Reading Time: < 1 minute

ఎపి జెన్ కో నుండి ఎస్‌పిడిసిఎల్‌కు డిఇ దుర్గా ప్రసాద్

రెడ్కో ఎండీగా ఆంధ్రా ప్రాంత అధికారి

బిఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై.సతీష్ రెడ్డి

మనతెలంగాణ/హైదరాబాద్ : విద్యుత్ సంస్థల్లో ఆంధ్రా ఉద్యోగులకు రెడ్ కార్పెట్ వేస్తున్నారని బిఆర్‌ఎస్ సోషల్ మీడియా కన్వీనర్ వై.సతీష్ రెడ్డి విమర్శించారు. విద్యుత్ శాఖను పూర్తిగా ఆంధ్రా ప్రాంత ఉద్యోగులతో నింపేస్తున్నాదని, కీలకపదవులన్నీ వారికే కట్టబెడుతున్నారని ఒక ప్రకటనలో పేర్కొన్నారు. తాజాగా ఎపి జెన్‌కో నుండి దుర్గా ప్రసాద్ అనే డిఇని తీసుకొచ్చి తెలంగాణ దక్షిణ విద్యుత్ పంపిణీ సంస్థలో పెట్టారని అన్నారు. ఇప్పటికే తెలంగాణ రెడ్కో సంస్థ ఎండీ పదవిని ఆంధ్రా ప్రాంత అధికారికే కట్టబెట్టారని చెప్పారు. అలాగే విద్యుత్ సంస్థల్లో డైరెక్టర్ పోస్టుల్లో కూడా వారికే ప్రాధాన్యత ఇస్తున్నారని ఆరోపించారు. ట్రాన్స్ కో, జెక్ కో, డిస్కంలలోని కీలక పదవులన్నీ ఒక్కొక్కటిగా ఆంధ్రా ప్రాంత అధికారుల చేతుల్లో పెట్టేస్తున్నారని, ఇంత ఎంత మాత్రం కూడా సబబు కాదని పేర్కొన్నారు.

వారిని తీసుకొచ్చి ఇక్కడ పోస్టులు ఇవ్వడం వల్ల ఇక్కడ ఉన్న సీనియర్ ఉద్యోగులు తమకు రావాల్సిన ప్రమోషన్లు కోల్పోవాల్సి వస్తున్నదని, దీనిపై ఉద్యోగ సంఘాలు అభ్యంతరం చెబుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమని అన్నారు. మన ఉద్యోగాలు మనకే.. అన్న రాష్ట్ర సాధన ఉద్యమ కీలక నినాదానికే ఇప్పుడు రేవంత్ రెడ్డి సర్కారు తూట్లు పొడుస్తోందని ఆరోపించారు. ఇవన్నీ ముఖ్యమంత్రి కనుసన్నల్లో జరుగుతున్నాయా… లేకపోతే విద్యుత్ శాఖ మంత్రిగా ఉన్న భట్టి విక్రమార్క కనుసన్నల్లో జరుగుతున్నాయా బయటపెట్టాలని డిమాండ్ చేశారు. తెలంగాణ రాష్ట్ర సాధన పోరాటంలో.. ఉద్యోగాల అంశం ఆనాడు కీలకంగా ఉందని, ఆంధ్రా ప్రాంత ఉద్యోగులు తెలంగాణ యువతకు, ఇక్కడి ఉద్యోగులకు దక్కాల్సిన పదవులకు లాక్కుంటున్నారని.. దానికి అడ్డుకట్ట వేయాలని ఆనాడు ఉద్యమం చేశామని అన్నారు. కానీ, ఇప్పుడు రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చిన తర్వాత మళ్లీ ఆంధ్రా ప్రాంత ఉద్యోగులను తీసుకొచ్చి తెలంగాణలో రాచమర్యాదలు చేస్తున్నారని పేర్కొన్నారు. రాష్ట్ర ఉద్యోగులకు అన్యాయం చేసేలా ఇలాంటి నిర్ణయాలు తీసుకుంటున్నవారు కచ్చితంగా ద్రోహులుగా మిగిలిపోతారని అన్నారు.