Reading Time: < 1 minute

మగపిల్లల మోజు ఇంకా వీడలేదు.. మారని సమాజ మనస్తత్వంపై సుప్రీంకోర్టు ఆందోళన

Caption of Image.
  • లింగవివక్షపై సుప్రీంకోర్టు తీవ్ర ఆందోళన 
  • దేశంలో ఇంకా లింగవివక్ష కొనసాగుతోందన్న ధర్మాసనం
  • మగపిల్లల మోజు ఇంకా వీడలేదు.. 
  • సమాజ మనస్తత్వంలో మార్పు రావాలని అభిప్రాయపడ్డ కోర్టు 

లింగవివక్షపై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఆడపిల్లల పట్ల దేశంలో ఇంకా వివక్ష కొనసాగుతోందని , సమాజంలో నిజమైన లింగ సమానత్వం రావాలని అభిప్రాయపడింది.దశాబ్దాలుగా ఎన్నో అవగాహన కార్యక్రమాలు, సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నప్పటికీ మగపిల్లలకు ఉన్న ప్రాధాన్యత ఇంకా పూర్తిగా తగ్గలేదని సుప్రీంకోర్టు ఆందోళన వ్యక్తం చేసింది. ఆడపిల్లల పట్ల వివక్షను రూపుమాపేందుకు సమాజం ఇంకా చాలా దూరం ప్రయాణించాల్సి ఉందని పేర్కొంది.

జనాభా లెక్కల గణాంకాలను ప్రస్తావించిన ధర్మాసనం..1991లో ప్రతి వెయ్యి మంది బాలురకు 945 మంది బాలికలు ఉండగా, 2001లో అది 927కు, 2011లో 919కు పడిపోయిందని గుర్తు చేసింది. ఈ లింగ అసమానత్వం, పిండం, లింగ నిర్ధారణను నిషేధించే PCPNDT చట్టాన్ని కఠినంగా అమలు చేయాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. 

ఇప్పటికీ కొన్ని రాష్ట్రాల్లో జననాల లింగ నిష్పత్తి జాతీయ సగటు కంటే తక్కువగా ఉండటం ఆందోళనకరమని కోర్టు వ్యాఖ్యానించింది. ఇది సమాజంలో పాతుకుపోయిన పితృస్వామ్య భావజాలానికి నిదర్శనమని, తెరవెనుక లింగ నిర్దారణ ఎంపికలు కొనసాగుతున్నాయని తెలిపింది.

►ALSO READ | వాహనదారులకు ఆర్టీఏ గుడ్ న్యూస్..ఫ్యాన్సీ నంబర్ల కోసం గడువు పెంపు

బేటీ బచావో బేటీ పఢావో, జననీ సురక్ష యోజన, లాడ్లీ లక్ష్మీ యోజన వంటి పథకాలను ప్రస్తావించిన సుప్రీంకోర్టు..ఇటువంటి కార్యక్రమాలు ఇంకా కొనసాగుతుండటం సమాజంలో బాలికల పట్ల వివక్ష పూర్తిగా తొలగిపోలేదని సూచిస్తోందని పేర్కొంది.

మహిళలు పుట్టుకతోనే బలహీనులు అనే భావనకు ముగింపు పలికి, సమానత్వం, గౌరవం ప్రధాన విలువలుగా నిలవాలని ధర్మాసనం స్పష్టం చేసింది. ఆడపిల్ల పుట్టాలా వద్దా అనే చర్చే అవసరం లేని సమాజం ఏర్పడాల్సిన అవసరం ఉందని అభిప్రాయం వ్యక్తం చేసింది.

©️ VIL Media Pvt Ltd.