
రాజస్థాన్ రాయల్స్ కెప్టెన్, భారత యువ ఆల్‌రౌండర్ రియాన్ పరాగ్‌కు ఎదురుదెబ్బ తగిలింది. గత కొంతకాలంగా భుజం గాయంతో బాధపడుతున్న అతనికి గురువారం ముంబైలోని కోకిలాబెన్ ధీరూభాయ్ అంబానీ ఆసుపత్రిలో కుడి భుజానికి శస్త్రచికిత్స విజయవంతంగా పూర్తయింది. ప్రముఖ వైద్యుడు డాక్టర్ దిన్‌షా పార్దివాలా పర్యవేక్షణలో ఈ సర్జరీ జరిగింది. ఐపీఎల్ 2026 సీజన్‌లో రాజస్థాన్ రాయల్స్ జట్టును కెప్టెన్‌గా ముందుండి నడిపించి, ప్లేఆఫ్స్‌కు చేర్చిన పరాగ్.. ఈ గాయం కారణంగా రాబోయే దేశీయా టోర్నీలకు దూరం కానున్నాడు.
డొమెస్టిక్ సీజన్‌కు దూరం..
24 ఏళ్ల ఈ అస్సాం క్రికెటర్ త్వరలోనే బెంగళూరులోని బీసీసీఐ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ (CoE) లో తన పునరావాస ప్రక్రియను (Rehab) ప్రారంభించనున్నాడు. ఆగస్టు మూడో వారంలో దులీప్ ట్రోఫీతో ప్రారంభం కానున్న 2026-27 దేశీయా సీజన్‌లో మెజారిటీ మ్యాచులకు పరాగ్ దూరం కానున్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం అతని పునరావాసంపైనే పూర్తి దృష్టి పెట్టామని, అతను తిరిగి మైదానంలోకి ఎప్పుడు వస్తాడనేదానిపై బీసీసీఐ వర్గాలు ఇంకా స్పష్టమైన కాలపరిమితిని నిర్ణయించలేదని పిటిఐ తెలిపింది.
శ్రీలంకలోని దంబుల్లాలో జరుగుతున్న ముక్కోణపు సిరీస్ కోసం మొదట భారత్-ఎ జట్టు వైస్ కెప్టెన్‌గా పరాగ్‌ను ఎంపిక చేశారు. అయితే హ్యామ్‌స్ట్రింగ్ గాయం కారణంగా అతను ఈ టోర్నీ నుంచి తప్పుకోవాల్సి వచ్చింది. అతని స్థానంలో జట్టులోకి వచ్చిన రుతురాజ్ గైక్వాడ్ ఇప్పటికే శ్రీలంక-ఎ, అఫ్గానిస్థాన్-ఎ జట్లపై వరుసగా సెంచరీ, హాఫ్ సెంచరీలతో అద్భుత ఫామ్‌లో ఉన్నాడు.
భావోద్వేగానికి గురైన రియాన్ పరాగ్..
సర్జరీ అనంతరం రియాన్ పరాగ్ తన ఇన్‌స్టాగ్రామ్ వేదికగా అభిమానులతో ఒక భావోద్వేగ సందేశాన్ని పంచుకున్నాడు. “చివరికి భుజం నొప్పే గెలిచింది. నా ఆరోగ్యం గురించి అడుగుతున్న వారందరికీ చెబుతున్నా.. నా సర్జరీ విజయవంతంగా పూర్తయింది. గత రెండేళ్లు నన్ను తీవ్రంగా పరీక్షించాయి. కొన్ని మంచి రోజులు, మరికొన్ని నిరాశపరిచే రోజులు చూశాను. కేవలం ఒక మ్యాచ్ ఆడటమే నాకు పెద్ద సవాలుగా అనిపించిన రోజులు కూడా ఉన్నాయి. కానీ ఇప్పుడు నా ముందు మరో సవాలు ఉంది.. అదే కోలుకోవడం, పునరావాసం, సహనం. నేను ప్రేమించే క్రికెట్‌ను ఆడటానికి త్వరలోనే మళ్లీ తిరిగి వస్తాను. అందరినీ త్వరలోనే కలుస్తాను” అని పరాగ్ రాసుకొచ్చాడు.
(@riyanhparag) ద్వారా పోస్ట్ భాగస్వామ్య చేయబడింది