Reading Time: < 1 minute
Ap East West Cargo Corridor Operations To Start At Mulpeta Machilipatnam Ramayapatnam Ports

AP East-West Cargo Corridor: ఆంధ్రప్రదేశ్‌లోని వివిధ పోర్టుల నుంచి కార్గో హ్యాండ్లింగ్ ఆపరేషన్ల ద్వారా ఈస్ట్ -వెస్ట్ కార్గో కారిడార్‌గా రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆదేశించారు. రాష్ట్రంలో నూతనంగా నిర్మితం అవుతున్న మూలపేట, మచిలీపట్నం, రామాయపట్నం పోర్టుల్లో త్వరితగతిన కార్గో హ్యాండ్లింగ్ ఆపరేషన్లు ప్రారంభం కావాలని సీఎం స్పష్టం చేశారు. సచివాలయంలో పోర్టులు, ఫిషింగ్ హార్బర్లపై ముఖ్యమంత్రి అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ మూడు పోర్టుల నుంచి పొరుగు రాష్ట్రాలైన ఒడిశా, చత్తీస్‌ఘఢ్, మధ్యప్రదేశ్, మహారాష్ట్ర, తెలంగాణ, కర్ణాటకల హింటర్ ల్యాండ్ నుంచి కార్గో రవాణా జరిగేలా చర్యలు చేపట్టాలని సూచించారు. మచిలీపట్నం, రామాయపట్నం పోర్టులు 2026 డిసెంబర్‌ నాటికి పూర్తి అవుతాయని అధికారులు ముఖ్యమంత్రికి వివరించారు. భారత్ పెట్రోలియం కార్పొరేషన్ రిఫైనరీ కూడా ఏర్పాటైన అనంతరం కంటైనర్, బల్క్ కార్గో పోర్టుగా రామాయపట్నం మారుతుందని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు.

Read Also: India-Iran: ఇరాన్‌లో భారతీయులకు కేంద్రం తాజా హెచ్చరికలు ఇవే!

రామాయపట్నం నుంచి కడప స్టీల్ ప్లాంట్ వరకూ ప్రత్యేక మార్గాన్ని వేసేందుకు కూడా రైల్వే శాఖ ఆమోదం తెలిపిందని సీఎం చంద్రబాబు తెలిపారు. మూడు పోర్టులకు సమీపంలోనూ పోర్టు టౌన్ షిప్ ఏర్పాటు చేయడం ద్వారా వాణిజ్య పరమైన లావాదేవీలు కూడా పెరుగుతాయని ముఖ్యమంత్రి దిశానిర్దేశం చేశారు. వీటితో పాటు పోర్టులకు సమీపంలో పారిశ్రామిక కారిడార్‌లు కూడా అభివృద్ధి చెందేందుకు ఆస్కారం ఉందన్నారు. రెండో దశలో బుడిగట్లపాలెం, పూడిమడక, కొత్తపట్నం ఫిషింగ్ హార్బర్లను కూడా వేగంగా చేపట్టాలని ముఖ్యమంత్రి సూచించారు. సమీప భవిష్యత్తులో ప్రతీ 50 కిలో మీటర్లకు పోర్టు, ఫిషింగ్ హార్బర్లు రానున్న నేపథ్యంలో ఈస్ట్ కోస్టు లాజిస్టిక్స్ హబ్ గా ఏపీ మారుతుందన్నారు. ఏపీలో ఉన్న పోర్టులు కార్గో హ్యాండ్లింగ్‌లో గేమ్ ఛేంజర్‌గా మారాలని సీఎం సూచనలు చేశారు. ప్రస్తుతం యుద్ధం కారణంగా దుబాయ్, గల్ఫ్ దేశాల్లోని ఓడరేవులు ఇబ్బందుల్లో పడ్డాయని.. ఇప్పుడు భారత్ లోని ఈస్ట్ కోస్ట్ లో ఉన్న పోర్టులే సురక్షితం అన్న అభిప్రాయం వచ్చిందని ఈ ప్రయోజనాన్ని అందిపుచ్చుకోవాలని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. ఈ సమీక్షలో పెట్టుబడులు, మౌలిక సదుపాయాల కల్పన శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కృష్ణబాబు, మారి టైమ్ బోర్డు సీఈఓ అభిషేక్ కుమార్ హాజరయ్యారు.