
పిల్లికి చెలగాటం.. ఎలుకకు ప్రాణ సంకంటం అనే సామెత ఈ అమానుష ఘటనకు సరిగ్గా సరిపోతుందేమో. గంజాయి బ్యాచ్ సోషల్ మీడియాలో వైరల్ అయ్యేందుకు చేసిన అరాచకం.. ఆ వ్యక్తికి నిజంగా ప్రాణసంకటంలా మారింది. వీళ్లు మనుషులా.. రాక్షసులా.. లేదా ఇంకేమైనా పేరు పెట్టాలా అన్నంతలా దారుణానికి పాల్పడ్డారు ఈ గంజాయి బ్యాచ్. అది కూడా వరంగల్ నడిబొడ్డను జరగటం ఆందోళనకరమైన విషయం.
వరంగల్ గాంధీనగర్ లో జరిగిన ఈ అమానుష ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళ్తే.. 2026 మార్చి 17వ తేదీన గంజాయి మత్తులో పగిండ్ల నరేష్ అనే వ్యక్తిపై అత్యంత క్రూరంగా దాడి చేసింది గంజాయి బ్యాచ్. నరేష్ రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా బైక్ పై వచ్చిన పసునూరి అనే యువకుడు డ్యాష్ ఇచ్చాడు. ప్రశ్నించినందుకు విచక్షణా రహితంగా దాడి చేశాడు. పెద్ద బండరాయిని ఎత్తి పలు మార్లు కడుపు, నడుము, కాళ్లపై బలంగా వేశాడు. అంతటితో ఆగకుండా పగబట్టిన పాము మాదిరిగా పిడిగుద్దులు గుద్దుతూ, తంతూ, తిడుతూ రాక్షసానందం పొందాడు.
ALSO READ ; కీసర టోల్ గేట్ దగ్గర ఘోరం..
- 20 రోజులుగా చావుతో పోరాటం..
తీవ్రంగా గాయపడిన బాధితుడిని కళ్యాణ్ తో పాటు మరో ముగ్గురు వ్యక్తులు కలిసి డ్రైనేజ్ కాలువతో పడేశారు. గంజాయి బ్యాచ్ లో ఒకడు వీడియో తీస్తుండగా వీళ్లంతా కాలువలో పడేశారు. అత్యంత కిరాతకంగా జరిగిన దాడిలో నరేష్ గత 20 రోజులుగా ఎంజీఎం హాస్పిటల్ లో చావుతో పోరాడుతున్నాడు. దాడికి పాల్పడిన వాళ్లే ఆ దృశ్యాలను సోషల్ మీడియాలో అప్ లోడ్ చేయడంతో పాటు.. బాధితుడి ఫిర్యాదుతో ఈ ఇన్సిడెంట్ వెలుగులోకి వచ్చింది.
- బీర్ తాగుతూ.. వీడియో చూస్తూ పైశాచికానందం..
సోషల్ మీడియాలో ఫేమస్ అయ్యేందుకు దాడి చేసి.. వైరల్ చేసేందుకు వాళ్లే అప్ లోడ్ చేయడం ఆందోళన కలిగించే విషయం. ఆ వీడియోను సోషల్ మీడియాలో చూసుకుంటూ పైశాచిక ఆంనందం పొందుతున్న తీరును చూస్తే వీళ్లు నిజంగా మనుషులేనా అనే ప్రశ్న రాక మానదు. దాడికి సంబంధించిన విజువల్స్ టీవీలో ప్లే అవుతుంటే బీర్ తాగుతూ చూస్తూ.. చూడరా మన ఘనకార్యం అన్నట్లుగా గర్వంగా ఫీలవుతున్న విజువల్స్ మానవత్వం ఉన్న ఏ ఒక్కరినైనా కలచివేయక మానదు.
అయితే దాడి చేస్తున్న దృశ్యాలను ఇన్స్టాగ్రామ్ లో పోస్ట్ చేయడంతో నిందితులను గుర్తించడం పోలీసులకు ఈజీ అయ్యింది. ఈ దాడికి సంబంధించి ఏప్రిల్ 10వ తేదీ రాత్రి మిల్స్ కాలనీ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేశారు పోలీసులు. దర్యాప్తు జరుగుతోందని, నిందితులపై కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు.