Reading Time: 2 minutes
Pentagon Lockdown Hazardous Material Alert Air Quality Issue Evacuation

అమెరికా రక్షణ శాఖ ప్రధాన కార్యాలయం పెంటగాన్‌లో గురువారం ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ‘‘ప్రమాదకర పదార్థాలు ఉన్నాయన్న హెచ్చరికలతో భవనంలోని పలు విభాగాలను లాక్‌డౌన్ చేయడంతో పాటు కొంతమంది సిబ్బందిని ఖాళీ చేయించారు. ఈ ఘటన అమెరికా భద్రతా వర్గాల్లో తీవ్ర ఆందోళనకు కారణమైంది. అగ్నిమాపక శాఖ, పోలీసులు విస్తృత తనిఖీల తర్వాత తప్పుడు హెచ్చరిక అని తేలినట్లు సమాచారం అందించిన ఇద్దరు అధికారులు వెల్లడించారు. అయినప్పటికీ జాగ్రత్త చర్యల్లో భాగంగా అధికారులు అత్యవసర భద్రతా ప్రొటోకాల్స్‌ను అమలు చేశారు.

Us

అసలేం జరిగింది?

పెంటగాన్‌లోని అంతర్గత వ్యవస్థలు గాలి నాణ్యత (Air Quality)లో సమస్య ఉన్నట్లు గుర్తించాయని పెంటగాన్ ప్రతినిధి సీన్ పార్నెల్ తెలిపారు. పరిస్థితి తీవ్రతను అంచనా వేసే వరకు ముందస్తు జాగ్రత్త చర్యలు చేపట్టినట్లు చెప్పారు. దీంతో ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న సిబ్బందికి ‘‘షెల్టర్-ఇన్-ప్లేస్’’ ఆదేశాలు జారీ చేశారు. అంటే సిబ్బంది తమ స్థానాల్లోనే ఉండాలని సూచించారు. వెంటనే స్పందన బృందాలు సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని పరిశీలించాయి.

రంగంలోకి హాజ్‌మ్యాట్ బృందాలు

ఈ ఘటన నేపథ్యంలో పెంటగాన్ ఫోర్స్ ప్రొటెక్షన్ ఏజెన్సీకి చెందిన ప్రమాదకర పదార్థాల (HazMat) విభాగం రంగంలోకి దిగింది. వారికి ఆర్లింగ్టన్ కౌంటీ ఫైర్ డిపార్ట్‌మెంట్ సహకారం అందించింది. ఆర్లింగ్టన్ ఫైర్ అండ్ ఈఎంఎస్ అధికారులు కూడా తమ హాజ్‌మ్యాట్ బృందాలు ఘటనాస్థలంలో పని చేశాయని ధృవీకరించారు.

గ్యాస్ మాస్కులతో కనిపించిన సిబ్బంది

భవనంలో ప్రసారం చేసిన అంతర్గత సందేశం ప్రకారం అదనపు గాలి నాణ్యత పరీక్షలు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ పరీక్షలకు ఒకటి నుంచి రెండు గంటల సమయం పట్టవచ్చని అధికారులు పేర్కొన్నారు. ఇదిలా ఉండగా కొంతమంది సిబ్బంది గ్యాస్ మాస్కులు, రసాయన రక్షణ దుస్తులు ధరించి కనిపించడం కలకలం రేపింది. అయితే ఇవన్నీ పూర్తిగా ముందస్తు జాగ్రత్త చర్యల్లో భాగమేనని అధికారులు స్పష్టం చేశారు.

పలు అంతస్తుల్లో లాక్‌డౌన్

సమాచారం ప్రకారం పెంటగాన్‌లోని రెండో నుంచి ఐదో అంతస్తుల వరకు.. నాలుగు నుంచి ఏడు కారిడార్ల మధ్య ఉన్న ప్రాంతాలను తాత్కాలికంగా లాక్‌డౌన్ చేశారు. కొన్ని విభాగాల్లోని సిబ్బందిని బయటకు తరలించగా, మరికొన్ని ప్రాంతాల్లో ఉద్యోగులను అక్కడికక్కడే ఉండాలని ఆదేశించారు. ప్రస్తుతం ప్రమాదకర పదార్థాల ముప్పు లేదని, పరిస్థితి అదుపులో ఉందని అధికారులు వెల్లడించారు. అయితే గాలి నాణ్యత సమస్యకు గల అసలు కారణాలపై విచారణ కొనసాగుతోంది.