Trump: ఓ వైపు ఖమేనీ అంత్యక్రియలు.. ఇంకోవైపు టర్కీలో ట్రంప్ పర్యటన.. సర్వత్రా ఉత్కంఠ

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మంగళవారం నాటో సదస్సు కోసం టర్కీ రాజధాని అంకారాకు చేరుకున్నారు. విమానాశ్రయంలో టర్కీ అధ్యక్షుడు రెసెప్ తయ్యిప్ ఎర్డోగాన్ స్వయంగా ట్రంప్‌కు ఘన స్వాగతం పలికారు. చాలా సేపు ముచ్చటించుకున్నారు. అనంతరం ముందుకు కదిలారు. ఇక నాటో సదస్సు సందర్భంగా ట్రంప్.. ఎర్డోగాన్‌తో ద్వైపాక్షిక సమావేశంతో పాటు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్‌స్కీ, సిరియా అధ్యక్షుడు అహ్మద్ అల్-షరాతో కూడా భేటీ కానున్నారు. ఈ నేపథ్యంలో సదస్సు అంతర్జాతీయంగా ప్రాధాన్యత సంతరించుకుంది. ఇక టర్కీకి యుద్ధ విమానాలు విక్రయించే ప్రాతిపాదనకు ట్రంప్ ఓకే చెప్పే అవకాశం ఉంది. అయితే ఈ నిర్ణయాన్ని ఇజ్రాయెల్ వ్యతిరేకించే ఛాన్సుంది.

ట్రంప్ రాకకు ముందే నాటో కూటమి బిలియన్ డాలర్ల విలువైన పలు రక్షణ ప్రాజెక్టులను ఆవిష్కరించింది. సభ్య దేశాలు రక్షణ వ్యయాలను పెంచి, వాటిని ఆధునిక ఆయుధ సామర్థ్యాలుగా మార్చుతున్నాయని అమెరికాకు చూపించేందుకు ఈ ప్రదర్శన నిర్వహించినట్లు అధికారులు తెలిపారు. నాటో ప్రధాన కార్యదర్శి మార్క్ రుట్టే మాట్లాడుతూ.. ‘‘ఇది ఎంతో విలువైన పెట్టుబడి. సభ్య దేశాలు రక్షణ రంగంలో భారీగా పెట్టుబడులు పెడుతున్నాయి. అవి ప్రత్యక్ష సైనిక సామర్థ్యాలుగా మారుతున్నాయి.’’ అని పేర్కొన్నారు. టర్కీలో జరిగిన రక్షణ పరిశ్రమ సదస్సులో అత్యాధునిక సాంకేతిక ప్రదర్శనలు, వీడియో ప్రజెంటేషన్ల మధ్య ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు.
అయితే ట్రంప్ మాత్రం నాటోపై తన విమర్శనాత్మక వైఖరిని మరోసారి వ్యక్తం చేశారు. అమెరికా ఆయుధాలు, నాయకత్వం లేకుండా నాటో సమర్థవంతంగా పనిచేయలేదని, గతంలో దీనిని ‘‘పేపర్ టైగర్’’గా అభివర్ణించిన విషయాన్ని మరోసారి గుర్తు చేశారు. ప్రస్తుతం నాటోకు స్వంతంగా ఆయుధ వ్యవస్థలు లేకపోయినా, సభ్య దేశాల ఆధీనంలో ఉన్న రక్షణ సామర్థ్యాల సమన్వయ బాధ్యతలను నిర్వహిస్తోంది. దాదాపు 50 ఏళ్ల నాటి 14 AWACS ముందస్తు హెచ్చరిక రాడార్ విమానాలు, ఆధునిక నిఘా డ్రోన్లను కూడా నాటో వినియోగిస్తోంది.
ఇదిలా ఉండగా యూరోపియన్ దేశాలు, కెనడా కలిసి 2017 నుంచి రక్షణ రంగంలో 1.2 ట్రిలియన్ డాలర్ల అదనపు వ్యయం చేశాయని చూపిస్తూ ‘ది ట్రంప్ ట్రిలియన్’ పేరుతో నాటో ప్రత్యేక ప్రదర్శనను కూడా ఏర్పాటు చేసింది. అమెరికా ఆందోళనలను తగ్గించేందుకు ఈ గణాంకాలను మార్క్ రుట్టే వివరించారు. అయితే ఈ వివరాలు ట్రంప్‌ను పెద్దగా ఆకట్టుకోలేదు. ఇటీవల అమెరికా-ఇజ్రాయెల్ కలిసి ఇరాన్‌పై చేపట్టిన సైనిక చర్యలో కొన్ని నాటో దేశాలు మద్దతు ఇవ్వకపోవడంపై ఆయన అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘‘వారి డబ్బు మాకు అవసరం లేదు. మాకు ఏమీ అవసరం లేదు. నాకు కావాల్సింది ఒక్కటే… విధేయత’’ అని ట్రంప్ స్పష్టం చేశారు. ఈ నేపథ్యంలో నాటో సదస్సులో రక్షణ వ్యయాలు, ఉక్రెయిన్ యుద్ధం, మధ్యప్రాచ్య భద్రత, అమెరికా-ఇరాన్ ఉద్రిక్తతలు, సభ్య దేశాల భద్రతా సహకారం వంటి అంశాలు ప్రధాన చర్చగా నిలిచే అవకాశం ఉంది.
ఇదిలా ఉంటే మరోవైపు ఇరాన్‌లో ఖమేనీ అంత్యక్రియల కార్యక్రమం కొనసాగుతోంది. పవిత్ర స్థలాల సందర్శన తర్వాత జూలై 9న ఖమేనీ అంత్యక్రియలు జరగనున్నాయి. ఇలాంటి తరుణంలో పశ్చిమాసియాకు చెందిన టర్కీలో ట్రంప్ పర్యటించడం ప్రాధాన్యత సంతరించుకుంది. అంతర్జాతీయంగా సర్వత్రా ఆసక్తి నెలకొంది.