Reading Time: 2 minutes
Andhra Pradesh School Reopening 2026 Academic Calendar 229 Working Days 87 Holidays

ఆంధ్రప్రదేశ్‌లో బడిగంటకు వేళాయింది. దాదాపు రెండు నెలల విరామం తర్వాత స్కూళ్లు తెరుచుకోబోతున్నాయి. శుక్రవారం నుంచి స్కూళ్లు పున:ప్రారంభం అవుతున్నాయని విద్యాశాఖ తెలిపింది. ఈ మేరకు ఏడాది క్యాలెండర్‌ను విడుదల చేసింది. 229 పని దినాలు, 87 రోజులు సెలవు దినాలుగా ప్రకటించింది. పరీక్షల షెడ్యూల్‌ను సైతం విద్యాశాఖ విడుదల చేసింది.

14

రెండు నెలల పాటు చిన్నారులు ఆటాపాటలతో ఎంజాయ్ చేశారు. కుటుంబ సభ్యులతో సరదాగా గడిపారు. ఇప్పుడు మళ్లీ బ్యాగ్‌లు భుజాన వేసుకుని.. పుస్తకాలతో కుస్తీ పట్టే సమయం దగ్గర పడింది. నేటితో వేసవి సెలవులు ముగియడంతో లక్షలాది మంది విద్యార్థులు మళ్లీ బడి బాట పట్టనున్నారు. ఈ నేపథ్యంలో రాష్ట్ర విద్యాశాఖ 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించిన అకడమిక్ క్యాలెండర్‌ను విడుదల చేసింది.

Ajd

విద్యాశాఖ రూపొందించిన షెడ్యూల్ ప్రకారం.. ఈ విద్యా సంవత్సరంలో మొత్తం 229 పని దినాలు ఉండగా, 87 రోజులు సెలవులు కేటాయించారు. విద్యార్థుల విద్యా ప్రగతితో పాటు పాఠ్యాంశాల పూర్తి, పరీక్షల నిర్వహణకు అనుగుణంగా ఈ క్యాలెండర్‌ను రూపొందించినట్లు అధికారులు తెలిపారు. ఈ విద్యా సంవత్సరంలో దసరా, సంక్రాంతి, క్రిస్మస్ తదితర ప్రధాన పండుగల సందర్భంగా సెలవులను ప్రకటించారు. అలాగే ప్రభుత్వ సెలవులు, ఆదివారాలు కలిపి మొత్తం 87 రోజుల విరామం లభించనుంది.

అంతేకాకుండా విద్యాశాఖ వార్షిక పరీక్షలు, త్రైమాసిక, అర్ధవార్షిక పరీక్షల షెడ్యూల్‌ను కూడా విడుదల చేసింది. విద్యా ప్రమాణాలను మెరుగుపరచడం, సమయపాలన పాటించడం లక్ష్యంగా పరీక్షల తేదీలను ముందుగానే ప్రకటించినట్లు పేర్కొంది. దీంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు తమ ప్రణాళికలను ముందుగానే సిద్ధం చేసుకునే అవకాశం లభించనుంది.

రాష్ట్రవ్యాప్తంగా పాఠశాలల ప్రారంభానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు విద్యాశాఖ అధికారులు వెల్లడించారు. పాఠశాలల్లో మౌలిక సదుపాయాలు, పాఠ్యపుస్తకాల పంపిణీ, మధ్యాహ్న భోజన పథకం అమలు తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలిపారు. కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం కావడంతో విద్యార్థులు ఉత్సాహంగా పాఠశాలలకు హాజరై విద్యలో మరింత రాణించాలని విద్యాశాఖ ఆకాంక్షించింది.