Reading Time: 2 minutes
Ipl 2026 Flops Rishabh Pant Nicholas Pooran Cameron Green Among Biggest Disappointments

ఐపీఎల్‌ 2026 సీజన్‌ కోసం కొన్ని ఫ్రాంచైజీలు ఆటగాళ్లపై కోట్ల వర్షం కురిపించాయి. టీమిండియా కీపర్ రిషభ్ పంత్‌, వెస్టిండీస్ హిట్టర్ నికోలస్ పూరన్‌, ఆస్ట్రేలియా ఆల్‌రౌండర్‌ కెమరూన్ గ్రీన్‌పై ప్రాంఛైజీలు కాసుల వర్షం కురిపించాయి. వీరందరూ ఐపీఎల్ 2026లో అంచనాలను అందుకోలేకపోవడం చర్చనీయాంశంగా మారింది. కోట్ల రూపాయలు పలికిన ఈ ఆటగాళ్లు ఇప్పటివరకు చెప్పుకోదగ్గ ఒక్క ఇన్నింగ్స్ ఆడలేదు. వారి ఫామ్‌ జట్టుల ఫలితాలపై కూడా ప్రభావం చూపుతోంది. ఈ సీజన్‌లో అత్యంత నిరాశపరిచిన ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం.

లక్నో సూపర్ జెయింట్స్ వికెట్‌కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్‌ను రూ.27 కోట్ల భారీ మొత్తంతో రిటైన్ చేసుకుంది. అయితే ఈ సీజన్‌లో పంత్ ప్రదర్శన మాత్రం ఆశించిన స్థాయిలో లేదు. గత సీజన్‌ లానే ఈసారి కూడా అతను పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. కీలక సమయంలో జట్టును నిలబెట్టే ఇన్నింగ్స్‌లు పంత్ ఆడడం లేదు. లక్నోకు చెందిన మరో స్టార్ బ్యాటర్ నికోలస్ పూరన్‌ను రూ.21 కోట్లకు రిటైన్ చేశారు. అతని ప్రదర్శన కూడా తీవ్ర నిరాశ కలిగిస్తోంది. దూకుడైన బ్యాటింగ్‌కు పేరుగాంచిన పూరన్.. ఈ సీజన్‌లో పెద్దగా పరుగులు చేయలేకపోతున్నాడు. జట్టుకు అవసరమైన సమయంలో అతని బ్యాట్ మూగబోయింది.

కోల్‌కతా నైట్ రైడర్స్ రూ.25.2 కోట్లకు కొనుగోలు చేసిన ఆల్‌రౌండర్ కెమరూన్ గ్రీన్‌పై కూడా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అతని నుంచి మ్యాచ్‌ విన్నింగ్ ప్రదర్శన రావాల్సి ఉన్నా.. ఇప్పటివరకు ఆ స్థాయిలో ఆడలేకపోయాడు. బ్యాటింగ్, బౌలింగ్ రెండింట్లోనూ అతని ప్రభావం లేదు. చెన్నై సూపర్ కింగ్స్ రూ.14.2 కోట్ల భారీ ధరకు తీసుకున్న కార్తిక్ శర్మ పరిస్థితి మరింత విచిత్రం అనే చెప్పాలి. ప్రారంభ మ్యాచ్‌లలో నిరాశపరిచిన తర్వాత అతడికి తుది జట్టులో చోటు దక్కడం లేదు. ఇంత పెద్ద మొత్తానికి కొనుగోలు చేసిన ఆటగాడు బెంచ్‌కే పరిమితం కావడం సీఎస్‌కేకు మైనస్‌గా మారింది.

రూ.14.2 కోట్ల ధరకు సీఎస్‌కే జట్టులోకి వచ్చిన ప్రశాంత్ వీర్ కూడా ఆశించిన స్థాయిలో రాణించలేకపోయాడు. ఒక మ్యాచ్‌లో మోస్తరు ఇన్నింగ్స్ ఆడినప్పటికీ.. జట్టుకు ఉపయోగపడేలా పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. అతని ప్రదర్శన కూడా జట్టుకు నిరాశ కలిగించింది. మొత్తంగా చూస్తే ఐపీఎల్ 2026లో భారీ మొత్తాలకు కొనుగోలు చేసిన ఈ స్టార్ ఆటగాళ్లు ఇప్పటివరకు అంచనాలను అందుకోలేకపోయారు. సీజన్ మిగతా భాగంలో అయినా వారు ఫామ్‌లోకి వచ్చి తమ జట్టులకు కీలకంగా మారతారా? లేక ఇలాగే నిరాశపరుస్తారా? అన్నది ఆసక్తికరంగా మారింది.