
CM Chandrababu: నీతి ఆయోగ్ గవర్నింగ్ కౌన్సిల్ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రాష్ట్ర భవిష్యత్ అభివృద్ధి దిశగా రూపొందించిన ‘స్వర్ణాంధ్ర 2047’ విజన్‌ను వివరించారు. ప్రధాని నరేంద్ర మోడీ ప్రతిపాదించిన ‘వికసిత్ భారత్ 2047’ లక్ష్యాలతో రాష్ట్ర విజన్‌ను అనుసంధానం చేసినట్లు తెలిపారు. సమావేశం ప్రారంభంలో ప్రధాని నరేంద్ర మోడీ ప్రధానమంత్రిగా 12 సంవత్సరాల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా ఆయనకు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. గత దశాబ్ద కాలంలో భారత్ పాలసీ పెరాలసిస్ నుంచి పాలసీ గ్రోత్ వైపు ప్రయాణించిందని చంద్రబాబు పేర్కొన్నారు. డిజిటల్ ఇండియా, జన్ ధన్, ఆధార్, యూపీఐ, మేక్ ఇన్ ఇండియా వంటి కార్యక్రమాలు దేశ అభివృద్ధికి కీలకంగా నిలిచాయని ఆయన చెప్పారు. సరళీకరణ, పాలనా సంస్కరణలు, ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానాల ద్వారా భారత ఆర్థిక వ్యవస్థ బలోపేతం అయిందని అభిప్రాయపడ్డారు.
స్వర్ణాంధ్ర 2047కు 10 కీలక సూత్రాలు
స్వర్ణాంధ్ర 2047 విజన్‌లో మానవ వనరుల అభివృద్ధిని ప్రధాన లక్ష్యంగా తీసుకున్నామని సీఎం చంద్రబాబు తెలిపారు. పేదరిక నిర్మూలన, నైపుణ్యాభివృద్ధి, ఉపాధి కల్పన, నీటి మరియు ఇంధన భద్రత, అగ్రి-టెక్, గ్లోబల్ లాజిస్టిక్స్, డీప్ టెక్నాలజీ వంటి పది కీలక అంశాలను విజన్‌లో భాగం చేశామని వెల్లడించారు. ఈ లక్ష్యాల సాధనకు సాంకేతికత ఆధారిత, పారదర్శక డేటా ఆధారిత పాలనా వ్యవస్థను ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ఆర్టీజీఎస్ ద్వారా కీలక పనితీరు సూచికలను పర్యవేక్షిస్తున్నామని, వాతావరణం, పంటల పరిస్థితులు, భూగర్భ జలాలు సహా 41 రకాల సమాచారాన్ని రియల్‌టైమ్‌లో విశ్లేషించి ప్రజలకు అందిస్తున్నామని వివరించారు.
డిజిటల్ గవర్నెన్స్‌కు ప్రాధాన్యం
‘మన మిత్ర’ వాట్సాప్ గవర్నెన్స్ యాప్ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజల ఇంటి వద్దకే తీసుకెళ్తున్నామని చంద్రబాబు తెలిపారు. స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ విధానంతో గత రెండు సంవత్సరాల్లో రాష్ట్రానికి రూ.23 లక్షల కోట్ల పెట్టుబడులను ఆకర్షించామని చెప్పారు. పెట్టుబడుల విషయంలో రాష్ట్రాల మధ్య ఆరోగ్యకరమైన పోటీ అవసరమని, అయితే విధానాల్లో అస్థిరత పెట్టుబడులకు ఆటంకంగా మారుతుందని అభిప్రాయపడ్డారు. అత్యుత్తమ మౌలిక సదుపాయాలు, వేగవంతమైన అనుమతుల వ్యవస్థ వంటి అంశాలపై దృష్టి పెట్టాలని సూచించారు.
ఆరోగ్యం, విద్య, నైపుణ్యాభివృద్ధిపై ప్రత్యేక దృష్టి
ప్రజలకు గృహాలు, పారిశుద్ధ్యం, తాగునీరు, వంటగ్యాస్, విద్యుత్, డిజిటల్ కనెక్టివిటీ, డైరెక్ట్ బెనిఫిట్ ట్రాన్స్‌ఫర్ వంటి సేవలు అందించడమే ప్రభుత్వ లక్ష్యమని చెప్పారు. పీ4 కార్యక్రమం ద్వారా సమాజంలో ఆర్థిక అసమానతలు తగ్గించే ప్రయత్నం చేస్తున్నామని పేర్కొన్నారు. సంజీవని కార్యక్రమం ద్వారా ప్రజలకు డిజిటల్ హెల్త్ రికార్డులు అందుబాటులోకి తీసుకువస్తున్నామని, ఆయుష్మాన్ భారత్‌తో అనుసంధానం చేసి సమగ్ర ఆరోగ్య రక్షణ కల్పించాలనే లక్ష్యంతో పనిచేస్తున్నామని తెలిపారు. విద్యారంగంలో ప్రాథమిక స్థాయి నుంచి ఉన్నత విద్య వరకు సమూల సంస్కరణలు చేపట్టామని, ఏఐ ఆధారిత అడాప్టివ్ లెర్నింగ్ వ్యవస్థలు, వర్క్ ఇంటిగ్రేటెడ్ లెర్నింగ్ మోడళ్ల ద్వారా విద్యార్థులకు నైపుణ్యాలను అందిస్తున్నామని చెప్పారు.
జనాభా నిర్వహణపై జాతీయ స్థాయి చర్చ అవసరం
ఆంధ్రప్రదేశ్‌లో సంతానోత్పత్తి రేటు 1.5 కంటే తక్కువకు పడిపోవడంతో పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతోందని చంద్రబాబు ఆందోళన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో మానవ వనరుల కొరత రాకుండా ఉండేందుకు రాష్ట్రంలో పాపులేషన్ మేనేజ్‌మెంట్ పాలసీ రూపొందిస్తున్నామని వెల్లడించారు. వికసిత్ భారత్ 2047 లక్ష్యాల సాధనలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య నిరంతర భాగస్వామ్యం అవసరమని పేర్కొన్న ఆయన, నీతి ఆయోగ్‌తో కలిసి పనిచేసేందుకు ఆంధ్రప్రదేశ్ పూర్తిగా సిద్ధంగా ఉందని స్పష్టం చేశారు.