
హైదరాబాద్: రైతు భరోసా నిధులను సీఎం రేవంత్ రెడ్డి విడుదల చేశారు. ఈ సందర్భంగా.. కేసీఆర్పై, బీఆర్ఎస్ పాలనపై సీఎం రేవంత్ మండిపడ్డారు. మళ్లోసారి కేసీఆర్ వస్తే భార్యాభర్తల మాటలను వింటారని దుయ్యబట్టారు. కన్న బిడ్డ కవిత, అల్లుడు మాట్లాడుకున్న మాటలు విన్నారని ఫోన్ ట్యాపింగ్పై రేవంత్ మాట్లాడారు.
30 నెలల్లో రైతు సంక్షేమం కోసం అనేక పనులు చేశామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. 19 మంది ముఖ్యమంత్రులు రాష్ట్రానికి రూ.69 వేల కోట్లు అప్పు చేశారని, 2014 నాడు రాష్ట్రం ఏర్పడినప్పుడు రాష్ట్రానికి రూ.69 వేల కోట్లే అప్పు ఉందని సీఎం గుర్తుచేశారు. పదేళ్ల బీఆర్ఎస్ పాలనలో రూ.8 లక్షల 11 వేల కోట్ల అప్పు అయిందని సీఎం రేవంత్ రెడ్డి ఆరోపించారు. కేవలం కల్వకుంట్ల కుటుంబం ఏడు లక్షల కోట్లకు పైగా అప్పు చేసిందని సీఎం చెప్పారు.
రాష్ట్రం ఏర్పడిన టైంలో మిగులు బడ్జెట్ ఉండేదని, రాష్ట్రం కోలుకోకుండా కేసీఆర్ అప్పులు చేశారని సీఎం రేవంత్ రెడ్డి విమర్శించారు. అప్పులు కాదు.. అందిన కాడ చేబదులు కేసీఆర్ తీసుకొచ్చారని.. కాంగ్రెస్ అధికారంలోకి వచ్చే నాటికి ఉద్యోగులకు జీతాలు వాయిదాల్లో ఇచ్చారని బీఆర్ఎస్ పాలనను సీఎం రేవంత్ దుయ్యబట్టారు.
►ALSO READ | రైతు భరోసా నిధులు విడుదల చేసిన సీఎం రేవంత్
ధనిక రాష్ట్రంలో జీతాలు ఇవ్వలేని స్థితికి కేసీఆర్ తీసుకెళ్లారని సీఎం రేవంత్ విమర్శించారు. కాంట్రాక్టర్లు, సర్పంచులకు బకాయిలను కేసీఆర్ ఇవ్వలేదని, కేసీఆర్ సర్కార్ వల్లే మాజీ సర్పంచులు ఆత్మహత్యలు చేసుకున్నారని సీఎం ఆరోపించారు. బకాయిలు బకాసురుడు పెడితే.. కట్టే పాపం తనపై పడిందని సీఎం రేవంత్ చెప్పుకొచ్చారు.
స్కూ్ల్లోని పిల్లలకు మిడ్ డే మీల్స్ పెట్టేవాళ్లకు బకాయిలు పెట్టారని.. బీఆర్ఎస్ సర్కార్ అప్పులే కాదు.. తప్పులు కూడా చేసిందని సీఎం విమర్శించారు. దేశంలో ఎక్కడికి పోయినా ఇజ్జత్ పోయేలా కేసీఆర్ చేశారని, చంద్రశేఖర్ దెబ్బకు రాష్ట్రంలోని ప్రజలంతా బికారులయ్యామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. తవ్వుతున్న కొద్దీ.. గుట్టల కొద్దీ అప్పులు బయటపడ్డాయని.. బీఆర్ఎస్ హయాంలో కట్టిన కాళేశ్వరం కూలేశ్వరం అయిందని సీఎం రేవంత్ రెడ్డి ఎద్దేవా చేశారు.