Reading Time: < 1 minute

డబ్బులు అయిపోయి… చితికిపోతున్న హార్ట్ పేషేంట్ల కుటుంబాలు…

Caption of Image.

హైదరాబాద్, వెలుగు: గుండె జబ్బులు.. జనాలను ఆర్థికంగా కుదేలు చేస్తున్నాయి. మందులు కొనేందుకు డబ్బుల్లేక.. ట్రీట్​మెంట్​చేయించుకునే స్థోమత లేక అప్పులు చేయాల్సి వస్తున్నది. ఉన్న ఆస్తులను అమ్ముకోవాల్సి వస్తున్నది. దేశంలోని 33 శాతం మంది హార్ట్ ​పేషెంట్ల పరిస్థితి ఇదే. ఇండియన్​ కౌన్సిల్ ఫర్ మెడికల్ రీసెర్చ్ (ఐసీఎంఆర్) ఫండింగ్​తో చేసిన స్టడీలో ఈ విషయం వెల్లడైంది. 

దేశవ్యాప్తంగా 21 ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్న 2 వేల మంది హార్ట్ పేషెంట్ల నుంచి వివరాలు తీసుకుని ఈ రీసెర్చ్ చేశారు. గ్లోబల్ హార్ట్ అనే జర్నల్​లో ఈ రీసెర్చ్ పబ్లిష్ అయింది. ఏటా ఒక్కో హార్ట్​పేషెంట్ సగటున తన మందులు, ట్రీట్​మెంట్, డయాగ్నస్టిక్స్ కోసమే సుమారు రూ.1.06 లక్షలు ఖర్చు పెడుతున్నట్టు రీసెర్చ్​లో వెల్లడైంది.

ఆదాయం పోతున్నది..

గుండె జబ్బులున్నోళ్లకు నెలవారీ ఆదాయం పడిపోతున్నట్టు రీసెర్చ్ తేల్చింది. చాలా మంది ఆపరేషన్లు, ట్రీట్​మెంట్ తర్వాత ఉద్యోగాలు చేయలేని పరిస్థితి ఏర్పడుతున్నట్టు పేర్కొంది. ఆరోగ్యం సహకరించక ఉద్యోగాలు మానేస్తున్న వాళ్లు కూడా ఎక్కువ మందే ఉంటున్నారు. దాదాపు 32 శాతం మందిదాకా పేషెంట్లు తమ నెలవారీ ఆదాయాన్ని కోల్పోవాల్సిన పరిస్థితులున్నాయని తెలిపింది. పనిచేసే వయస్సులో ఉన్నోళ్లనూ గుండె జబ్బులు వదలడం లేదని రీసెర్చ్ ఆందోళన వ్యక్తం చేసింది. 

సగటున 56 ఏండ్లకే గుండె జబ్బులు ఎటాక్ అవుతున్నట్టు పేర్కొంది. ఇతర దేశాలతో పోలిస్తే మన దగ్గర గుండె జబ్బుల బారిన పడుతున్నోళ్ల సగటు వయసు 10 నుంచి 15 ఏండ్లు తక్కువేనని తెలిపింది. ఒక్కసారి హార్ట్ ఫెయిల్ అయితే కనీసం ఐదు రోజుల పాటు ఆసుపత్రిలో ఉండాల్సిన పరిస్థితి వస్తున్నట్టు తెలిపింది. 

ఒకటికన్నా ఎక్కువసార్లు హాస్పిటలైజ్ అవుతున్న వారికి ఆర్థిక భారం మరింత ఎక్కువగా ఉంటున్నది. పట్టణ ప్రాంతాల ప్రజలతో పోలిస్తే.. పల్లె ప్రజలపైనే భారం ఎక్కువగా ఉన్నది. పట్టణాల్లో 30.1 శాతం మంది హార్ట్​పేషెంట్లకు ఆర్థిక భారం ఉంటే.. పల్లెల్లో 46 శాతం మంది పేషెంట్లు ఆర్థికంగా చితికిపోతున్నట్టు తేలింది.

©️ VIL Media Pvt Ltd.