Reading Time: 2 minutes
CBSEకి షాకిచ్చిన యువకుడికి ఐఐటీ కాన్పూర్ నుంచి సూపర్ ఛాన్స్.. 19 ఏళ్లకే ఐఐటీ జాబ్ ఆఫర్‌

న్యూఢిల్లీ, జూన్‌ 11: కేవలం 19 ఏళ్లకే ఎథికల్ హ్యాకర్ నిసర్గ ఆధికారి దేశంలోని ప్రతిష్టాత్మక విద్యాసంస్థల్లో ఒకటైన ఐఐటీ కాన్పూర్‌లో ఉద్యోగం సాధించాడు. సైబర్ భద్రత రంగంలో తన ప్రతిభను నిరూపించుకున్న నిసర్గ.. ఐఐటీ కాన్పూర్‌కు చెందిన సాంకేతిక ఆవిష్కరణ కేంద్రం సీ3ఐహబ్ (C3iHub)లో ఓపెన్ సోర్స్ ఇంటెలిజెన్స్ (OSINT), థ్రెట్ ఇంటెలిజెన్స్ ఇంజినీర్‌గా నియామకం పొందాడు. దేశంలోని ప్రీమియర్ ఐఐటీల్లో ఇంత చిన్న వయసులో ఉద్యోగం పొందిన వారిలో నిసర్గ ఒకరిగా నిలిచాడు. ఈ ఏడాదే 12వ తరగతి పూర్తి చేసిన అతను ఆరేళ్ల వయసు నుంచే కోడింగ్ నేర్చుకోవడం ప్రారంభించాడు. సైబర్ భద్రతపై ఆసక్తితో స్వయంగా పరిశోధనలు చేస్తూ తన ప్రతిభను చాటుకున్నాడు.

సీబీఎస్‌ఈ డిజిటల్ వ్యవస్థలో ఉన్న భద్రతా లోపాలను బహిర్గతం చేయడంతో నిసర్గ దేశవ్యాప్తంగా ఒక్కసారిగా పాపులర్‌ అయ్యాడు. సోషల్ మీడియా వేదిక ఎక్స్ (X)లో చేసిన పోస్టుల ద్వారా సీబీఎస్‌ఈ ఉపయోగిస్తున్న క్లౌడ్ స్టోరేజ్ వ్యవస్థలో భద్రతా లోపాలు ఉన్నాయని వెల్లడించాడు. తగిన భద్రతా ఏర్పాట్లు లేకపోవడం వల్ల 2026 ప్రశ్నపత్రాలు, జవాబు పత్రాలు సహా పలు సున్నితమైన డేటాను ఇంటర్నెట్‌లో ఎవరైనా యాక్సెస్ చేసే అవకాశం ఉందని నిసర్గ వెల్లడించాడు. దీంతో ఈ విషయం ఒక్కసారిగా దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. నిసర్గ ఎక్స్‌లో వెల్లడించిన అంశాలపై స్పందించిన సీబీఎస్‌ఈ.. పోర్టల్‌లో కొన్ని భద్రతా లోపాలు ఉన్నాయని అంగీకరించింది. కేంద్ర ప్రభుత్వానికి చెందిన సైబర్ నిపుణులు, ఐఐటీల నిపుణుల బృందాలను రంగంలోకి దించి సమస్యలను పరిష్కరించినట్లు తెలిపింది. లోపాలను గుర్తించి సమాచారం అందించిన ఎథికల్ హ్యాకర్లకు కృతజ్ఞతలు తెలిపింది.

ఐఐటీ కాన్పూర్ డైరెక్టర్ ప్రశంసలు

సీబీఎస్‌ఈ పోర్టల్ లోపాలపై నిసర్గ రాసిన బ్లాగ్‌ను చదివిన ఐఐటీ కాన్పూర్ డైరెక్టర్ మనీంద్ర అగర్వాల్ స్వయంగా అతనిని సంప్రదించి సైబర్ సెక్యూరిటీ బృందంలో ఇంజినీర్‌గా నియమించారు. ఈ సందర్భంగా నిసర్గ మాట్లాడుతూ ఇది నా మొదటి పూర్తి స్థాయి సైబర్ సెక్యూరిటీ ఉద్యోగం. ఎంతో ఉత్సాహంగా ఉంది. దేశ భద్రతకు ఉపయోగపడే రంగంలో పనిచేసే అవకాశం రావడం గర్వంగా భావిస్తున్నానని తెలిపాడు. చిన్న వయసులోనే అసాధారణ ప్రతిభతో దేశంలోని అత్యున్నత విద్యాసంస్థలో ఉద్యోగం సాధించిన నిసర్గ ఆధికారి యువతకు స్ఫూర్తిగా నిలుస్తున్నాడు.