
CSK vs RCB : ఐపీఎల్ 2026లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (RCB), చెన్నై సూపర్ కింగ్స్ (CSK) జట్ల మధ్య మైదానంలోనే కాదు, ఇప్పుడు మైదానం వెలుపల కూడా యుద్ధం మొదలైంది. బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన మ్యాచ్ సందర్భంగా హోస్ట్ టీమ్ డీజే వ్యవహరించిన తీరుపై చెన్నై సూపర్ కింగ్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసింది. దక్షిణాది సంస్కృతిని, ముఖ్యంగా తమిళనాడు అస్తిత్వాన్ని కించపరిచేలా పాటలు ప్లే చేశారంటూ నేరుగా బీసీసీఐ (BCCI)కి ఫిర్యాదు చేసింది.
అసలేం జరిగింది? వివాదానికి కారణమేంటి?
ఏప్రిల్ 5న బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో ఆర్‌సీబీ, సీఎస్‌కే జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. ఈ సందర్భంగా స్టేడియంలోని డీజే “దోశ, ఇడ్లీ, సాంబార్, చట్నీ చట్నీ” అనే పాటను ప్లే చేశాడు. సోషల్ మీడియాలో సౌత్ ఇండియన్లపై మీమ్స్ వేయడానికి ఎక్కువగా ఉపయోగించే ఈ పాటను ప్లే చేయడం తమ ప్రాంతీయ అస్తిత్వాన్ని, తమిళ సంస్కృతిని కించపరచడమేనని చెన్నై సూపర్ కింగ్స్ భావిస్తోంది. ఇది ఒక వర్గాన్ని కించపరిచేలా ఉందని, మంచి పద్ధతి కాదని సీఎస్‌కే తన ఫిర్యాదులో పేర్కొంది.
ప్లేయర్లపై అనుచిత వ్యాఖ్యలు
కేవలం పాటలు మాత్రమే కాకుండా, చెన్నై ప్లేయర్లు అవుట్ అయినప్పుడు డీజే మైక్‌లో చేసిన వ్యాఖ్యలు కూడా వివాదాస్పదంగా మారాయి. ప్రత్యర్థి జట్టు ఆటగాళ్లను అవమానించేలా వ్యాఖ్యలు చేయడం క్రీడా స్ఫూర్తికి విరుద్ధమని సీఎస్‌కే మేనేజింగ్ డైరెక్టర్ కాశీ విశ్వనాథన్ మండిపడ్డారు. “సాధారణంగా హోమ్ టీమ్ డీజేలు తమ జట్టుకు మద్దతు ఇస్తారు, కానీ ఇక్కడ ప్రత్యర్థి ఆటగాళ్లను కించపరిచేలా వ్యవహరించారు. దీనిపై బీసీసీఐకి లేఖ రాశాం” అని ఆయన స్పష్టం చేశారు.
పాత గొడవలే మళ్ళీ మొదలయ్యాయా?
ఈ వివాదానికి 2025లో జరిగిన ఒక సంఘటనతో లింక్ ఉంది. అప్పట్లో ఆర్‌సీబీ ప్లేయర్ జితేష్ శర్మ ఇదే పాటను పాడుతూ ఒక వీడియో చేయగా, దానికి కౌంటర్‌గా చెన్నై డీజే కూడా గతంలో సెటైర్లు వేశాడు. అయితే ఆ తర్వాత సీఎస్‌కే మేనేజ్‌మెంట్ తమ స్టాఫ్‌ను నియంత్రించిందని, ఎవరినీ కించపరచవద్దని ఆదేశాలు జారీ చేశామని విశ్వనాథన్ గుర్తు చేశారు. తాము గౌరవప్రదంగా ఉంటున్నా, ఆర్సీబీ డీజే మాత్రం మళ్ళీ పాత గొడవలను రేపారని సీఎస్‌కే వర్గాలు అంటున్నాయి.
ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ స్పందన
ఈ వ్యవహారంపై ఐపీఎల్ ఉన్నతాధికారి ఒకరు స్పందిస్తూ.. సీఎస్‌కే నుంచి మాకు ఫిర్యాదు అందిందని, ప్రస్తుతం ఐపీఎల్ గవర్నింగ్ కౌన్సిల్ ఈ విషయాన్ని పరిశీలిస్తోందని తెలిపారు. స్టేడియాల్లో వినోదం పేరుతో ప్రాంతీయ వివక్షను ప్రోత్సహించేలా పాటలు ఉండకూడదన్న నిబంధనలను గుర్తు చేస్తున్నారు. ప్రస్తుతం ఆర్‌సీబీ వరుస విజయాలతో పాయింట్ల పట్టికలో అగ్రస్థానంలో ఉండగా, సీఎస్‌కే మాత్రం 5 మ్యాచ్‌ల్లో 2 విజయాలతో 8వ స్థానంలో ఉంది. ఈ రసవత్తర పోరు ఇప్పుడు బీసీసీఐ కోర్టుకు చేరింది.
మరిన్ని క్రీడా వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..