Reading Time: 2 minutes
IND vs AFG: అఫ్గాన్ సిరీస్‌కి ఓకే.. 2027 వన్డే ప్రపంచకప్‌‌కి నాట్ ఓకే.. ఈ ముగ్గురి దరిద్రం ఏంటో తెలుసా?

India vs Afghanistan ODI Series: ఆఫ్ఘనిస్తాన్‌తో జరగబోయే మూడు వన్డేల సిరీస్‌కు ముందు టీమిండియాకు వరుస షాక్‌లు తగిలాయి. స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీతో పాటు స్టార్ ఆల్‌రౌండర్ హార్దిక్ పాండ్యా గాయాల కారణంగా ఈ సిరీస్‌కు దూరమయ్యారు. 2027 ఐసీసీ వన్డే ప్రపంచకప్ సన్నాహకాల దృష్ట్యా భారత జట్టుకు ఈ సిరీస్ ఎంతో కీలకం కానుంది. అయితే, ఈ సిరీస్‌లో ఆడే ముగ్గురు ఆటగాళ్లకు మాత్రం 2027 ప్రపంచకప్ జట్టులో చోటు దక్కడం కష్టమేననే ప్రచారం జరుగుతోంది.

కోహ్లీ, పాండ్యా దూరం.. యువ ఆటగాళ్లకు అవకాశం..

భారత జట్టు భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని సెలక్టర్లు ఈ సిరీస్‌లో కొందరు యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించారు. విరాట్ కోహ్లీ, హార్దిక్ పాండ్యా వంటి సీనియర్ల గైర్హాజరీ జట్టు మేనేజ్‌మెంట్‌ను కాస్త కలవరపెడుతున్నా, కొత్త రక్తాన్ని పరీక్షించడానికి ఇది మంచి వేదికగా మారింది. అయితే, ప్రస్తుతం జట్టులోకి వచ్చిన కొందరు ఆటగాళ్లు కేవలం తాత్కాలిక ప్రత్యామ్నాయాలు మాత్రమేనని విశ్లేషకులు భావిస్తున్నారు. సీనియర్లు తిరిగి జట్టులోకి వస్తే ఈ ముగ్గురు యువ ఆటగాళ్లు ప్రపంచకప్ రేసు నుంచి తప్పుకోవాల్సి వస్తుంది.

విరాట్ కోహ్లీ స్థానంలో యశస్వి జైస్వాల్.. కానీ?

తొలిసారి జట్టును ప్రకటించినప్పుడు సెలక్టర్లు యువ ఓపెనర్ యశస్వి జైస్వాల్‌ను పక్కన పెట్టారు. కానీ, విరాట్ కోహ్లీ గాయపడటంతో అనూహ్యంగా జైస్వాల్‌కు అఫ్గాన్ సిరీస్‌లో అవకాశం దక్కింది. నిలకడైన ఆటతీరుతో ఆకట్టుకుంటున్న ఈ యువ బ్యాటర్, భవిష్యత్తులో రోహిత్ శర్మతో కలిసి భారత బ్యాటింగ్ విభాగానికి వెన్నెముకగా మారతాడనడంలో ఎలాంటి సందేహం లేదు. అయితే, 2027 ప్రపంచకప్ నాటికి విరాట్ కోహ్లీ పూర్తిగా ఫిట్‌గా ఉండి జట్టులోకి వస్తే, జైస్వాల్‌కు తుది జట్టులో చోటు దక్కడం సవాల్‌తో కూడుకున్న విషయమే.

జడేజాకు విశ్రాంతి.. రేసులోకి హర్ష్ దూబే..

ఎడమచేతి వాటం ఆర్థోడాక్స్ స్పిన్నర్, 23 ఏళ్ల ఆల్‌రౌండర్ హర్ష్ దూబే అఫ్గాన్ సిరీస్‌ ద్వారా భారత జట్టులోకి వచ్చాడు. స్టార్ ఆల్‌రౌండర్ రవీంద్ర జడేజాకు సెలక్టర్లు విశ్రాంతినివ్వడంతో హర్ష్ దూబేకు ఈ బంపర్ ఆఫర్ దక్కింది. ఐపీఎల్, దేశవాళీ క్రికెట్‌లో అద్భుత ప్రదర్శన చేయడంతో అజిత్ అగార్కర్ నేతృత్వంలోని ఎంపిక కమిటీ ఇతనిపై నమ్మకం ఉంచింది. అయితే, 2027 వన్డే ప్రపంచకప్ సమయానికి రవీంద్ర జడేజా జట్టులోకి రావడం ఖాయం కాబట్టి, హర్ష్ దూబే తన స్థానాన్ని వదులుకోవాల్సి వస్తుంది.

బుమ్రా స్థానంలో గుర్నూర్ బ్రార్.. ప్రపంచకప్ బెర్త్ కష్టమే!

భారత ప్రధాన పేసర్ జస్‌ప్రీత్ బుమ్రా అందుబాటులో లేకపోవడంతో 26 ఏళ్ల ఫాస్ట్ బౌలర్ గుర్నూర్ బ్రార్‌కు అఫ్గాన్ సిరీస్ జట్టులో చోటు లభించింది. పంజాబ్ తరపున 9 లిస్ట్-ఎ మ్యాచ్‌ల్లో 12 వికెట్లు తీసి గుర్నూర్ ఆకట్టుకున్నాడు. కానీ, భవిష్యత్తులో బుమ్రా జట్టులోకి పునరాగమనం చేసిన తర్వాత సెలక్టర్లు అతనికే తొలి ప్రాధాన్యత ఇస్తారు. దీనివల్ల 2027 ఐసీసీ వన్డే ప్రపంచకప్ జట్టులో గుర్నూర్ బ్రార్‌ను పరిగణనలోకి తీసుకునే అవకాశాలు చాలా తక్కువగా కనిపిస్తున్నాయి.

మరిన్ని క్రికెట్ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..