నైరుతి రుతుపవనాలు వచ్చినా వర్షాలు అనుకున్నంత స్థాయిలో పడటం లేదు. రుతుపవనాలు బలహీనంగా ఉండటంతో వర్షాభావ పరిస్థితులు నెలకొన్నాయి. ఇంకా వర్షాలు మొదలవ్వలేదు. దీంతో అన్ని ప్రాంతాల్లో లోటు వర్షపాతం కొనసాగుతోంది. ఈ ఏడాది సాధారణంతో పోలిస్తే తక్కువ వర్షపాతం నమోదవుతుందని, ఎల్ నీవో ప్రభావం వల్ల వర్షాలు ఉండవని ఐఎండీ అంచనా వేసింది. దీని ప్రభావం సామాన్యులపై పడనుంది.
తక్కువ వర్షపాతం వల్ల పాలు, పప్పుధాన్యాలు, వంట నూనె, కూరగాయల ధరలు పెరిగే అవకాశముందని నిపుణులు చెబుతున్నారు. వర్షాలు తక్కువగా ఉండటం వల్ల వ్యవసాయం, పశుపోషణ రెండూ దెబ్బతింటాయి. ప్రభుత్వం, వ్యవసాయ నిపుణులు పరిస్థితిని పర్యవేక్షిస్తున్నారు. దీని కోసం వారు వివిధ ప్రత్యామ్నాయాలను కూడా గుర్తించారు. పంట ప్రణాళిక వంటి సన్నాహాలను కూడా ప్రారంభించారు, అయితే జూలై, ఆగస్టు నెలల్లో కురిసే వర్షాలే కీలకంగా మారనున్నాయని నిపుణులు చెబుతున్నారు.
తక్కువ వర్షపాతం వల్ల పశువుల మేతకు కొరత ఏర్పడుతుంది. పచ్చి మేత కొరత పశువుల పెంపకందారులకు ఖర్చులను పెంచుతుంది. ఇది పాల ఉత్పత్తిపై నేరుగా ప్రభావం చూపుతుంది. పాల ఉత్పత్తి తగ్గడం వల్ల డెయిరీ కంపెనీలు పాల ధరలను పెంచవచ్చు. వర్షాభావ పరిస్థితులు ఇలాగే కొనసాగితే.. జూలై నెలలో పాల ధరలు సుమారు 3 శాతం నుండి 4 శాతం వరకు పెరగవచ్చని పరిశ్రమ అధికారులు భావిస్తున్నారు. ఇది పాలపైనే కాకుండా పెరుగు, పనీర్, నెయ్యి, వెన్న, చీజ్ వంటి పాల ఉత్పత్తులపై కూడా ప్రభావం చూపుతుంది.
వర్షాలు లేకపోవడం వల్ల రైతులు పంటలు వేయడం ఆలస్యమవుతుంది. కంది, మినుములు, ఇతర పప్పుధాన్యాల సాగు తగ్గుతుంది. దీని వల్ల ఉత్పత్తి తగ్గే అవకాశం ఉంది. సోయాబీన్, ఇతర నూనెగింజల పంటల విత్తనాలు వేయడం కూడా నెమ్మదిగా సాగే అవకాశం ఉంది. దీని వల్ల వీటిని విదేశాల నుంచి దిగుమతి చేసుకునే అవసరం రావొచ్చు. దీంతో దిగుమతులు ఖరీదైనవిగా మారితే పప్పుధాన్యాలు, వంట నూనెల ధరలు భారీగా పెరగవచ్చు.
ఇక వర్షాలు లేకపోతే కూరగాయల సాగు కూడా తగ్గుతుంది. దీంతో టమోటాలు, ఆకుకూరలు, ఇతర త్వరగా పాడైపోయే పంటల సరఫరాపై ప్రభావం చూపవచ్చు. దీనివల్ల స్థానిక, చిల్లర మార్కెట్లలో ధరలు విపరీతంగా పెరగవచ్చు. మొక్కజొన్న, కొన్ని ఇతర ఖరీఫ్ పంటలు కూడా ప్రభావితమయ్యే అవకాశం ఉంది. వర్షపాతం దీర్ఘకాలం పాటు సాధారణం కంటే తక్కువగా ఉంటే ఆహార ద్రవ్యోల్బణం ఏర్పడే అవకాశం ఉంది.




