Reading Time: < 1 minute

టీం ఇండియాపై పాకిస్థాన్ మాజీ క్రికెటర్ మహ్మద్ అమిర్ కొంతకాలంగా ఇష్టారీతిన వ్యాఖ్యలు చేస్తున్నాడు. అభిషేక్ శర్మ‌ను స్లాగర్ అంటూ నోరు పారేసుకోవడమే కాకుండా.. భారత్ సెమీఫైనల్స్‌కు చేరుకోవది వ్యాఖ్యానించాడు. వీటిపై టీం ఇండియా మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ గట్టిగా జవాబిచ్చాడు. అమిర్ స్థాయికి దిగజారి మాట్లాడాల్సిన అవసరం మనకు లేదని కైఫ్ అన్నాడు. అతడు వార్తల్లో నిలవడం కోసమే ఇలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడని తన యూట్యూబ్ ఛానల్‌లో కైఫ్ పేర్కొన్నాడు.

‘‘టీం ఇండియా సెమీ ఫైనల్స్‌కు చేరుకుంటుందని మహ్మద్ అమిర్‌కు నిజంగా తెలియదా? డిఫెండింగ్ ఛాంపియన్ అయిన భారత్ సెమీస్‌కు వెళ్తుందని అతడికి తెలుసు. కానీ, అతడు వార్తల్లో నిలవడం కోసమే అలాంటి వ్యాఖ్యలు చేస్తున్నాడు. మనం వాటికి ప్రాముఖ్యం ఇవ్వకూడదు. అలాగే అతడి స్థాయికి దిగజారి మనం సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు’’ అని కైఫ్ అన్నాడు.

దీంతో పాటు 2024లో టి-20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్‌, యుఎస్ఎ చేతిలో ఓటమిపాలైన విషయాన్ని కైఫ్ గుర్తు చేశాడు. ‘‘2024 టి-20 ప్రపంచకప్‌లో పాకిస్థాన్ యుఎస్‌ఎ చేతిలో ఓటమిపాలైంది. అప్పుడు సూపర్ ఓవర్ వేసింది ఈ బౌలరే. కేవలం ఒక్క బౌండరీనే ఇచ్చాడు.. కానీ ఎక్కువగా వైడ్ బాల్స్ వేశాడు. కనీసం స్టంప్‌లైన్ కూడా ల్యాండ్ కాలేదు. యుఎస్ఎ జట్టుకు భయపడుతూ బౌలింగ్ చేసి ఎవరు తన జట్టు ఓటమికి కారణమయ్యారు? ఇంతకు మించి ఏమీ మాట్లాడాలనుకోవడం లేదు’’ అని కైఫ్ చురకలు అంటించాడు.