
బంగారం.. ఈ పేరు వింటేనే భారతీయుల ముఖాలు వెలిగిపోతాయ్. భూమి మీద బంగారం కోసం వేల ఏళ్లుగా వెతుకులాట కొనసాగుతూనే ఉంది. అసలు ఈ బంగారం కొన్ని చోట్ల మాత్రమే ఎందుకు దొరుకుతుంది? మిగిలిన చోట్ల ఎందుకు ఉండదు? ఈ మిస్టరీని సైంటిస్టులు చేజించే ప్రయత్నం చేసారు. సముద్ర గర్భంలో ఒక భారీ గోల్డ్ ఫ్యాక్టరీని కనిపెట్టారు. న్యూజిలాండ్‌కు ఈశాన్యంగా ఉన్న కెర్మాడెక్ ఐలాండ్ ఆర్క్ అనే ప్రాంతంలో ఈ ప్రకృతి వింత జరుగుతోందని వారు గుర్తించారు. ఇది మన కళ్లకు కనిపించని ఒక భారీ పసిడి తయారీ కేంద్రం అని వారు చెబుతున్నారు.
భూమి లోపల ఒక టెక్టోనిక్ ప్లేట్ మరొక దాని కిందకు వెళ్ళినప్పుడు.. అక్కడ అగ్నిపర్వతాలు పుట్టుకొస్తాయి. ఈ ప్రాంతాల్లోనే బంగారం తయారీకి అవసరమైన మ్యాజిక్ జరుగుతుందట. సాధారణంగా బంగారం సల్ఫైడ్ అనే ఖనిజాల్లో బందీ అయి ఉంటుంది. అయితే.. సముద్రపు నీరు భూమి లోతుల్లోకి చేరినప్పుడు, అక్కడ జరిగే హైడ్రస్ మెల్టింగ్ అనే ప్రక్రియ వల్ల ఆ ఖనిజాలు కరిగిపోయి లోపల ఉన్న బంగారం విడుదలవుతుంది. ఈ ప్రక్రియ పదే పదే జరగటం వల్ల అక్కడ ఉండే లావాలో బంగారు నిల్వలు భారీగా పెరుగుతున్నాయని సైంటిస్టులు చెబుతున్నారు.
GEOMAR హెల్మ్‌హోల్ట్జ్ సెంటర్ సైంటిస్టులు సముద్ర గర్భంలోని అగ్నిపర్వత గాజు శాంపిల్స్ టెస్ట్ చేసినప్పుడు షాకింగ్ విషయాలు తెలిశాయి. సాధారణ ప్రాంతాలతో పోలిస్తే ఇక్కడ బంగారం సాంద్రత చాలా రెట్లు ఎక్కువగా ఉందని వారు గమనించారు. భూమి లోతుల్లోని వేడి, ఒత్తిడి, నీరు కలిసి బంగారాన్ని పై పొరల్లోకి నెడుతున్నాయని చెప్పారు. అంటే ఈ అగ్నిపర్వత దీవులు ఒక పంపింగ్ మిషన్ లాగా పనిచేస్తూ బంగారాన్ని భూమి పైకి చేరవేస్తున్నాయన్న మాట.
అయితే చాలా మంది అనుకుంటున్నట్లు వెంటనే వెళ్లి ఆ బంగారాన్ని తెచ్చుకోవడం సాధ్యం కాదు. ఎందుకంటే అది సముద్రపు అట్టడుగున.. కిలోమీటర్ల లోతులో ఉంది. ప్రస్తుతం భూమిపై ఉన్న టెక్నాలజీతో వాటిని బయటకు తీయడం లాభదాయకం కాదు. ఈ పరిశోధన ద్వారా భూమి తన నిధిని ఎలా దాచుకుంటుందో, గోల్డ్ అసలు ఎలా పుడుతుందో అనే సీక్రెట్ మిస్టరీ వీడింది. భూమి తన గర్భంలో ఇటువంటి ఎన్నో గోల్డ్ ఫ్యాక్టరీలను దాచుకుందని.. మనకు తెలిసింది కేవలం గోరంత మాత్రమేనని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.