Reading Time: < 1 minute
Pakistan Objects To Indias Delimitation Bill Over Pok India Calls It Internal Matter

Pakistan: కేంద్రంలోని బీజేపీ నేతృత్వంలోని ఎన్డీయే సర్కార్ మహిళా రిజర్వేషన్ బిల్లు, లోక్ సభ ఎంపీ స్థానాల డిలిమిటేషన్ బిల్లును పార్లమెంట్‌ ముందుంచింది. అయితే, ఈ బిల్లులపై కాంగ్రెస్ సహా అన్ని ప్రతిపక్షాలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి. ఎంపీ స్థానాల పెంపు బీజేపీకి సహకరిస్తుందని, దక్షిణాది, ఈశాన్య రాష్ట్రాల హక్కుల్ని కాలరాస్తుందని ఆరోపిస్తున్నాయి.

ఇదిలా ఉంటే, ఈ బిల్లుపై దాయాది పాకిస్తాన్ కూడా తీవ్ర అభ్యతరం చెబుతోంది. జమ్మూ కాశ్మీర్ నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియలో పాకిస్తాన్ ఆక్రమిత కాశ్మీర్(పీఓకే) కూడా అంతర్భాగంగా ఉంది. ఇప్పుడు దీనిపైనే పాకిస్తాన్ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. భారత్ డీలిమిటేషన్ ప్రక్రియను ‘‘వివాదాస్పద భూభాగంలో చట్టవిరుద్ధమైన రాజకీయ ఆర్భాటం’’గా అభివర్ణిస్తూ తిరస్కరించింది. జమ్మూ కాశ్మీర్‌లో నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియను పాకిస్తాన్ విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి తాహిర్ అంద్రాబి తిరస్కరించారు. జమ్మూ కాశ్మీర్ భూభాగంలోని ఏ భాగాన్నైనా పునర్ నిర్వచించే చట్టపరమైన అధికారం భారత్‌కు లేదని ఆయన అన్నారు.

Read Also: Kangana Ranaut: ‘రాహుల్ గాంధీ మాట వింటే తలనొప్పి వస్తోంది’.. షాకింగ్ కామెంట్స్ చేసిన బీజేపీ ఎంపీ కంగనా రనౌత్

అయితే, దీనిపై భారత్ కూడా ఘాటుగానే స్పందించింది. పీఓకే కూడా భారత్‌లో అంతర్భాగమని స్పష్టం చేసింది. ‘‘నియోజకవర్గాల పునర్విభజన ప్రక్రియకు సంబంధించి, భారతదేశ అంతర్గత వ్యవహారం. వాటిలో జోక్యం చేసుకోవడానికి లేదా వాటిపై ఎటువంటి వ్యాఖ్యలు చేయడానికి చేసే ప్రయత్నాలను మేము తిరస్కరిస్తున్నాము’’ అని విదేశాంగ శాఖ ప్రతినిధి రణధీర్ జైస్వాల్ అన్నారు.

పరిస్థితులు అనుకూలించినప్పుడు, భారత ఎన్నికల సంఘం (ECI) PoKకి పునర్విభజన కమిషన్‌గా వ్యవహరిస్తుందని పునర్విభజన బిల్లు 2026 ప్రతిపాదిస్తుంది. ప్రస్తుతం, జమ్మూ కాశ్మీర్ శాసనసభలో ఈ భూభాగాల కోసం 24 సీట్లు రిజర్వ్ చేయబడ్డాయి, కానీ ఎన్నికల ద్వారా అవి ఎప్పుడూ భర్తీ చేయబడలేదు. 1947లో అప్పటి జమ్మూ కాశ్మీర్ రాజు మహారాజా హరిసింగ్ ఆ ప్రాంతాన్ని భారత్‌లో విలీనం చేస్తూ సంతకం చేశారు. పాక్, ఆక్రమిత కాశ్మీర్‌ను ఖాళీ చేయాలని 1994లో భారత పార్లమెంట్ ఏకగ్రీవ తీర్మానం చేసింది.