Reading Time: 2 minutes

ప్రపంచంలో ఎక్కడ ఏ దేశంలో యుద్ధం జరిగినా దాని వల్ల కష్టనష్టాలను ఎదుర్కోవలసిందే ప్రజలే. రణదాహంతో నియంతలు ఇవేవీ పట్టించుకోకుండా ఇతరుల దేశాలను కొల్లగొట్టడానికే సాహసిస్తుంటారు. ఇప్పుడు అమెరికా, ఇజ్రాయెల్ ఇరాన్ మధ్య గత ఆరు రోజులుగా సాగుతున్న యుద్ధం రానురాను బీభత్సంగా మారి ప్రజలకు అన్ని విధాలా అపార నష్టం కలిగిస్తోంది. ఇరాన్ మిలిటరీ యుద్ధ విమానాలను, రాడార్లను ధ్వంసం చేశామని, అడుగడుగునా తామే విజయంతో ముందుకు పోతున్నామని అమెరికా అధ్యక్షుడు ట్రంప్ అతిగర్వంగా ప్రకటిస్తున్నారు. ఈ విజయాలను సెనేట్‌లో సాక్షాలతో సహా నిరూపించుకునే ముందు స్వదేశంలో కొన్ని అనుమానాలు, విమర్శలు తలెత్తాయి. ఇరాన్ సుప్రీం లీడర్ ఖమేనీని ఇజ్రాయెల్ సైన్యమే హతమార్చిందని, ఇందులో ట్రంప్ పాత్ర ఏదీ లేదని వచ్చిన విమర్శలకు పెంటగాన్ చీఫ్ ఎల్‌బ్రిడ్జి కాల్చీ తిప్పికొట్టడానికి ప్రయత్నించారు.

ఈ యుద్ధం బలవంతంగా ప్రారంభింప చేయడానికి తనను రంగంలోకి ఇజ్రాయెల్ ప్రధాని నెతన్యాహుయే దింపారని, ఫలితంగా పశ్చిమాసియా అంతా ధ్వంసమవుతోందన్న విమర్శలను ట్రంప్ కొట్టిపారేశారు. ఏదిఏమైనా ఈ యుద్ధం పొరుగున ఉన్న అరబ్ దేశాలతోసహా ప్రపంచం మొత్తం మీద ఉన్న 8 బిలియన్ ప్రజలకు తీరని కష్టాలను తెచ్చిపెడుతోంది. తమకు అవసరం లేకపోయినా, ట్రంప్, నెతన్యాహు యుద్ధ దాహం తమ నుంచి విపరీతంగా ఖర్చు చేయిస్తోందన్న ఆందోళన పెల్లుబుకుతోంది. ట్రంప్ సహా ఎవరూ ఈ యుద్ధం ఎప్పుడు పరిసమాప్తమవుతోందో చెప్పలేక పోతున్నారు. కానీ ఈలోగా నిత్యావసరాలకు, ప్రయాణాలకు అదనంగా మరింత ఖర్చు పెట్టవలసివస్తోంది.సముద్ర, గగన రవాణా సర్వీసులు పూర్తిగా ఆగిపోయాయి. చమురుతోసహా ఎలాంటి నిత్యావసరాలు దొరకడమే గగనకుసుమమైంది. ఆఫ్రికా, ఐరోపా, అమెరికా దేశాలకు ఏది రవాణా కావాలన్నా పశ్చిమాసియానే రవాణా హబ్‌గా ఉంటోంది. ఇరాన్ చుట్టూ ఉన్న 12 దేశాల్లో యుద్ధ వాతావరణం నెలకొనడం, దుబాయ్ వంటి కీలక ట్రాన్సిట్ హబ్‌ల్లో విమాన సర్వీసులు రద్దు కావడం, ప్రయాణికులకు చెప్పలేని ఇక్కట్లను కలిగిస్తున్నాయి. ప్రపంచవ్యాప్తంగా విమాన ప్రయాణికులకు ఎటు ఎలా వెళ్లాలో దిక్కుతోచడం లేదు.

ప్రమాదకర ప్రాంతాలను తప్పించుకోవడానికి ప్రత్యామ్నాయ ప్రయాణ మార్గాల విమానాల కోసం జనం పరుగులు తీస్తున్నారు. విమాన ఛార్జీలు ఆకాశాన్ని తాకుతున్నాయి. హోర్ముజ్ జలసంధి మూసివేత వల్ల కేవలం ప్రయాణికులు మాత్రమే ఇబ్బందులు పడడం లేదు. సూపర్ మార్కెట్లలో నిత్యావసరాలు సరిగ్గా లభ్యం కావడం లేదు. ఒకవేళ దొరికినా కొనలేని పరిస్థితి ఎదురవుతోంది. ఆహారం, నిత్యావసర వస్తువుల ధరల్లో వారు ద్రవ్యోల్బణం భారాన్ని అనుభవించక ముందే త్వరలో ఇంధనం, గ్యాస్ కోసం చాలా ఎక్కువగా చెల్లించవలసి వస్తోంది. శనివారం నుంచి యుద్ధం మొదలైన నాటి నుంచి చమురు ధరలు 15 శాతం పెరిగాయి. ఐరోపా, ఆసియాల్లో సహజవాయువు ధరలు కూడా పెరుగుతున్నాయి. ప్రపంచం మొత్తం మీద సరఫరా అవుతున్న చమురులో 20 శాతం హోర్ముజ్ జలసంధి నుంచే రవాణా అవుతోంది. ఇప్పుడు ఇది మూసివేయడంతో రోజుకు సరాసరిన 80 గ్యాస్, ఆయిల్ ట్యాంకర్లు, 160 కార్గో క్యారియర్లు మాత్రమే రవాణా అవుతున్నాయి. పర్షియా గల్ఫ్ జలాల్లో వేలాది నౌకలు నిల్చిపోయాయి.

ముందుకు హోర్ముజ్ జలసంధి లోకి వెళ్లడానికి భయపడుతున్నాయి. ఈ నౌకలకు, క్యారియర్లకు బీమా వెసులుబాటును పెంచినప్పటికీ కదలిక కనిపించడం లేదు. ఈ సమస్యల నుంచి బయటపడి సూయెజ్ కెనాల్‌ను చేసేది లేక కొందరు వినియోగిస్తున్నారు. అయితే అక్కడ కూడా సముద్ర ఓడదొంగలు, హోతీ ఉగ్రవాదుల దాడులు వెంటాడుతున్నాయి. చమురు వాణిజ్యానికి ఎలాంటి అంతరాయం కలగకూడదని ట్రంప్ ప్రయత్నిస్తున్నారు. హోర్ముజ్ జలసంధిలో నౌకలకు ఎస్కార్ట్ ఇవ్వాలని ఆలోచిస్తున్నారు. కానీ జలసంధిలో ప్రతినౌకకు రక్షణ కల్పించే సామర్ధం అమెరికా నేవీకి అంతగా లేదు. బ్రెంట్ క్రూడ్ ధర పెరుగుతున్న కొద్దీ ఈ సమస్యలు మరింత ఎక్కువవుతాయి. భారత్‌లో 45 రోజుల వరకు సరిపడేలా చమురు నిల్వలు ఉన్నాయని కేంద్ర ప్రభుత్వం చెబుతోంది. అయినప్పటికీ యుద్దం కొనసాగుతుండడంతో భయపడుతోంది.

అందుకనే చేసేది లేక ప్రత్యామ్నాయంగా రష్యా నుంచి క్రూడ్ ఆయిల్‌ను రప్పించుకోవడానికి ప్రయత్నిస్తోంది. అత్యవసర పరిస్థితులు, అనివార్య కారణాలు అని చెప్పి రష్యాలోని వ్లావికోస్టాక్ నుంచి చెన్నై కారిడార్ మీదుగా లేదా సూయెజ్ కెనాల్ కానీ, ఎర్రసముద్రం మీదుగా కానీ క్రూడ్ ఆయిల్‌ను రప్పించుకోవాలని భారత్ సిద్ధమవుతోంది. రష్యా నుంచి చమురును కొనుగోలు చేయరాదని ట్రంప్ అతని సన్నిహితులు ఆంక్షలు విధించినప్పటికీ పట్టించుకోదలచుకోలేదు. ఇదిలా ఉండగా ఆపరేషన్ ఎడిక్ ప్యూరీ పేరుతో ఫిబ్రవరి 28న ఇజ్రాయెల్ అమెరికా సంయుక్తంగా ఇరాన్‌పై యుద్ధం ప్రారంభించిన సంగతి తెలిసిందే. ఈ ఆపరేషన్ మొదలైన మొదటి 24 గంటల్లోనే ట్రంప్ ప్రభుత్వం దాదాపు 779 బిలియన్ డాలర్లు (రూ.7వేల కోట్లు) ఖర్చు చేయవలసి వచ్చింది. అగ్రరాజ్య రక్షణ బడ్జెట్ ఇప్పుడు ట్రిలియన్ డాలర్లు వరకు ఉండగా, దానిని 1.5 ట్రిలియన్ డాలర్ల వరకు పెంచే అవకాశం ఉంది. ఇదికాక ఈ యుద్ధం సాగించడానికి అమెరికా సెనేట్ ట్రంప్‌కు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం తాజా పరిణామం. ఇజ్రాయెల్ కూడా 12 రోజుల పాటు రూ. 59,524 కోట్లు ఖర్చు చేసినట్టు అంచనా. ఇన్ని లక్షల కోట్లు యుద్ధం కోసమే తప్ప ప్రజలకు ఒరిగేదేమీ లేదు.