Reading Time: < 1 minute
Patriotic Movies Trend In Tollywood Prabhas Fauji And Ntr Dragon Lead The Way

Patriotic Telugu Movies : టాలీవుడ్‌లో ప్రేమకథలు, మాస్ యాక్షన్ సినిమాలు, పాన్ ఇండియా ఫాంటసీ చిత్రాలు గతంలో ట్రెండ్ సెట్ చేశాయి. అయితే ఇప్పుడు తెలుగు సినిమా మరో కొత్త దిశగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తోంది. దేశభక్తి, గూఢచారి ఆపరేషన్లు, యుద్ధ నేపథ్యాల వంటి అంశాలు రాబోయే భారీ బడ్జెట్ చిత్రాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాయి. ముఖ్యంగా టాలీవుడ్ అగ్ర హీరోలు వరుసగా దేశభక్తి కథలను ఎంచుకోవడం ఇప్పుడు ఇండస్ట్రీలో హాట్ టాపిక్ గా మారింది. ప్రభాస్ హీరోగా తెరకెక్కుతున్న ‘ఫౌజీ’ ఈ ట్రెండ్‌కు పెద్ద ఉదాహరణగా నిలుస్తోంది. విప్లవం, యుద్ధం, ప్రేమ, త్యాగం వంటి అంశాల కలయికతో రూపొందుతున్న ఈ చిత్రం కమర్షియల్ సినిమా కంటే భిన్నంగా ఉండబోతోందని సమాచారం. దేశం కోసం పోరాడే ఒక వ్యక్తి జీవితాన్ని ప్రేమకథతో ముడిపెట్టి చూపించే ప్రయత్నం జరుగుతోందని తెలుస్తోంది. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు కూడా ఉన్నాయి.

మరోవైపు జూనియర్ ఎన్టీఆర్, ప్రశాంత్ నీల్ కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న ‘డ్రాగన్’ కూడా దేశభక్తి ప్రధాన నేపథ్యంతోనే రూపొందుతోందని దర్శకుడు స్వయంగా వెల్లడించడం మరింత ఆసక్తిని పెంచింది. ప్రశాంత్ నీల్ చెప్పిన వివరాల ప్రకారం ఇది కేవలం యాక్షన్ సినిమా కాదు. దేశం కోసం జరిగే రహస్య పోరాటాల చుట్టూ తిరిగే హై ఇంటెన్స్ కథ. రా ఆపరేషన్లు, గూఢచారి వ్యవస్థ, దేశ భద్రతకు సంబంధించిన అంశాలు ఇందులో కీలకంగా ఉండనున్నట్లు తెలుస్తోంది. నిజ జీవిత సంఘటనల నేపథ్యంలో రావడంతో ఈ సినిమాపై అంచనాలు కూడా మరింత పెరిగాయి. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ కొత్త ట్రెండ్ ప్రేక్షకులకు కొత్త అనుభూతిని అందించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాబోయే రోజుల్లో టాలీవుడ్‌లో దేశభక్తి కథలు మరింత పెరిగే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు భావిస్తున్నారు. ఇప్పుడు అందరి దృష్టి ‘ఫౌజీ’, ‘డ్రాగన్’ చిత్రాలపైనే ఉంది.