Reading Time: < 1 minute
Brahmanandam Trolls Brahmaji Age Hangman Movie Trailer Launch Event

Brahmanandam: నటుడు బ్రహ్మాజీ ప్రధాన పాత్రలో నటిస్తున్న వైవిధ్యభరితమైన చిత్రం ‘హ్యాంగ్‌మ్యాన్’ (Hangman). విహాన్ డైరెక్షన్‌లో అజయ్ మైసూర్ నిర్మిస్తున్న ఈ సినిమా ట్రైలర్ రిలీజ్ కార్యక్రమాన్ని ఈ రోజు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ప్రముఖ హాస్యనటుడు, పద్మశ్రీ డా.బ్రహ్మానందం, ప్రముఖ దర్శకురాలు నందినీ రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో బ్రహ్మానందం మాట్లాడుతూ.. సినిమా టైటిల్ ‘హ్యాంగ్‌మ్యాన్’ తనను ఎంతగానో ఆకర్షించిందని చెప్పారు. సమాజంలో ఎన్నో రకాల వృత్తులు ఉంటాయని, కానీ ఒక మనిషిని ఉరితీసే వ్యక్తి (హ్యాంగ్‌మ్యాన్) మానసిక స్థితి, అతని భావోద్వేగాలు ఎలా ఉంటాయనే విభిన్నమైన పాయింట్‌తో ఈ సినిమాను తెరకెక్కించడం అభినందనీయమని డైరెక్టర్‌ విహాన్‌ను కొనియాడారు. భవిష్యత్తులో అతను టాలీవుడ్‌లో బెస్ట్ డైరెక్టర్లలో ఒకరిగా నిలుస్తారని ఆశాభావం వ్యక్తం చేశారు.

బ్రహ్మాజీ గురించి ఆయన మాట్లాడుతూ.. బ్రహ్మాజీ ఒక అద్భుతమైన నటుడని, కామెడీ, విలనిజం, క్యారెక్టర్ ఆర్టిస్ట్ ఇలా ఏ పాత్రనైనా పండించగల సత్తా ఆయనకు ఉందని బ్రహ్మానందం ప్రశంసించారు. అయితే ఇంతకాలానికి బ్రహ్మాజీ నటనకు సరైన ఛాలెంజింగ్ క్యారెక్టర్ ఈ సినిమా రూపంలో దొరికిందని, ట్రైలర్‌లో ఆయన పెర్ఫార్మెన్స్ అద్భుతంగా ఉందని పేర్కొన్నారు. అలాగే ఆయన బ్రహ్మాజీ గురించి సరదాగా మాట్లాడి పరువు తీసేశారు. బ్రహ్మాజీ ఇప్పుడు ఇలా కనిపిస్తున్నాడు కానీ, ఆయన ఎప్పుడో భూమి పుట్టినప్పుడు పుట్టాడు. మా కంటే చాలా సీనియర్. ఎప్పటి వాడివిరా నువ్వు అంటూ టీజ్ చేశారు. అలాగే ఈ సినిమాలో బ్రహ్మాజీ కొడుకుగా నటించిన సన్నీని, ఇతర చిత్ర యూనిట్‌ను ఆయన అభినందించారు. ఈ కార్యక్రమానికి హాజరైన ఒక నిజజీవిత హ్యాంగ్‌మ్యాన్ (ఉరితీసే వ్యక్తి)ను స్టేజ్ పైకి ఆహ్వానించిన సందర్భంగా బ్రహ్మానందం ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశారు. సమాజంలో రాజకీయ, ఆర్థిక, సాంస్కృతిక వ్యవస్థలు సరిగ్గా పని చేసినప్పుడు ఎవరూ తప్పు చేయరని.. ఒక మనిషికి ఉరిశిక్ష పడే పరిస్థితే రాకూడదని అన్నారు. తద్వారా ఈ ‘హ్యాంగ్‌మ్యాన్’ అనే వృత్తి వ్యవస్థే త్వరలోనే పూర్తిగా నశించిపోవాలని, అంతటి ఘోరమైన తప్పులు ఎవరూ చేయని సమాజం రావాలని ఆకాంక్షించారు.