Reading Time: 2 minutes

ప్రపంచానికి దిక్సూచిగా ఫ్యూచర్ సిటీ ..అభివృద్ధిని అడ్డుకుంటే ప్రతిపక్ష హోదా కూడా దక్కదు..:సీఎం రేవంత్

Caption of Image.

ప్రపంచానికి దిక్సూచిగా ఫ్యూచర్ సిటీని నిర్మిస్తున్నామని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ఫ్యూచర్ సిటీలో ఎఫ్ సీడీఏ బిల్డింగ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న రేవంత్..  భవిష్యత్తులో టోక్యో, సింగపూర్‌లతో మన ఫ్యూచర్ సిటీ పోటీపడుతుందన్నారు.. రాబోయే 8 ఏళ్లలో ఫ్యూచర్ సిటీని పూర్తి చేసి చూపిస్తామని చెప్పారు.

పెద్దరాక్షసుడు, పిల్లరాక్షసులు కలిసి… తెలంగాణ తలరాతను మార్చే ఫ్యూచర్ సిటీ ని అడ్డుకోవాలని చూస్తున్నారని మండిపడ్డారు. కడుపునిండా విషం, కళ్లనిండా నిప్పులతో ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామని ప్రగల్భాలు పలుకుతున్నారని ఫైర్ అయ్యారు సీఎం. గుర్తుపెట్టుకోండి… ఫ్యూచర్ సిటీని రద్దు చేస్తామనే వారికి ఈ రాష్ట్రంలోనే ఫ్యూచర్ లేదు. భవిష్యత్తును రద్దు చేస్తామంటే… మీకు ప్రతిపక్ష హోదా కూడా దక్కదని హెచ్చరించారు రేవంత్.

హైదరాబాద్ నగరాన్ని ఎంతో మంది అభివృద్ధి చేశారు కానీ.. ఈరోజు రాష్ట్ర ఆదాయానికే కీలకంగా మారిన సైబరాబాద్‌కు… రేపటి భవిష్యత్ కోసం ఈనాడే పునాది వేశామన్నారు.  బంగారం కంటే సైబరాబాద్ పరిధిలోనే భూములకు విలువ ఎక్కువని అన్నారు రేవంత్.  నాడు హైటెక్ సిటీ వద్దన్నారు, ఓఆర్ఆర్ వద్దన్నారు, ఎయిర్ పోర్ట్ వద్దన్నారని చెప్పారు. ఏడ్చేవాళ్లు ఎప్పుడూ ఏడుస్తున్నా అభివృద్ధి చేస్తామన్నారు.

►ALSO READ | తెలంగాణ మీ అయ్యా జాగీరా వ్యాఖ్యలపై పవన్ కల్యాణ్ క్లారిటీ

నిన్న కురిసిన కేవలం రెండు గంటల వానకే సిటీ ఆగమైందన్నారు రేవంత్. కిలోమీటర్ ప్రయాణానికే గంటల సమయం పట్టింది. పదేళ్లు మేమే అభివృద్ధి చేశామన్నోళ్లు… ఈ సిటీ వరదపై సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. నాలాలు, కుంటలు, చెరువులు కబ్జా చేస్తే సహించేది లేదని హెచ్చరించారు సీఎం రేవంత్.

 మేం గానీ, మా మంత్రులు గానీ గజం భూమైనా ఆక్రమించామా? గత పాలకులు దుర్మార్గుల్లా చెరువులు, పార్కులు కబ్జా చేశారని ఆరోపించారు రేవంత్. అంబర్ పేట్ చెరువును ఆక్రమించారు.. బతుకమ్మ కుంటలో 15 ఎకరాలను ఎడ్ల సుధాకర్ రెడ్డి లాంటి బీఆర్ఎస్ నేతలకు రాసిచ్చారని ఆరోపించారు. ఆ పాపపు కబ్జాల వల్లే… ఈరోజు చెరువుల్లో ఉండాల్సిన వరద రోడ్లపైకి వచ్చిందన్నారు.  ఇదేనా మీ పదేళ్ల పాలన? మీరు అడ్డుకున్నా… అభివృద్ధి ఆగదు. కేవలం 170 రోజుల్లోనే బిల్డింగ్ నిర్మించి ప్రారంభించుకున్న చరిత్ర తమది అన్నారు రేవంత్. 
 

©️ VIL Media Pvt Ltd.