Reading Time: 3 minutes

 నేను నా సాహితీ యాత్ర: నేను గుంటూరు జిల్లా ‘ప్యాపర్రు’ అనే ఒక చిన్న గ్రామంలో దళిత మాల సామాజిక వర్గంలో పుట్టాను. మా తల్లిదండ్రులు పెద్దగా చదువుకోలేదు. మేము మొత్తం ఆరుగురం పిల్లలం. అందరిలోనూ యూనివర్సిటీ చదువుదాకా వచ్చింది నేనే! గ్రామీణ దళిత నేపథ్యం వలన కుల వివక్ష, శ్రమ దోపిడీ, పేదరికం నేరుగా అనుభవంలోకి వచ్చాయి. అలాగే యింట్లో పితృస్వామ్యం కూడా వుండేది. అవి చదువు, వుద్యోగ జీవితంలో కూడా వివిధ రూపాలలో అనుభవంలో వుంటూనే వస్తున్నాయి. నేను ఒకటవ తరగతి నుండి హైస్కూల్ వరకు మా గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలో చదివాను. కాలేజీ చదువు పొన్నూరు, గుంటూరులలో జరిగింది. తరువాత ఎం.ఏ (ఆర్కియాలజీ, ఫిలాసఫీ), ఎమ్.ఫిల్ (హిస్టరీ), పి.హెచ్.డి ఆంధ్రా, నాగార్జున యూనివర్సిటీ, హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలలో పూర్తి చేశాను. మొదటి ఉద్యోగం పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ శ్రీశైలం క్యాంపస్‌లో తొమ్మిది సంవత్సరాలు చేశాక, ఆచార్య నాగార్జున యూనివర్సిటీలో అసోసియేట్ ప్రొఫెసర్‌గా చేరాను. ప్రొఫెసర్ గా, డీన్‌గా, ప్రిన్సిపల్‌గా ఇలా రకరకాల హోదాల్లో పనిచేస్తూ ప్రస్తుతం నాగార్జున యూనివర్సిటీలోనే కొనసాగుతున్నాను.

మాది సాహిత్య వాతావరణం బొత్తిగాలేని కుటుంబం. ఉపాధ్యాయులు, స్నేహితుల ప్రభావంతో మంచి సాహిత్యాన్ని కాలేజీ రోజుల నుంచి చదవడం ప్రారంభించాను. ఈ క్రమంలోనే నేను కాలేజీ చదివే రోజుల్లో ప్రకృతి, స్నేహం, బాల్యం, ఇలాంటి అనుభూతి కవితలు అప్పుడప్పుడు రాసేదాన్ని. తరవాత హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో చేరాక అక్కడ ఉండే ఉద్యమ, సాహిత్య వాతావరణం ప్రభావం వల్ల సామాజిక చైతన్యంతో కూడిన కవితలు, కథలు, వ్యాసాలు రాయడం మొదలు పెట్టాను. ఇది అంతా 90వ దశకం ప్రారంభం నాటి మాట. అప్పటి దళిత, స్త్రీవాద ఉద్యమాలు, అంబేద్కర్ సాహిత్యం నా కవిత్వాన్ని ప్రభావితం చేసిన విషయాలు. నేను వచ్చిన సామాజిక నేపథ్యం కూడా, నేను వాటిపట్ల ఆసక్తి పెంచుకోవడానికి దోహదపడి ఉంటుంది. ఒకవైపు కులం, మరోవైపు పితృస్వామ్యం, శ్రమ దోపిడీ దళిత స్త్రీమీద ముప్పేట దాడి చేస్తే ఆమె దళితులలోనే దళితగా, స్త్రీలలో అంటరానిదిగా అందరికంటే పీడితురాలిగా వుంటుంది. 80, 90వ దశకాలలో వుధృతంగా వచ్చిన దళిత, స్త్రీవాద సాహిత్యాలలో దళిత స్త్రీ కోణం మిస్సయ్యింది. దళిత స్త్రీకోణం నుంచి ఆసామాజిక వర్గాల స్త్రీలు రాయడం లేని రోజుల్లో నేను రాయడం వలన నా రచనల్ని సాహిత్య విమర్శకులు కూడా బాగానే పరామర్శించారు.

నేను ఇప్పటివరకు మూడు కవితా సంపుటాలు మూడు వ్యాస సంపుటాలు, ఇతర సిద్ధాంతపరమైన పుస్తకాలు మొత్తం 15 దాకా పుస్తకాలు రాసి ప్రచురించాను. 1995 నుంచి పత్రికలలో కవిత్వం వస్తున్నప్పటికీ నామొదటి కవితా సంపుటి ‘మంకెనపూవు’ 2005లో శిఖామణి గారి సహాయంతో ప్రచురించగలిగాను. నా రచనలకు సాహిత్యంలో మంచి గుర్తింపు వచ్చింది. నా కవితలు ఇంగ్లీష్, హిందీ, కన్నడ, గుజరాతి వంటి భాషలలోకి అనువాదం అయ్యాయి. కొన్ని కవితలు ఇంటర్మీడియట్ స్థాయి నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ స్థాయి వరకు పాఠ్యాంశాలుగా తీసుకున్నారు. యూనివర్సిటీలలో పరిశోధక విద్యార్ధులు నా రచనలపైన ఎం. ఫిల్, పి.హెచ్ డి డిగ్రీలు కూడా చేస్తున్నారు. యివన్నీ నాకు ఎంతో సంతృప్తినిచ్చిన విషయాలు.

నాకు అనంతపురం నుంచి శాంతి నారాయణ గారు ప్రారంభించిన విమలాశాంతి సాహిత్య పురస్కారం, రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే గుర్రం జాషువా సాహిత్య పురస్కారం, గిడుగు రామ్మూర్తి స్మారక భాషా పురస్కారం, ఆడపిల్లల మీద జరిగే అత్యాచారాలు, దాడులు వంటి సమస్యల మీద రాసే వారికి ఇచ్చే లాడ్లీ మీడియావంటి అవార్డులు కొన్ని వచ్చాయి. చెన్నై హిందూ లిటరరీ ఫెస్టివల్, ముంబై గేట్ వే లిటరరీ ఫెస్టివల్, లక్నో లిటరరీ ఫెస్టివల్, బెంగుళూరు బుక్ బ్రహ్మ లిటరరీ ఫెస్టివల్, హైదరాబాద్ ఛాయ లిటరేచర్ ఫెస్టివల్, సమూహ లిటరరీ ఫెస్టివల్ మొదలైన వాటిలో నేను వక్తగా ఆహ్వానం అందుకుని పాల్గొన్నాను. ఇవన్నీ నాకు కొత్త మిత్రులను సమకూర్చి పెట్టాయని చెప్పొచ్చు.

రాయడంతో పాటు నేను అనేక పట్టణ స్థాయి సదస్సులు, గ్రామీణ స్థాయి సభలలో దళిత సమస్యమీద ముఖ్యంగా కులానికి అనుబంధ ప్రశ్నలపైన మాట్లాడతాను, జనంతో నేరుగా సంభాషిస్తాను. రాయడాన్ని నేను ఒక బాధ్యతగా భావిస్తాను. సమస్యల పరిష్కారం కోసం అన్ని కోణాలలో వ్యక్తులు తమకు చేతనైన పనులు చేయాలి. నేను యెవరినుద్దేశించి రాస్తానో వారితో నాకు ప్రత్యక్ష సంబంధాలు వున్నాయి. నా అక్షరాలలో వారు తమను తాము చూసుకుంటారు. వారి జీవితం, వారి భాష నా రచనలో నేరుగా వుండడం వలన వారు రాతలతో మమేకం అవుతారు. చరిత్రలో విస్మరణకు గురైన దళిత, బహుజన స్త్రీ పోరాట యోధులపైన నేను రాసిన ‘మిణుగురులు’ పుస్తకాన్ని తెనాలి దగ్గర కొల్లిపర అనే గ్రామంలో ఆవిష్కరిస్తే ఆసభకు చుట్టుపక్కల గ్రామాలనుంచి సుమారు 500 మందిహాజరయ్యారు. వారిలో పేద దళిత స్త్రీలే యెక్కువగా వుండడం నాకెంతో సంతోషం కలిగించింది. ఇప్పుడు సాహిత్యానికి పాఠకులు తగ్గిపోయారు అనేది పైకి అందరూ అనుకున్నప్పటికీ, నిజానికి సీరియస్ సాహిత్యానికి పాఠకులు పెరుగుతూనే ఉంటారనేది నా అనుభవం. మనం చేయాల్సింది రాయడం, ఎవరి మెప్పు కోసమో కాదు, ప్రజల కోసం వారి భాషలో, యాసలో రాయాలి, మన రాతలో వారు తమ కష్టాలు, కన్నీళ్లు, మొత్తంగా వారి బతుకు చిత్రం కనబడిందని అనుకుంటే చాలు. 

– చల్లపల్లి స్వరూపరాణి