Reading Time: < 1 minute
EPFO: ఆ ఏడాది రిటైర్‌ అయ్యే  ప్రైవేట్‌ ఉద్యోగులకు రూ.10 వేల పెన్షన్‌?  ఎలా వస్తుందంటే?

ప్రైవేట్ రంగంలో పనిచేసే లక్షలాది ఉద్యోగులకు పదవీ విరమణ తర్వాత ఆర్థిక భద్రతపై అనేక అనుమానాలు ఉంటాయి. ప్రభుత్వ ఉద్యోగుల్లా హామీతో కూడిన పెన్షన్ లేకపోవడం వల్ల ఈ ఆందోళన మరింత పెరుగుతుంది. అయితే EPFO కింద ఉండే ఉద్యోగుల పింఛను పథకం (EPS) ఈ సమస్యకు ఒక స్థిరమైన పరిష్కారంగా నిలుస్తోంది. EPFO నిర్వహించే EPS పథకం ద్వారా ఉద్యోగుల జీతం నుండి క్రమం తప్పకుండా జమ అయ్యే మొత్తంలో కొంత భాగం పెన్షన్ ఫండ్‌కు వెళ్తుంది. యజమాని (కంపెనీ) కూడా జమ చేసే వాటాలో ఒక ముఖ్యమైన శాతం EPS‌కు కేటాయించబడుతుంది. ఈ విధంగా సంవత్సరాల పాటు పోగవుతున్న ఈ నిధి, పదవీ విరమణ తర్వాత నెలవారీ పెన్షన్‌గా ఉద్యోగికి అందుతుంది.

అయితే ఈ పింఛను పొందాలంటే కొన్ని ముఖ్యమైన అర్హతలు ఉన్నాయి. ఉద్యోగి కనీసం 10 సంవత్సరాల పెన్షన్‌కు అర్హత గల సర్వీస్‌ పూర్తి చేయాలి. పూర్తి పెన్షన్ పొందడానికి సాధారణంగా 58 సంవత్సరాల వయస్సు పూర్తి కావాలి. పెన్షన్ లెక్కించడం కూడా చాలా సులభం. EPFO ఒక స్పష్టమైన సూత్రాన్ని నిర్దేశించింది. పెన్షన్ = (పెన్షన్ అర్హత గల జీతం × మొత్తం సర్వీసు సంవత్సరాలు) / 70

ఇక్కడ గమనించాల్సిన ముఖ్యమైన విషయం ఏమిటంటే, పెన్షన్ లెక్కింపులో గరిష్ట జీత పరిమితి నెలకు రూ.15,000గానే పరిగణిస్తారు. మీ అసలు జీతం ఎంత ఎక్కువైనా, లెక్కింపు ఈ పరిమితి ఆధారంగానే జరుగుతుంది. ఉదాహరణకు 2026లో పదవీ విరమణ చేస్తున్న ఒక ఉద్యోగి 50 సంవత్సరాల సేవ పూర్తి చేశాడని అనుకుందాం. అప్పుడు పెన్షన్ లెక్కింపు ఇలా ఉంటుంది.. 15,000 × 50 ÷ 70 = 10,714

అంటే అతనికి నెలకు సుమారు రూ.10,714 స్థిరమైన పెన్షన్ లభిస్తుంది. అయితే ముందస్తుగా పెన్షన్ తీసుకుంటే తగ్గింపు ఉంటుంది. ఉదాహరణకు 58 ఏళ్లు పూర్తి కాకముందే 50 ఏళ్లకే పెన్షన్ ప్రారంభిస్తే, ప్రతి సంవత్సరం 4 శాతం చొప్పున పెన్షన్ తగ్గించబడుతుంది. దీని వల్ల మొత్తం నెలవారీ ఆదాయం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది.

మరిన్ని బిజినెస్‌ వార్తల కోసం ఇక్కడ క్లిక్‌ చేయండి