
బాలీవుడ్ యాక్షన్ హీరో సన్నీ డియోల్ నుంచి వస్తున్న హిస్టారికల్ డ్రామా ‘బట్వారా 1947’. రాజ్ కుమార్ సంతోషి దర్శకత్వం వహించారు. బాలీవుడ్ స్టార్ ఆమీర్ ఖాన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తుండటం విశేషం. ‘లాహోర్ 1947’ అనే వర్కింగ్ టైటిల్‌తో రూపొందగా, మంగళవారం కొత్త టైటిల్‌ను ప్రకటిస్తూ, మోషన్ పోస్టర్‌ను విడుదల చేశారు.
దేశ విభజన నేపథ్యంలో సాగే ఈ పీరియాడిక్ మూవీని స్వతంత్ర దినోత్సవం సందర్భంగా ఈ ఏడాది ఆగస్టు 14న విడుదల చేయబోతున్నట్టు తెలియజేశారు. ద్వేషం, భయాందోళనలు నెలకొన్న కల్లోల కాలంలో ధైర్యాన్నే ఆయుధంగా ఎంచుకున్న ఒక వీరుడి పోరాటమే ఈ చిత్ర కథాంశమని మేకర్స్ తెలియజేశారు.
సన్నీ డియోల్‌తో పాటు ప్రీతి జింటా, షబానా అజ్మీ, కరణ్ డియోల్, అలీ ఫజల్, కనికా కపూర్ ఇతర ముఖ్యపాత్రలు పోషిస్తున్నారు. ఏఆర్ రెహమాన్ సంగీతం అందిస్తున్నారు. జావేద్ అక్తర్ సాహిత్యం అందించారు. ముప్ఫై ఏళ్ల తర్వాత సన్నీ డియోల్, రాజ్ కుమార్ సంతోషి కాంబినేషన్‌లో వస్తున్న సినిమా ఇది. గతంలో ఘాయల్, దామిని, ఘాతక్ లాంటి హిట్స్ అందుకున్న కాంబో కావడంతో ఈ చిత్రంపై అంచనాలు నెలకొన్నాయి.