
మిస్సమ్మ, అదిరందయ్యా చంద్రం, టాటా బిర్లా మధ్యలో లైలా లాంటి క్లాసిక్ ఎంటర్‌టైనర్స్ తర్వాత శివాజీ, లయ జంటగా నటించిన సినిమా ‘సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’. లిటిల్ హార్ట్, రాజు వెడ్స్ రాంబాయి లాంటి విజయాల తర్వాత ఈటీవీ విన్‌తో కలిసి ప్రముఖ నిర్మాతలు బన్నీ వాస్, వంశీ నందిపాటి విడుదల చేస్తున్న సినిమా ఇది. క్రైమ్-కామెడీ ఫ్యామిలీ థ్రిల్లర్‌గా వస్తున్న ’సాంప్రదాయిని సుప్పిని సుద్దపూసని’ సినిమాను ఈటీవీ విన్ అసోసియేషన్‌తో శ్రీ శివాజీ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై రిక్కి సమర్పణలో హీరో శివాజీ స్వయంగా నిర్మిస్తుండగా.. సుధీర్ శ్రీరామ్ తెరకెక్కించారు. మార్చి 6న చిత్రం ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా హైదరాబాద్‌లో జరిగిన ఈ చిత్ర ప్రీరిలీజ్ వేడుకలో హాస్య బ్రహ్మా బ్రహ్మానందం, బండ్లగణేష్ అతిథులుగా విచ్చేశారు.
ఈ సందర్భంగా బ్రహ్మానందం మాట్లాడుతూ “పండగ వాతావరణంలో ఉన్న ఈ సినిమా అందరినీ నవ్వులతో అలరిస్తుందని నమ్ముతున్నాను. ఈ సినిమా తప్పకుండా సక్సెస్ అవుతుందని, నిర్మాతగా శివాజీ విజయం సాధించాలని కోరుకుంటున్నాను”అని అన్నారు. కథానాయకుడు శివాజీ మాట్లాడుతూ “సినిమా ప్రేక్షకుడికి దూరం కాకూడదు అనే ఉద్దేశంతో ఈటీవీ విన్ వారు థియేటర్‌లో ఈ సినిమా చూడటానికి ఓ ఫ్యామిలీ ప్యాకేజీని ప్రకటించారు. సింగిల్ స్క్రీన్స్‌లో కేవలం 499 రూపాయలకు 4 నాలుగు టికెట్లు ఓ పాప్ కార్న్‌ను, మల్టీప్లెక్స్ థియేటర్స్‌లో 799 రూపాయాలకు నాలుగు టికెట్లు, ఓ బిగ్ పాప్‌కార్న్‌ను ఈ ప్యాకేజీలో భాగంగా అందించనున్నారు. ఫ్యామిలీ ఆడియన్స్, ఫ్రెండ్స్ ఇలా అందరిని దృష్టిలో పెట్టుకుని ఈ ఆఫర్‌ను ప్రకటించారు. ఇందువల్ల సినిమా మరింత మందికి దగ్గరవుతుంది” అని తెలిపారు. ఈ వేడుకలో లయ, సాయికృష్ణ, వంశీ నందిపాటి, నితిన్ చక్రవర్తి, అలీ, సుదీర్ శ్రీరామ్, మిథిల్, రిత్విక్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.