Reading Time: 2 minutes
Singer Mangli Clarification Microfinance Scam Allegations Police Complaint Update

Singer Mangli: గత కొన్ని రోజులుగా సింగర్ మంగ్లీ, ఆమె తమ్ముడిపై అనేక ఆరోపణలు వచ్చాయి. మైక్రోఫైనాన్స్ స్కామ్ అంశానికి సంబంధించి న్యాయవాది సుబ్బారావు కంప్లైంట్ ఇచ్చాడు. మంగ్లీ సైతం ఆ న్యాయవాదిపై ఫిర్యాదు చేసింది. ఈ అంశంపై ప్రస్తుతం రచ్చ కొనసాగుతోంది. ఈ వివాదానికి తనకు ఎలాంటి సంబంధం లేదని గతంలో మీడియాతో మంగ్లీ విన్నవించుకుంది. బుధవారం మరోసారి సోషల్ మీడియాలో ఓ వీడియో రిలీజ్ చేసింది. మైక్రో ఫైనాన్స్ అనే పదమే తనకు తెలియదని చెప్పింది. “ఈ కేసుతో నాకు ఎలాంటి సంబంధం లేదు. రామావత్ మధు ను మా కమ్యూనిటీ ప్రోగ్రామ్ లో కలిసిన మాట వాస్తవమే. అంతమాత్రాన ఆయన చేసిన తప్పులకు నేను బాధ్యురాలిని కాదు. మా తమ్ముడు శివకు ఈ వివాదం తో సంబంధం లేదు. చీటింగ్ విషయంలో నా పేరు వాడుతున్నాడని తెలిసి నేనే స్వయంగా మధుపై ఫిర్యాదు చేశా. మైక్రో ఫైనాన్స్ వ్యవహారంలో నేను బాధితురాలినే. డబ్బులు ఇచ్చి బాధితులు మోసపోతే.. అకారణంగా బురద చల్లి నన్ను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. ఈ వివాదంలో నా పేరు రావడంతో నేను మా కుటుంబ సభ్యులు మానసిక క్షోభకు గురవుతున్నాం. రామావత్ మధుతో నాకు ఎలాంటి బంధుత్వం లేదు. చట్టం ఎవరికి మినహాయింపు ఇవ్వదు. తప్పు చేసిన వారికి శిక్ష తప్పదు. బాధితులకు న్యాయం జరగాలి. దర్యాప్తు అధికారులకు సహకరిస్తా.” అని ఆ వీడియోలో పేర్కొంది.

READ MORE: Ranbir Kapoor :‘టైమ్ 100’ జాబితాలో చోటు దక్కించుకున్న ఏకైక భారతీయ నటుడు!

ఇదిలా ఉండగా.. తనపై దుష్ప్రచారం చేస్తున్నారని న్యాయవాది సుబ్బారావుపై సింగర్ మంగ్లీ ఇటీవల ఫిర్యాదు చేసింది. తన తరఫు న్యాయవాదితో కలిసి పంజాగుట్ట పోలీస్‌ స్టేషన్‌కు వెళ్లింది. లిఖిత పూర్వక ఫిర్యాదును పోలీసులకు అందజేసింది. అనంతరం మీడియాతో మాట్లాడింది. ‘‘న్యాయవాది సుబ్బారావు నాపై దుష్ప్రచారం చేసి, ప్రాచుర్యం పొందాలని చూస్తున్నారు. ఫైనాన్స్‌ మోసం కేసుతో నాకు సంబంధం లేదు. నాకు చేతినిండా పని ఉంది.. ప్రజలను మోసం చేసే పని చేయను. బాధితుల తరఫున నేను కూడా పోరాడుతా. నాకు డబ్బు ఆశ లేదు.. పాటలే నా ప్రపంచంగా జీవిస్తున్నా. కష్టపడి ఈ స్థాయికి వచ్చాను. నా మూలాలు మర్చిపోను. నా తమ్ముడిపై కూడా ఆరోపణలు మోపుతున్నారు. డబ్బు కట్టలతో ఉన్న వ్యక్తి నా తమ్ముడు కాదు’’ అని మంగ్లీ వివరించింది. మరోసారి సోషల్ మీడియాలో క్లారిటీ ఇచ్చింది.

READ MORE: Nicholas Pooran: దాచడానికి ఏముంది, మేం చెత్తగా ఆడాం.. లక్నో కెప్టెన్ పూరన్!