్గాన్, గోల్డ్‌మన్ సాక్స్, ఐసీఐసీఐ డైరెక్ట్ తాజా నివేదికల ప్రకారం.. రాబోయే ఆరు నెలల్లో మార్కెట్ రెండు వైపులా కదిలే అవకాశం ఉంది. అమెరికాలో ద్రవ్యోల్బణం మళ్లీ పెరగడం వల్ల యూఎస్ ఫెడ్ వడ్డీ రేట్లను తగ్గించకుండా.. డిసెంబర్ 2026 వరకు వాయిదా వేసేలా కనిపిస్తోంది. దీనివల్ల బంగారంపై స్వల్పకాలిక ఒత్తిడి ఉంటుంది. దీంతో రేట్లు బాగా తగ్గుతాయని, లక్ష రూపాయలకు తగ్గినా ఆశ్చర్యంలేదని కొందరు అంచనా వేస్తున్నారు.

దేశీయంగా బంగారం డిమాండ్ తగ్గినప్పటికీ, 2026 చివరి నాటికి పుత్తడి ధరలు సరికొత్త రికార్డులను సృష్టిస్తాయని మరికొందరు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఇరాన్‌, అమెరికా, ఇజ్రాయెల్ యుద్ధం ఉద్రిక్తత పెరుగుతోంది. చమురు రేట్లు పెరుగుతాయన్న ఆందోళన పెరుగుతోంది. దీంతో ప్రపంచవ్యాప్త సెంట్రల్ బ్యాంకులు ద్రవ్యోల్బణం నుంచి రక్షణకు టన్నుల కొద్దీ బంగారాన్ని కొనుగోలు చేస్తూనే ఉన్నాయి. మూడేళ్లతో పోలిస్తే 2025లో సెంట్రల్ బ్యాంకుల బంగారం కొనుగోళ్లు 22శాతం తగ్గి 848 టన్నులకు పరిమితమయ్యాయి. అయినప్పటికీ, డాలర్‌పై ఆధారపడటం తగ్గించుకోవడానికి బ్యాంకులు ఇప్పటికీ భారీ స్థాయిలోనే బంగారాన్ని నిల్వ చేసుకుంటున్నాయి. 2026 చివరి నాటికి పదిగ్రాముల పుత్తడి ధర లక్షా 90 వేలకు చేరుతుందని మరికొందరు బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

భారతదేశంలో సంస్కృతి, పెళ్లిళ్లు, పండుగలతో బంగారం ముడిపడి ఉన్నందున డిమాండ్ తాత్కాలికంగా తగ్గినప్పటికీ పూర్తిగా ఇదే ట్రెండ్ కొనసాగే అవకాశం లేదు. దీర్ఘకాలంలో బంగారం ఎప్పుడూ సురక్షితమైన, లాభదాయకమైన పెట్టుబడిగానే కొనసాగుతుంది. బంగారం, వెండి వంటి విలువైన లోహాల ధరలు అంతర్జాతీయ విపణికి అనుగుణంగానే ఉంటాయి. అక్కడ పెరిగితే ఇక్కడా పెరుగుతుంది. తగ్గినా అంతే. దీంతో తగ్గినప్పుడు కొద్దికొద్దిగా కొనడం మంచిదని బులియన్ మార్కెట్ నిపుణులు చెబుతున్నారు. మెటల్స్ ఫోకస్ నివేదిక ప్రకారం, ఈ ఏడాది బంగారానికి డిమాండ్ మరింత తగ్గుతుంది. సరఫరా మాత్రం పెరుగుతుందని అంచనా. అయినా బంగారం రేటు మాత్రం పెరుగుతుందని లెక్కలేస్తోంది. వినియోగదారులు ఆభరణాలు కొనడం తగ్గించినప్పటికీ, సురక్షితమైన పెట్టుబడిగా భావించి బిస్కెట్లు, కాయిన్స్ రూపంలో బంగారంపై భారీగా పెట్టుబడి పెట్టడమే ఈ ధరల పెరుగుదలకు ప్రధాన కారణమని బులియన్ మార్కెట్ నిపుణులు అంచనా వేస్తున్నారు.

వరల్డ్ గోల్డ్ కౌన్సిల్ గణాంకాల ప్రకారం కొంతకాలంగా దేశంలో ఆభరణాల డిమాండ్ తగ్గుముఖం పట్టింది. టన్నుల కొద్దీ బంగారం కొనే మన దేశంలో.. గ్రాములు కొనడానికి కూడా సామాన్యుడు వెనుకాడుతున్నాడు. షాపులు కస్టమర్లు లేక ఖాళీగా దర్శనమిస్తున్నాయి. వ్యాపారులు డిస్కౌంట్లు ఇస్తామన్నా జనం అడుగు ముందుకు వేయడం లేదు. శతాబ్దాలుగా వస్తున్న గోల్డ్ సెంటిమెంట్‌ను దాటి ప్రజలు ఆలోచిస్తున్నారు. బంగారం ధరలు తగ్గినా…కొనుగోళ్లు పెరగడకపోవడం ప్రజల ఆలోచనా ధోరణిలో మార్పునకు ఒక నిదర్శనం. గోల్డ్ కొనుగోళ్లు తగ్గడం అనేది కేవలం ఒక లోహం ముచ్చట కాదు. ఇది దేశంలోని మధ్యతరగతి ప్రజల కొనుగోలు శక్తి తగ్గుతోందనడానికి, వారి ఆర్థిక సందిగ్ధతకు ఒక ప్రత్యక్ష నిదర్శనం. అలాగే ప్రధాని నరేంద్ర మోడీ పిలుపునకు జనం ఏస్థాయిలో జేజేలు కొడతారు అనడానికి…తగ్గిన గోల్డ్ డిమాండే ఉదాహరణ.