Reading Time: 2 minutes
Mk Stalin Black Flag Protest Delimitation Bill Tamil Nadu

పార్లమెంట్‌లో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టబోయే డీలిమిటేషన్ బిల్లుపై తమిళనాడులో నిరసనలు వ్యక్తమవుతున్నాయి. డీలిమిటేషన్ బిల్లుతో దక్షిణాది రాష్ట్రాలు నష్టపోతాయని.. ఉత్తరాది రాష్ట్రాల లాభాల కోసమే బిల్లు ప్రవేశపెడుతున్నారని తమిళనాడు నాయకులు ఆరోపిస్తున్నారు.

Mkstalin

తాజాగా తమిళనాడులో డీఎంకే ఆధ్వర్యంలో నల్ల దుస్తులతో… నల్ల జెండాలతో నిరసన వ్యక్తం చేశారు. నమక్కల్‌లో తమిళనాడు ముఖ్యమంత్రి ఎంకే. స్టాలిన్ నల్ల దుస్తులు ధరించి నల్ల జెండా ఎగరవేశారు. అంతేకాకుండా డీలిమిటేషన్ బిల్లు ప్రతిని కూడా దహనం చేసి వ్యతిరేకతను వ్యక్తం చేశారు. ఇక తిరుచిరాపల్లిలోని తెన్నూరులో ఉన్న రాష్ట్ర మంత్రి అన్బిల్ మహేష్ పొయ్యమొళి తన నివాసం దగ్గర నల్ల జెండాలను ఏర్పాటు చేశారు.

ఇక టీవీకే అధినేత విజయ్ కూడా డీలిమిటేషన్ బిల్లును వ్యతిరేకించారు. ఈ బిల్లుతో తమిళనాడు రాష్ట్రం నష్టపోతుందని పేర్కొన్నారు. తక్షణమే ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు.

ఇదిలా ఉంటే డీలిమిటేషన్ బిల్లును ఇండియా కూటమి తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. అంతేకాకుండా మహిళా రిజర్వేషన్ బిల్లు కూడా కేంద్రం దురుద్దేశంతోనే తీసుకొస్తోందని ఆరోపించింది. అయితే బిల్లులపై ఇండియా కూటమి వర్సెస్ ఎన్డీఏ కూటమి మధ్య ఫైటింగ్ జరిగే సూచనలు కనిపిస్తున్నాయి. మూడు రోజుల ప్రత్యేక సమావేశాల్లో బిల్లులు ఆమోదం పొందుతాయా? లేదా అన్నది వేచి చూడాలి.

నేటి నుంచి మూడు రోజుల పాటు పార్లమెంట్ ప్రత్యేక సమావేశాలు జరగనున్నాయి. ఈ సమావేశాల్లో మహిళా రిజర్వేషన్ బిల్లు, నారీశక్తి వందన్ చట్టసవరణ, డీలిమిటేషన్ వంటి కీలక బిల్లులపై చర్చ జరగనుంది. 2023లో ఆమోదించబడిన మహిళా రిజర్వేషన్ చట్టమైన నారీ శక్తి వందన్ చట్టాన్ని పూర్తిగా అమలు చేయడమే ఈ బిల్లుల లక్ష్యం. 2029 నాటికి మహిళా రిజర్వేషన్ చట్టాన్ని అమలు చేయడం, లోక్‌సభలో సభ్యుల సంఖ్యను 850కు పెంచడమే మోడీ సర్కార్ లక్ష్యంగా పెట్టుకుంది.