Reading Time: 2 minutes

మమతకు మరో బిగ్ షాక్.. రాజ్యసభకు TMC ఎంపీ సుస్మితా దేవ్ రాజీనామా

Caption of Image.

కోల్‎కతా:  బెంగాల్ మాజీ సీఎం, టీఎంసీ అధినేత్ర మమత బెనర్జీకి మరో బిగ్ షాక్ తగిలింది. మమత బెనర్జీకి అత్యంత నమ్మకస్తురాలు, టీఎంసీ సీనియర్ నాయకురాలు సుష్మితా దేవ్ రాజ్యసభతో పాటు పార్టీ ప్రాథమిక సభ్యత్వానికి కూడా రాజీనామా చేశారు. ఈ మేరకు రాజ్యసభ ఛైర్మన్ సీపీ రాధాకృష్ణన్‌కు రాజీనామా లేఖ సమర్పించారు. తన రాజీనామాను తక్షణమే ఆమోదించాలని ఆమె కోరారు. 

ఇటీవల మమతకు నమ్మకస్తుడైన సుఖేందు శేఖర్ రాయ్ కూడా రాజ్యసభకు రాజీనామా చేసిన విషయం తెలిసిందే. రోజుల వ్యవధిలోనే మరో ఎంపీ రాజీనామా చేయడంతో మమతా బెనర్జీకి వరుస ఎదురు దెబ్బలు తగులున్నాయి. ఇటీవల జరిగిన బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో మమతా నేతృత్వంలోని టీఎంసీ ఘోర ఓటమి చవిచూసిన విషయం తెలిసిందే. 

ఈ ఓటమి నుంచి మమతా బెనర్జీ పతనం స్టార్ట్ అయ్యింది. ఎన్నికల్లో ఓటమి అనంతరం టీఎంసీ శాసన సభాపక్షం, పార్లమెంటరీ పక్షం రెండు వర్గాలుగా చీలిపోయాయి. ఎమ్మెల్యే, ఎంపీ రెబల్ గ్రూప్స్ అధికార బీజేపీ మద్దతు ప్రకటించడంతో టీఎంసీలో భారీ సంక్షోభం ఏర్పడింది. అధికారంలో ఉన్నప్పుడు ఏళ్ల పాటు మమతకు అత్యంత దగ్గరగా ఉన్న నేతలు కూడా ఓటమి అనంతరం పార్టీని వీడుతున్నారు. 

దీదీ గురించి నేను మాట్లాడను: సుష్మితా దేవ్

రాజీనామా అనంతరం సుష్మితా సేన్ మీడియాతో మాట్లాడుతూ.. తన రాజకీయ భవిష్యత్తు బెంగాల్‌లో కాకుండా అస్సాంలో ఉందని అన్నారు. నాకు వ్యక్తిగత, రాజకీయ కారణాలు రెండూ ఉన్నాయని.. నేను ఎక్కడ రాజకీయాలు చేయాలి, ఎలా చేయాలి అనేది నా వ్యక్తిగత హక్కు అని రాజీనామాకు గల కారణాలు వివరించారు. టీఎంసీ సభ్యత్వానికి రాజీనామా చేసినప్పుడు.. ఆ పార్టీ ద్వారా లభించిన రాజ్యసభ సీటును కూడా వదులుకోవాలని అన్నారు. 

ALSO READ : అత్యధిక కాలం పనిచేసిన ప్రధానిగా మోదీ

తృణమాల్ కాంగ్రెస్‎తో ఇక తన ప్రయాణం ముగిసిందన్నారు. తాను టీఎంసీని ఎందుకు విడిచిపెట్టాననేది ఒక పెద్ద కథ అని.. ఒకేసారి రెండు పడవలపై ప్రయాణించే పరిస్థితిలో ఉండాలనుకోవడం లేదన్నారు. మమతా దీదీ గురించి తాను ఎలాంటి వ్యాఖ్యలు చేయనని అన్నారు. రాజ్యసభ, టీఎంసీకి రాజీనామా చేసిన అనంతరం ఢిల్లీలో అస్సాం సీఎం హిమాంత బిస్వా శర్మతో సుష్మితా దేవ్ భేటీ అయ్యారు. దీంతో ఆమె త్వరలోనే కాషాయతీర్థం పుచ్చుకోనున్నట్లు ప్రచారం జరుగుతోంది. 
 

©️ VIL Media Pvt Ltd.