
న్యూఢిల్లీ: నాకు పార్టీ కంటే దేశ ప్రజలే ముఖ్యమని.. నేషన్ ఫస్ట్ నినాదంతోనే పని చేస్తున్నామని ప్రధాని మోడీ అన్నారు. దేశ భవిష్యత్ కోసం కఠిన నిర్ణయాలకు వెనుకాడటం లేదన్నారు. ఇందులో భాగంగానే ఆర్టికల్ 370ని రద్దు, ట్రిపుల్ తలాఖ్ చట్టం వంటి కఠిన నిర్ణయాలు తీసుకున్నామని తెలిపారు. దృఢమైన వైఖరితో కశ్మీర్‌లో ఉగ్రవాదంపై ఉక్కుపాదం మోపామని.. అలాగే దేశంలో మావోయిస్టులను అంతం చేశామని అన్నారు. కాంగ్రెస్ తన దుష్పరిపాలనతో భారతదేశాన్ని నిరాశాపూరిత స్థితికి నెట్టిందని విమర్శించారు. కాంగ్రెస్ ఏళ్ల పాటు పరిపాలించి అవినీతి, అక్రమాలు, కుంభకోణాలతో దేశాన్ని అవినీతి అగాధంలోకి నెట్టిందని ఆరోపించారు. 2014లో ఎన్డీఏ ప్రభుత్వం ఏర్పడినప్పుడు దేశ తలరాత మళ్లీ మారిందని అన్నారు.
ఎన్డీఏ ప్రభుత్వం 12 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా బుధవారం (జూన్ 10) ఢిల్లీలో ఎన్డీఏ సభాపక్ష సమావేశం జరిగింది. ఈ సమావేశంలో ప్రధాని మోడీ మాట్లాడుతూ.. కాంగ్రెస్ కుటుంబ పాలన నుంచి దేశాన్ని విముక్తి చేయడమే 12 ఏళ్లలో ఎన్డీఏ ప్రభఉత్వం సాధించిన అతిపెద్ద విజయమని పేర్కొన్నారు. కాంగ్రెస్ హయాంలో దేశం తిరోగమన దిశలో పయనించిందని.. అభివృద్ధి నత్తనడకన సాగిందని విమర్శించారు.
►ALSO READ | సుస్థిర ప్రభుత్వంతోనే అభివృద్ది..దేశ ప్రజల ఆకాంక్షను నెరవేరుస్తున్నాం: ప్రధాని మోదీ
ప్రభుత్వ ఉద్దేశం, విధానం, నిర్ణయాలు ఏకతాటిపై పనిచేసినప్పుడు అభివృద్ధి వేగం ఎలా ఉంటుందో 2014 నుంచి దేశం చూస్తోందని అన్నారు. ఎన్డీఏ అధికారంలోకి వచ్చాక దశాబ్దాలు పట్టే పనులు కేవలం నెలల్లోనే పూర్తవడాన్ని దేశం చూసిందని పేర్కొన్నారు. 2014లో దేశంలో 74 విమానాశ్రయాల ఉంటే 2026 నాటికి ఆ సంఖ్య 160కి పైగా పెరిగిందన్నారు. 2014లో కేవలం ఐదు నగరాల్లో ఉన్న మెట్రో సేవలను 2026 నాటికి ఇరవైకి పైగా నగరాలకు విస్తరించామని తెలిపారు.
2014లో రూ.700 కోట్లు ఉన్న రక్షణ ఎగుమతులను 2026 నాటికి రూ.23,000 వేల కోట్లకు చేర్చామన్నారు. 2014లో దేశంలో కేవలం 25 కోట్ల ఇంటర్నెట్ వినియోగదారులు ఉండగా.. ఇవాళ 100 కోట్లకు పైగా వినియోగదారులు ఇంటర్నెట్‌కు అనుసంధానమై ఉన్నారని తెలిపారు. 2014లో డిజిటల్ చెల్లింపులు నామమాత్రంగా ఉండగా.. నేడు డిజిటల్ లావాదేవీలలో ప్రపంచంలోనే భారతదేశం మొదటి స్థానంలో ఉందని అన్నారు.
నాకు జనతా జనార్దనే దేవుడు:
2014 మే 26న తొలిసారిగా ప్రధాని పదవీ బాధ్యతలు చేపట్టిన నరేంద్ర మోడీ.. 2026, జూన్ 10వ తేదీతో ప్రధానమంత్రిగా వరుసగా 4,399 రోజులు పూర్తి చేసుకున్నారు. తద్వారా దివంగత ప్రధాని జవహర్ లాల్ నెహ్రూ (4,398 రోజులు) రికార్డును మోడీ అధిగమించారు. ఈ చారిత్రాత్మక మైలురాయి గురించి మోడీ మాట్లాడుతూ.. ఇంత సుదీర్ఘకాలం పాటు దేశానికి సేవ చేసే అదృష్టం కలగడం దైవ ఆశీస్సులతో మాత్రమే సాధ్యమవుతుంది.. నాకు జనతా జనార్దనుడే దైవం. అందుకే నేను ఈ సేవను ఎల్లప్పుడూ పూజగా భావించానని అన్నారు. తన సుదీర్ఘ ప్రయాణంలో సహకరించిన అందరికీ కృతజ్ఞతలు తెలియజేస్తున్నానన్నారు. ఈ ప్రయాణాన్ని తాను వ్యక్తిగత విజయంగా పరిగణించనని.. ఇది అన్ని విధాలుగా ఎన్డీఏ పార్టీల సామూహిక విజయమన్నారు. అందుకే దీనిని ఎన్డీఏ పార్టీల కార్యకర్తలకు అంకితం చేస్తున్నానని తెలిపారు.