Reading Time: 2 minutes
Watch Video: వీధి కుక్క నుంచి గ్లోబల్ స్టార్ వరకు.. పీస్ డాగ్ అలోకా స్ఫూర్తిదాయక ప్రయాణం!

మన దేశంలో వీధి కుక్కలను చాలామంది చిన్నచూపు చూస్తుంటారు. కానీ, ఓ సాదాసీదా భారతీయ వీధి కుక్క రాత్రికి రాత్రే అంతర్జాతీయ సెలబ్రిటీగా మారి, ప్రపంచ దేశాలలో శాంతిని చాటుతోందని మీకు తెలుసా? ఆ కుక్క పేరే అలోకా. వీధుల నుండి బౌద్ధ సన్యాసుల ఆశ్రమానికి, అక్కడి నుండి అమెరికా వీధుల వరకు సాగిన అలోకా ప్రయాణం ప్రతి ఒక్కరినీ ఆశ్చర్యపరుస్తుంది. ఇటీవల ఈ గ్లోబల్ పీస్ అంబాసిడర్ డాగ్ ఢిల్లీ పర్యటనకు వచ్చి, ప్రముఖ జంతు ప్రేమికురాలు, మాజీ కేంద్ర మంత్రి మేనకా గాంధీని కలిసి వార్తల్లో నిలిచింది.

సాధారణ కుక్క శాంతి దూతగా ఎలా మారింది?:

అలోకా కథ 2022లో ప్రారంభమైంది. బౌద్ధ భిక్షువు భిక్షు పన్నాకర నేతృత్వంలో కోల్‌కతా నుండి బోధ్‌గయ వరకు దాదాపు 3,400 కిలోమీటర్ల సుదీర్ఘ శాంతియాత్ర చేపట్టారు. ఈ యాత్ర ప్రారంభమైన కొద్దిరోజులకే ఒక అనాథ కుక్క పిల్ల సన్యాసుల వెనుక నడవడం ప్రారంభించింది. సాధారణంగా వీధి కుక్కలు కొద్ది దూరం వచ్చి వెనుతిరిగిపోతాయి. కానీ, ఈ కుక్క పిల్ల మాత్రం ఎండ, వాన, చలిని తట్టుకుంటూ భిక్షువులతో పాటే చివరి వరకు నడిచింది. దాని విశ్వాసానికి, నిశ్శబ్ద స్వభావానికి ముగ్ధులైన బౌద్ధ సన్యాసులు దాన్ని చట్టబద్ధంగా దత్తత తీసుకుని, దానికి అలోకా (అంటే వెలుగు లేదా జ్ఞానోదయం) అని పేరు పెట్టారు. దాని నుదుటిపై సహజంగానే గుండె (Heart) ఆకారంలో ఒక మచ్చ ఉండటం విశేషం.

అంతర్జాతీయ గుర్తింపు:

బౌద్ధ సన్యాసులు అలోకాను తమతో పాటు అమెరికాకు తీసుకెళ్లారు. అక్కడ టెక్సాస్ నుండి వాషింగ్టన్ డీసీ వరకు 10 కి పైగా రాష్ట్రాల గుండా దాదాపు 3,700 కిలోమీటర్ల మేర జరిగిన ప్రతిష్టాత్మక వాక్ ఫర్ పీస్ యాత్రలో అలోకా చురుగ్గా పాల్గొంది. అంతటి సుదీర్ఘ ప్రయాణంలోనూ ఎంతో ప్రశాంతంగా, ఓపికగా ఉంటూ ప్రపంచవ్యాప్తంగా ఉన్న జంతు ప్రేమికులను ఆకట్టుకుంది. ఆ తర్వాత శ్రీలంక, థాయిలాండ్ దేశాలలో కూడా పర్యటించి, అంతర్జాతీయంగా అహింస, జీవకారుణ్యానికి బ్రాండ్ అంబాసిడర్‌గా గుర్తింపు పొందింది.

వీడియో ఇక్కడ చూడండి..

మేనకా గాంధీతో భేటీ:

ప్రస్తుతం భారతదేశంలో మరో విడత శాంతియాత్ర కోసం దిల్లీ చేరుకున్న అలోకా బృందాన్ని మేనకా గాంధీ తన జోర్ బాగ్ నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ప్రపంచం అలోకాలో చూస్తున్న గొప్ప గుణాలలో కొంతైనా మన దేశంలోని ప్రతి వీధి కుక్కలో ప్రజలు చూడగలిగితే, జంతువుల పట్ల మన దృక్పథం పూర్తిగా మారిపోతుంది. అలోకా మన భారతీయ దేశవాళీ కుక్కల విశ్వాసానికి, ధైర్యాని, అంతులేని ప్రేమకు నిదర్శనం అని కొనియాడారు. అలోకా ప్రయాణం సమాజానికి ఒక గొప్ప సందేశాన్ని ఇస్తోంది. మూగజీవాల పట్ల, ముఖ్యంగా వీధి కుక్కల పట్ల క్రూరత్వాన్ని వీడి, కరుణతో ఉంటే అవి కూడా ఎంతటి ఉన్నతమైన స్థాయికి చేరగలవో అలోకా నిరూపించింది.

మరిన్ని ట్రెండింగ్ న్యూస్ కోసం క్లిక్ చేయండి..