Reading Time: < 1 minute
Personal Loan: పర్సనల్ లోన్ తీసుకుంటున్నారా..? ఈ విషయం తెలుసుకోకపోతే భారీగా నష్టపోతారు..

ప్రస్తుత ఆర్ధికి పరిస్థితుల్లో చాలామంది బ్యాంకులు లేదా ఎన్‌ఎఫ్‌బీసీ సంస్థల నుంచి పర్సనల్ లోన్ తీసుకుంటున్నారు. ఇప్పుడు మార్కెట్లోకి అనేక లోన్ యాప్స్ కూడా అందుబాటులోకి వచ్చేశాయి. వీటి ద్వారా నిమిషాల్లోనే పర్సనల్ లోన్ తీసుకునే అవకాశముంది. అయితే ఈ లోన్ తీసుకునేటప్పుడు ప్రాసెసింగ్ ఫీజులు వసూలు చేస్తారు. ఇక బ్యాంకులను బట్టి ఈ ఫీజుల్లో తేడాలు ఉంటాయి. ఇక లోన్ అమౌంట్, ప్రొడక్ట్ టైప్‌ను బట్టి కూడా ఫీజులు మారుతూ ఉంటాయి. అసలు ఈ ప్రాసెసింగ్ ఫీజు అంటే ఏంటి..? ఎలా లెక్కిస్తారు? అనే విషయాలు తెలుసుకుందాం.

ప్రాసెసింగ్ ఫీజు అంటే..?

ప్రాసెసింగ్ ఫీజు అంటే.. మీకు లోన్ మంజూరు చేయడానికి బ్యాంకులు వసూలు చేసే ఛార్జిగా చెప్పవచ్చు. మీ డాక్యుమెంట్స్ వెరిఫికేషన్, క్రెడిట్ స్కోర్ చెక్ చేడం, కేవైసీ, అప్రెజల్ వంటి ఖర్చులకు బ్యాంకులు వీటిని వసూలు చేస్తాయి. మీరు తీసుకునే లోన్‌ మొత్తంను బట్టి ప్రాసెసింగ్ ఫీజు అనేది లెక్కిస్తారు. అయితే ఇది బ్యాంకులను బట్టి మారుతూ ఉంటుంది. సాధారణంగా ఇది 1.5 శాతం నుంచి 5 శాతం వరకు ఉంటుంది.

తేడాలు ఎందుకు..?

ప్రాసెసింగ్ ఫీజు అనేది ఒకేలా ఉండదు. లోన్ జారీ చేసే బ్యాంకుల నిబంధనల ఆధారంగా ఉంటుంది. మీరు తీసుకునే లోన్ అమౌంట్, లోన్ తీసుకునే వ్యక్తి ప్రొఫైల్ ఆధారంగా దీనిని లెక్కిస్తారు. లోన్ ఎక్కువగా తీసుకోవాలనుకుంటే.. ప్రాసెసింగ్ ఫీజు కూడా ఎక్కువగా ఉంటుంది. ఇక మీ క్రెడిట్ స్కోర్ ఆధారంగా కూడా ఇది మారుతుంది. అలాగే శాలరీ పొందే వ్యక్తులు, స్వయం ఉపాధి పొందే వ్యక్తుల ప్రొఫైల్ ఆధారంగా ప్రాసెసింగ్ ఫీజులో మార్పులు ఉంటాయి. బ్యాంకులు తక్కువ ఫీజులు వసూలు చేస్తుండగా.. ఫిన్ టెక్ సంస్థ ఎక్కువగా వసూలు చేస్తున్నాయి. అయితే పర్సనల్ లోన్ అనేది అన్ సెక్యూర్డ్ లోన్. ఇందుకు బ్యాంకులు ఎలాంటి హామీని తీసుకోవు. ఎలాంటివి తాకట్టు పెట్టాల్సిన అవసరం కూడా ఉండదు. మీ సిబిల్ స్కోర్, జీతం ఆధారంగా బ్యాంకులు జారీ చేస్తాయి.