Reading Time: 2 minutes
Tmc Crisis Deepens Kalyan Banerjee Issues Ultimatum To Mamata Over Abhishek

Kalyan Banerjee: కాంగ్రెస్ (TMC) ప్రస్తుతం చరిత్రలోనే అత్యంత తీవ్రమైన సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నాయి. ఒకరి తర్వాత ఒకరుగా కీలక నేతలు పార్టీకి గుడ్‌బై చెబుతున్నారు. ఇప్పటికే 60 మందికి పైగా ఎమ్మెల్యేలు తిరుగుబాటు చేయగా, ఢిల్లీ వేదికగా లోక్‌సభ సభ్యులు సైతం తిరుగుబాటు జెండా ఎగరేశారు. ఈ తరుణంలో మమతా బెనర్జీకి కోలుకోలేని విధంగా అత్యంత బలమైన షాక్ తగిలింది. పార్టీ సీనియర్ నేత, మమతకు అత్యంత నమ్మకస్తుడైన కల్యాణ్ బెనర్జీ సైతం ఇప్పుడు తిరుగుబాటు బాట పట్టారు. తన 40 ఏళ్ల నాటి రాజకీయ సహచరురాలు కాకోలి ఘోష్‌ను సైతం పక్కన పెట్టి, మమతా బెనర్జీ ఏ కల్యాణ్ బెనర్జీని అయితే చీఫ్ విప్‌గా నియమించారో.. ఇప్పుడు అదే కల్యాణ్ బెనర్జీ పార్టీ అధినేత్రికి గట్టి అల్టిమేటం జారీ చేశారు. “మీకు మీ మేనల్లుడు అభిషేక్ బెనర్జీ కావాలా? లేక నాలాంటి నమ్మకమైన నాయకులు కావాలా? తేల్చుకోండి” అంటూ మమతకు స్పష్టం చేశారు. అభిషేక్ బెనర్జీని పార్టీ నుంచి తొలగించకపోతే తాము పార్టీలో కొనసాగలేమని తేల్చి చెప్పారు.

అంతేకాకుండా, అభిషేక్ బెనర్జీపై ఉన్న ఫోర్జరీ సంతకాల కేసు నుంచి తాను తప్పుకుంటున్నట్లు కల్యాణ్ బెనర్జీ ప్రకటించారు. ఈ సందర్భంగా అభిషేక్‌పై ఆయన తీవ్రస్థాయిలో మండిపడ్డారు. “అభిషేక్ బెనర్జీకి నాపై ఎప్పుడూ నమ్మకం లేదు, ఇకముందు కూడా ఉండదు. రేపు కోర్టులో జరగబోయే విచారణ కోసం నేను అర్ధరాత్రి వరకు ప్రిపేర్ అవుతుంటే, హఠాత్తుగా లాయర్‌ను మార్చేశామని నాకు సమాచారం ఇచ్చారు. ఇది నన్ను తీవ్రంగా అవమానించడమే. అభిషేక్‌కు పెద్దలను గౌరవించడం అస్సలు తెలియదు, అతను ఒక అహంకారి. అసలు పార్టీలో అతని స్థానం ఏంటి? అతని వల్లే పార్టీకి ఇంత పెద్ద నష్టం వాటిల్లింది” అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తాను ఎల్లప్పుడూ మమతా బెనర్జీ వైపే ఉంటానని చెబుతూనే.. “దీదీ ఇప్పుడు నిర్ణయించుకోవాలి.. ఆమెకు పార్టీ, నమ్మకమైన నాయకులు కావాలా? లేక ఒక చిన్నపిల్లాడు, కుటుంబం కావాలా?” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.

మరోవైపు.. తృణమూల్ కాంగ్రెస్ పతనానికి కల్యాణ్ బెనర్జీ తిరుగుబాటు ‘చివరి మేకు’ లాంటిదని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. ఎందుకంటే పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత, కోర్టుల్లో పార్టీకి సంబంధించిన ఎన్నో కీలక కేసులను కల్యాణ్ బెనర్జీయే స్వయంగా వాదించారు. అభిషేక్ బెనర్జీ నిందితుడిగా ఉన్న ఫోర్జరీ కేసులోనూ ఆయనే లాయర్‌గా ఉన్నారు. అలాంటి కీలక నేత తిరుగుబాటు చేయడానికి కొన్ని గంటల ముందే మమతకు మరో రెండు పెద్ద షాక్‌లు తగిలాయి. మొదట రాజ్యసభ ఎంపీ ప్రకాష్ చిక్ బరాయిక్ తన పదవికి రాజీనామా చేయగా, నిన్నటివరకు మమతకు మద్దతుగా నిలిచిన ప్రసూన్ బెనర్జీ లోక్‌సభలో తిరుగుబాటు చేసిన కాకోలి గ్రూప్‌తో చేతులు కలిపారు. లోక్‌సభలో తమను ప్రత్యేక గ్రూప్‌గా గుర్తించాలని కోరుతూ కాకోలి వర్గం స్పీకర్‌కు ఇచ్చిన లేఖపై ప్రసూన్ బెనర్జీ కూడా సంతకం చేయడం టీఎంసీలో కలకలం రేపుతోంది.