
బస్సుల్లో ప్రయాణికుల ఫోన్లను దొంగిలించి, వాటిలోని బ్యాంకింగ్ యాప్‌ల ద్వారా లక్షలాది రూపాయలు దోచుకుంటున్న ముఠాను సూర్యాపేట సీసీఎస్ పోలీసులు పట్టుకున్నారు. అయితే దొంగతనం సరే అకౌంట్ లో డబ్బులు ఎలా మాయమౌతున్నాయని ప్రశ్న తలెత్తడం కామన్. సాధారణంగా ఫోన్ పోతే ఫోన్ మాత్రమే పోయింది అనుకుంటారు. కానీ ఆ ఫోన్ వీళ్లకు దొరికితే సీన్ వేరేలా ఉంటుంది. మీ ఫోన్‌తో పాస్‌వర్డ్‌ను ఈజీగా క్రాక్ చేసి అందులో ఉన్న డబ్బులను వీరు కాజేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. తాజాగా సూర్యాపేట జిల్లా తుంగతుర్తి నుంచి అన్నారం వెళ్తున్న బస్సులో ఉప్పలయ్యకు చెందిన ఫోన్, అలాగే వెలుగుపల్లి నుంచి సూర్యాపేట వెళ్తున్న బస్సులో దుగ్యాల వెంకటేశ్వర్లు అనే ప్రయాణికుడి ఫోన్‌లను ఈ ముఠా దొంగిలించింది. ఫోన్ దొరకగానే నిందితులు అందులోని మనీ యాప్‌లను ఓపెన్ చేశారు. బాధితులు తమ యూపీఐ, మొబైల్ బ్యాంకింగ్ యాప్‌లకు 1234, 0000 వంటి అత్యంత బలహీనమైన పాస్‌వర్డ్‌లు పెట్టుకోవడమే నిందితులకు ప్లస్ పాయింట్ అయింది.
ఎలాంటి శ్రమ లేకుండా కేవలం ఊహించి కొట్టిన పాస్‌వర్డ్‌లతో యాప్‌లు ఓపెన్ అయి.. బాధితుల అకౌంట్ల నుంచి లక్షలాది రూపాయలను నిందితులు తమ ఖాతాల్లోకి బదిలీ చేసుకున్నారు. బాధితుల ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు ప్రత్యేక ఆపరేషన్ చేపట్టి ఈ ముఠాను ఆటకట్టించారు. ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి వారి నుంచి 2.7 లక్షల నగదు, 27 స్మార్ట్‌ఫోన్లు, కారును స్వాధీనం చేసుకున్నారు.
పోలీసుల సూచన
మీ ఫోన్ స్క్రీన్ లాక్‌కు గానీ, గూగుల్ పే, ఫోన్ పే వంటి మనీ యాప్‌లకు గానీ 1234 , 0000, 9999 లేదా మీ పుట్టిన సంవత్సరం వంటి సులభమైన నంబర్లను అస్సలు పెట్టకోవొద్దని సూర్యాపేట జిల్లా ఎస్పీ నరసింహ సూచిస్తున్నారు, సాధ్యమైనంత వరకు యాప్‌లకు ఫింగర్ ప్రింట్ లేదా ఫేస్ లాక్ సెక్యూరిటీని ఆన్ చేసి పెట్టుకోవాలని అన్నారు. మొబైల్ ఫోన్ పోయినట్లు గుర్తిస్తే ఏమాత్రం ఆలస్యం చేయకుండా వెంటనే మీ సిమ్ కార్డును బ్లాక్ చేయించాలని కోరాలని, అలాగే బ్యాంక్ కస్టమర్ కేర్‌కు ఫోన్ చేసి మీ యూపీఐ సర్వీసులను నిలిపి వేయించుకోవాలని ఆయన సూచించారు.బస్సులు, రైళ్లు వంటి రద్దీ ప్రదేశాల్లో ప్రయాణించేటప్పుడు ప్రజలు మొబైల్ ఫోన్ల భద్రత విషయంలో అత్యంత జాగ్రత్తగా ఉండాలని అన్నారు.
చిన్న అజాగ్రత్త.. సైబర్ నేరగాళ్లు, దొంగలకు సులువైన దారి చూపిస్తుంది. కాబట్టి ఇప్పుడే మీ ఫోన్ ఓపెన్ చేసి మీ బ్యాంకింగ్ యాప్స్ పాస్‌వర్డ్‌లు ఎంత బలంగా ఉన్నాయో చెక్ చేసుకోవాలి.
మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.