Reading Time: < 1 minute
Tripura Govt New Office Timings 5 Day Work Week Telangana Demand

ఉద్యోగుల పని-వ్యక్తిగత జీవితాల మధ్య సమతుల్యతను పెంపొందించడం, అదే సమయంలో ప్రభుత్వ కార్యాలయాల్లో ఉత్పాదకతను పెంచడం లక్ష్యంగా త్రిపుర ముఖ్యమంత్రి డాక్టర్ మాణిక్ సాహా నేతృత్వంలోని ప్రభుత్వం కీలక పరిపాలనా సంస్కరణను ప్రవేశపెట్టింది. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల కోసం సరికొత్త కార్యాలయ వేళలను ప్రకటిస్తూ నోటిఫికేషన్ విడుదల చేసింది.

ఇప్పటివరకు ఉదయం 10:00 గంటల నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు ఉన్న ఆఫీస్ సమయాన్ని మార్పు చేస్తూ.. ఇకపై పనిదినాల్లో ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 6:00 గంటల వరకు పొడిగించారు. ఈ అదనపు పనివేళలకు బదులుగా.. ఉద్యోగులకు ఊరటనిస్తూ అన్ని శనివారాలను సెలవు దినాలుగా ప్రకటిస్తూ ప్రభుత్వం సంచలన నిర్ణయం తీసుకుంది. గతంలో కేవలం రెండు, నాలుగో శనివారాలు మాత్రమే సెలవుగా ఉండేవి. వారంతంలో రెండు రోజులు పూర్తి సెలవు దొరకడం వల్ల ఉద్యోగులు కుటుంబంతో గడపడానికి, మానసిక ఉల్లాసానికి వీలవుతుందని ప్రభుత్వం భావిస్తోంది.

ఉద్యోగుల హర్షం..
ఈ నిర్ణయంపై త్రిపుర సచివాలయ సీనియర్ అధికారి దులాల్ దేబ్ , ఫారెస్ట్ డిపార్ట్‌మెంట్ ఉద్యోగి డాక్టర్ క్వీన్ శర్మ స్పందిస్తూ.. ఇది ఎంతో మంచి నిర్ణయమని కొనియాడారు. కేంద్ర ప్రభుత్వ, ఇతర రాష్ట్రాల ఉద్యోగుల తరహాలోనే తాము కూడా ఈ కొత్త వేళలకు అలవాటు పడతామని, జాతీయ స్థాయి జీతభత్యాలు ఆశించినప్పుడు ఆ స్థాయి పనితీరును ప్రదర్శించడానికి సిద్ధంగా ఉన్నామని తెలిపారు.

తెలంగాణ ఉద్యోగుల డిమాండ్..
త్రిపుర ప్రభుత్వం తీసుకున్న ఈ వినూత్న నిర్ణయం ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశమైంది. ముఖ్యంగా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు కూడా ఈ విధానంపై ఆసక్తి చూపిస్తున్నారు. “వారంలో ఐదు రోజులు అదనపు సమయం పనిచేయడానికైనా మేము సిద్ధమే, కానీ శనివారం కూడా సెలవు ఇస్తే కుటుంబ బాధ్యతలను చక్కబెట్టుకోవడానికి, మానసిక ఒత్తిడి దూరం చేసుకోవడానికి ఎంతో మేలు జరుగుతుంది” అని తెలంగాణ ఉద్యోగులు అభిప్రాయపడుతున్నారు. త్రిపుర తరహా విధానాన్ని తెలంగాణలో కూడా అమలు చేస్తే బాగుంటుందని ఇక్కడి ఉద్యోగ వర్గాలు కోరుతున్నాయి. మొత్తానికి.. పరిపాలనా సామర్థ్యాన్ని దెబ్బతీయకుండా ఉద్యోగుల సంక్షేమానికి ప్రాధాన్యతనిచ్చిన త్రిపుర ప్రభుత్వ నిర్ణయం.. ప్రభుత్వ రంగంలో ఒక కొత్త బెంచ్‌మార్క్‌గా నిలవనుంది.