Reading Time: < 1 minute

ముంబై: ఐసిసి టి-20 ప్రపంచకప్‌లో భాగంగా వాంఖడే స్టేడియం వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న రెండో సెమీ ఫైనల్ మ్యాచ్‌లో టీం ఇండియా ఓపెనర్ సంజూ శాంసన్ దంచి కొట్టాడు. వెస్టిండీస్‌పై తన విశ్వరూపం చూపించిన సంజూ ఈ మ్యాచ్‌లోనూ చెలరేగిపోయాడు. ఈ మ్యాచ్‌లో ఇంగ్లండ్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకోవడంతో బ్యాటింగ్ ప్రారంభించిన భారత్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ అభిషేక్ శర్మ మరోసారి నిరాశపరిచాడు. 2 ఫోర్లతో 9 పరుగులు మాత్రమే విల్ జాక్స్ బౌలింగ్‌లో చేసి ఔట్ అయ్యాడు. అయితే ఈ దశలో బ్యాటింగ్‌కి వచ్చిన ఇషాన్ కిషన్‌తో కలిసి సంజూ శాంసన్ మంచి భాగస్వామ్యం నమోదు చేశాడు.

వీరిద్దరు కలిసి 97 పరుగులు జోడించారు. ఈ క్రమంలో సంజూ అర్థశతకం కూడా సాధించాడు. కానీ, 39 పరుగుల వ్యక్తిగత స్కోర్ వద్ద ఆదిల్ రషీద్ బౌలింగ్‌లో కిషన్ ఔట్ అయ్యాడు. ఆ తర్వాత సంజూ దూకుడికి విల్ జాక్స్ బ్రేక్ వేశాడు. 42 బంతుల్లో 8 ఫోర్లు, 7 సిక్సుల సాయంతో 89 పరుగులు చేసిన సంజూ ఫిల్ సాల్ట్‌కి క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో భారత్ 14 ఓవర్లు ముగిసేసరికి 3 వికెట్ల నష్టానికి 167 పరుగులు చేసింది. క్రీజ్‌లో శివమ్ దూబె(20), సూర్యకుమార్(4) ఉన్నారు.