
వాషింగ్టన్: పశ్చిమాసియాలో హోరాహోరీ యుద్ధం, దాడు లు.. ప్రతిదాడులకు హెచ్చరికలు సాగుతున్న క్రమంలో అ మెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ అనూహ్య ప్రకటన చేశా రు. 48గంటల్లోగా హర్మూజ్ జలసంధిని పూర్తిగా తెరవకపోతే ఇరాన్ విద్యుత్, ఇంధన కేంద్రాలను లక్షంగా చేసుకుంటామని ప్రకటించిన ట్రంప్ ఆ దాడులను ఐదు రోజు ల పాటు వాయిదా వేసినట్లు తాజాగా వెల్లడించారు. ఈ మేరకు తమ బలగాలను కూడా ఆదేశించినట్లు సోమవారంనాడు తన సోషల్ మీడియా వేదిక ట్రూత్‌లో పేర్కొన్నా రు. ఇరాన్‌తో చర్చల పురోగతిపైనే తమ భవిష్యత్ కార్యాచారణ ఆధారపడి ఉంటుందని కూడా వివరించారు. ఇరాన్ అణు, విద్యుత్, ఇంధన కేంద్రాలపై మరో 5 రోజుల పాటు అమెరికా, ఇజ్రాయెల్ ఎటువంటి దాడులకు దిగబోవని ప్రకటించారు. ఇరాన్‌కు చెందిన ఒక బాధ్యతాయుతమైన వ్యక్తితో తన అల్లుడు కుష్నర్, విట్‌కాఫ్‌లు ఆదివారంనాడు రాత్రి చర్చలు జరిపారని ట్రంప్ వెల్లడించారు. ఇరాన్‌తో చర్చల విషయం, దాడులు తాత్కాలిక నిలిపివేత విషయం ప్రకటన వెలువడగానే అంతర్జాతీయ మార్కెట్‌లో
ముడిచమురు ధరలు గణనీయంగా తగ్గాయి. గంటల వ్యవధిలోనే బ్యారెల్ ముడిచమురు ధరలు 17 డాలర్ల చొ ప్పున తగ్గుముఖం పట్టి 97డాలర్లకు చేరుకున్నాయి. మరోవైపు ట్రంప్ ప్రకటన వెలువడిన వెంటనే ఇరాన్ సంచలన ప్రకటన చేసింది. అసలు ట్రంప్ చెబుతున్నట్లు ప్రత్యక్షం గా, పరోక్షంగా కానీ ఆయనతో ఎలాంటి చర్చలు జరగలేదని కుండ బద్ధలు కొట్టింది. ఈ మేరకు ఇరాన్ రెవెల్యూషనరీ గార్డ్ తెలిపినట్లు ఇరాన్‌కు చెందిన అధికారిక వార్త సంస్థతో సహా రెండు ప్రధాన వార్తాసంస్థలు తెలిపాయి. చమురు ధరలు తగ్గుముఖం పట్టేందుకే ట్రంప్ ఇలాంటి నాటకాలు ఆడుతున్నారని ఎద్దేవా చేసింది. అదే సమయంలో చర్చల ప్రతిపాదన వచ్చినా తాము తిరస్కరించినట్లు ఇరాన్ పేర్కొంది. యుద్ధ నివారణకు గల్ఫ్ దేశాలు చొరవ తీసుకున్నాయని, కానీ చొరవ తీసుకోవాల్సింది యుద్ధం మొదలు పెట్టిన దేశం కదా అని ఎదురు ప్రశ్నించింది. మా హెచ్చరికలకు భయపడే ఇప్పుడు ట్రంప్ వెనక్కి తగ్గారని స్పష్టం చేసింది.
అంతకుముందు ఉదయం తమ విద్యుత్, ఇంధన కేంద్రాలపై దాడులు చేస్తే అమెరికా, ఇజ్రాయెల్, గల్ఫ్ దేశాల విద్యుత్ కేంద్రాలను కూడా మేము దెబ్బతీస్తామని, హర్మూజ్‌ను శాశ్వతంగా మూసివేస్తామని హెచ్చరించింది. ట్రంప్ బెదిరింపులకు భయపడేదిలేదని ఇరాన్ తెలిపింది. అంతకుముందు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ స్పందించారు. తాను టర్కీ విదేశాంగ మంత్రి హకన్ ఫిదాన్‌తో మాట్లాడినట్లు తెలిపారు. అమెరికా, ఇరాన్ మధ్య సంప్రదింపులకు టర్కీ మధ్యవర్తిత్వం వహిస్తోందన్నారు. గల్ఫ్‌దేశాలను పూర్తి స్థాయిలో దెబ్బతీస్తామని, రక్షణ వలయాలను పటిష్టపర్చుకుంటామన్నారు. తీవ్ర పరిణామాలకు సిద్ధంగా ఉన్నామని కూడా అరాగ్చీ స్పష్టం చేశారు. సోమవారం ఉదయం అరబ్ ఏమిరేట్స్‌పై దూసుకువచ్చిన ఇరాన్ క్షిపణిని దెబ్బతీసినట్లు వార్తలు వెలువడ్డాయి. మరోవైపు చర్చలు బెదిరింపులతో ప్రసక్తి లేకుండా ఇజ్రాయెల్ సేనలు సోమవారం ఉదయం నుంచే టెహరాన్ ఇతర ప్రాంతాలపై దాడులు తీవ్రతరం చేశాయి. ఇరాన్ కీలక స్థావరాలను ఎంచుకుని తమ దాడులు సాగిస్తామని వెల్లడించారు. అయితే ట్రంప్ చర్చల ప్రస్తావనకు ముందు ఈ ఘటనలు జరిగాయి.
ఇరాన్‌తో చర్చలు ఫలిస్తే హర్మూజ్‌పై సంయుక్త ఆధిపత్యం
హర్మూజ్ జలసంధిపై అమెరికా అధ్యక్షులు ట్రంప్ సోమవారం కీలక ప్రకటన వెలువరించారు. ఇరాన్‌తో తమ దౌత్యం ఫలిస్తే అంతా సుఖాంతం అవుతుందని తెలిపారు. త్వరలోనే హర్మూజ్ జలసంధి మార్గం తెరుచుకుంటుంది. పైగా ఇరాన్ నూతన నాయకత్వంతో కలిసి ఈ మార్గంపై తమ సంయుక్త ఆధిపత్యం ఉంటుందని కూడా వెల్లడించారు. తాము ఇప్పటి అధినేత మొజ్తాబాను నాయకుడిగా గుర్తించడం లేదన్నారు. అయితే ట్రంప్ తాజా ప్రకటనపై ఇరాన్ నుంచి ఎటువంటి స్పందనా వెలువడలేదు. ఇరాన్‌తో యుద్ధం దాదాపు ముగిసినట్లే అని ప్రకటించిన ట్రంప్, ఇరాన్‌తో 15 అంశాలతో కూడిన ఒప్పందం ఖరారు కానుందని చెప్పారు. హర్మూజ్‌పై ఉమ్మడి నియంత్రణ కీలకం అన్నారు.
ఇరాన్‌పై తమ దేశ దాడులను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు తెలిపిన ట్రంప్ ఈ ప్రాంతంలో అసాధారణ రీతిలో సముద్ర జలాల భద్రతకు వీలేర్పడుతుందని, ఇప్పటి ఉద్రిక్తత ఇకపై తలెత్తకుండా చేస్తామని కూడా వివరించారు. హర్మూజ్‌పై తమకు, ఇరాన్ నాయకత్వానికి మధ్య ఉమ్మడి అదుపు ఉంటుందని తెలిపారు. ఇప్పటి తమ చర్చలలో ప్రధానాంశం కేవలం ఇరాన్ ఇకపై అణ్వాయుధాలు సంతరించుకోకుండా ఉండటమే. ఇదే తమ లక్షం అని తేల్చిచెప్పారు. భవిష్యత్తులో యుద్థాలు తలెత్తకుండా చేసేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లు శాంతి ఒప్పందంలో ఉంటాయని ఆశాభావం వ్యక్తం చేశారు. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇరాన్‌తో కీలక ఒప్పందం అత్యవసరం, కాదనలేనిది అని స్పష్టం చేశారు. ఇక్కడో మెలిక పెట్టారు. ఇరాన్‌తో చర్చలకు నూతన నాయకత్వం ఎంచుకుంటున్నట్లు ప్రకటించారు.