
ఇరాన్, అమెరికా ఇజ్రాయెల్ కూటమి నడుమ యుద్ధం గల్ఫ్ దేశాలను దాటి విస్తరిస్తోంది. బుధవారం తెల్లవారుజామున శ్రీలంక తీరం ప్రాంతం గాలె సమీపంలో ఇరానియన్ నౌకపై జలాంతర్గామి దాడి జరిగింది. ఈ దాడిలో 102మంది గల్లంతయ్యారు. 78 మంది గాయపడ్డారు. కొందరు నావికుల మృతదేహాలు లభించినట్లు శ్రీలంక వర్గాలు తెలిపాయి. ఇరాన్‌కు చెందిన ‘ఐఆర్‌ఐఎస్ దేనా’ అనే యుద్ధనౌక శ్రీలంక తీర ప్రాంతం మీదుగా తిరిగి ఇరాన్ వెళుతుండగా ఈ దాడి జరిగింది. అది తమపనేనని అమెరికా సాయంత్రానికి ప్రకటించింది. జలాంతర్గామి టార్పెడోలతో ఇరాన్ యుద్ధ నౌకను ముంచేశామని అమెరికా రక్షణ మంత్రి పీటర్ హెగ్సెత్ ప్రకటించారు. భారతదేశంలోని విశాఖపట్నంలో ఇటీవల జరిగిన ‘మిలాన్2026’ పలు దేశాల నావికా విన్యాసాలలో పాల్గొన్న తర్వాత ఇరాన్ కు తిరిగి వెళ్తుండగా ఈ దాడి జరిగింది.
మునిగిపోతున్న ఇరానియన్ నౌకలోని 32 మందిని సైన్యం రక్షించిందని శ్రీలంక విదేశాంగ మంత్రిత్వశాఖ అంతకుముందు తెలిపింది. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉందని, ఏడుగురికి అత్యవసర చికిత్స అందించామని, మరి కొందరు స్వల్పంగా గాయపడి చికిత్స పొందుతున్నారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ ఉన్నతాధికారి డాక్టర్ అనిల్ జాసింగ్ తెలిపారు. అనంతరం శ్రీలంక నౌకాదళం ఓ ప్రకటనలో మొత్తం 79 మందిని రక్షించి ఆసుపత్రికి తీసుకువెళ్లినట్లు, వారిలో ఒకరు మరణించినట్లు, మరో 101 మంది తప్పిపోయినట్లు తెలిపింది. నౌక మాత్రం సముద్ర జలాలలో మునిగిపోయిందని వివరించింది. దాదాపు 180 మందితో కూడిన ఐఆర్‌ఐఎస్ దేనా నౌక ప్రమాదంలో ఉందని శ్రీలంక నావికా దళానికి అత్యవసర సందేశం అందిందని, వెంటనే ఓడలు, వైమానిక దళ విమానాలు సహాయ చర్యలకోసం పంపినట్లు లంక విదేశాంగమంత్రి విజిత హరాత్ పార్లమెంటులో ప్రకటించారు.
పేలుడు వల్లే మునక..
పెద్ద పేలుడు సంభవించడంతో నౌక దెబ్బతిన్నదని సిబ్బంది చెప్పినట్లు శ్రీలంక నావికా దళం వర్గాలు బుధవారం తెలిపాయి. నౌక మునిగిపోయిన ప్రాంతంలో కొన్ని మృతదేహాలను స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. ఓడ మునిగిపోయిన ప్రాంతం నుంచి తాము కొందరి మృతదేహాలను స్వాధీనం చేసుకున్నామని, మరి కొందరి కోసం అన్వేషణ కొనసాగిస్తున్నామని శ్రీలంక నావికాదళ ప్రతినిధి బుద్ధిక సంపత్ కొలంబోలో విలేకరులకు తెలిపారు.
అది మా పనే : అమెరికా
హిందూ మహా సముద్రంలో ఇరాన్ నౌకను జలాంతర్గామి టార్పెడోలతో ముంచేశామని అమెరికా రక్షణమంత్రి పీటర్ హెగ్సెత్ వెల్లడించారు. రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఒక శత్రుదేశంపై జరిగిన అతి భారీ దాడిగా ఆయన అభివర్ణించారు. త్వరలో మరిన్ని దాడులు చేస్తామని ఆయన హెచ్చరించారు. కొద్ది రోజుల్లో ఇరాన్ గగనతలాన్ని తమ ఆధీనంలోకి తీసుకుంటామన్నారు. ఇరాన్‌పై అమెరికా మరింత విజయం సాధించిందన్నారు. తమ వద్ద అపరిమిత సంఖ్యలో గ్రావిటీ బాంబులు ఉన్నాయని, వాటిని కూడా ఉపయోగిస్తామన్నారు.