July 7, 2026

Sanju Samson : అభిమానుల్లో మొదలైన టెన్షన్.. టీమిండియాకు ఇక సంజూ శాంసన్ దూరమైనట్లేనా ?

Sanju Samson : అభిమానుల్లో మొదలైన టెన్షన్.. టీమిండియాకు ఇక సంజూ శాంసన్ దూరమైనట్లేనా ?
Reading Time: 2 minutes
Sanju Samson : అభిమానుల్లో మొదలైన టెన్షన్.. టీమిండియాకు ఇక సంజూ శాంసన్ దూరమైనట్లేనా ?

Sanju Samson : భారత క్రికెట్ అభిమానులను ప్రస్తుతం ఒకే ఒక ప్రశ్న తీవ్రంగా వేధిస్తోంది. స్టార్ వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ టీమిండియాకు ఇక శాశ్వతంగా దూరమైపోయాడా? ఐసీసీ వరల్డ్ కప్‌లో వరుసగా మూడు హాఫ్ సెంచరీలు బాది, భారతదేశాన్ని విశ్వవిజేతగా నిలబెట్టడంలో కీలక పాత్ర పోషించిన శాంసన్‌ను.. ఇప్పుడు అకస్మాత్తుగా జింబాబ్వే పర్యటనకు దూరం పెట్టడం వెనుక ఉన్న వ్యూహం ఏంటి? ఈ ప్రశ్నల చుట్టూనే ఇప్పుడు క్రికెట్ వర్గాల్లో పెద్ద ఎత్తున చర్చ నడుస్తోంది.

సంజూ శాంసన్ భవిష్యత్తుపై ఇలాంటి అనుమానాలు రావడానికి బలమైన కారణాలే ఉన్నాయి. ఇటీవల జరిగిన యూకే పర్యటనలో సంజూ ఘోరంగా విఫలమయ్యాడు. అక్కడ ఆడిన 3 ఇన్నింగ్స్‌ల్లో కలిపి ఆయన కేవలం 6 పరుగులు మాత్రమే చేయగలిగాడు. ఈ పేలవ ప్రదర్శన కారణంగా మొదట ఆయనను ప్లేయింగ్ ఎలెవన్ నుంచి తప్పించారు. ఆ తర్వాత యువ సంచలనం వైభవ్ సూర్యవంశీకి భారత జట్టులో అవకాశం కల్పించడంతో, సంజూ శాంసన్ ఏకంగా స్క్వాడ్ నుంచే డ్రాప్ అయ్యాడు. దీంతో ఆయన కెరీర్ ముగిసిపోయిందంటూ పుకార్లు షురూ అయ్యాయి.

అయితే, సంజూ శాంసన్ భారత జట్టుకు దూరం కాలేదని, జింబాబ్వే సిరీస్‌కు దూరం పెట్టడం వెనుక ఒక ప్రత్యేకమైన ప్రణాళిక ఉందని బీసీసీఐ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. వార్తా సంస్థ పీటీఐ కథనం ప్రకారం.. జింబాబ్వే పర్యటనలో యువ ఆటగాళ్లకు ఎక్కువ అవకాశాలు ఇచ్చి పరీక్షించాలని సెలెక్టర్లు భావించారు. ఒకవేళ ఈ పర్యటనకు సంజూ శాంసన్‌ను ఎంపిక చేసినా కూడా, సీనియర్ అయిన అతనికి ప్లేయింగ్ ఎలెవన్‌లో చోటు దక్కడం కష్టంగా మారేది. అందుకే యువకులను ప్రోత్సహించేందుకే ఈ నిర్ణయం తీసుకున్నట్లు బీసీసీఐ వర్గాలు తెలిపాయి.

సంజూ శాంసన్ అభిమానులకు ఉపశమనం కలిగించే మరో పెద్ద అప్‌డేట్ కూడా ఉంది. కొన్ని వారాల వ్యవధిలోనే ఆయన మళ్లీ బ్లూ జెర్సీలో కనిపించబోతున్నాడు. ఈ ఏడాది సెప్టెంబర్-అక్టోబర్ నెలల్లో జపాన్ వేదికగా ప్రతిష్టాత్మక ఏషియన్ గేమ్స్ జరగనున్నాయి. ఈ ఆసియా క్రీడల కోసం బీసీసీఐ ఇప్పటికే ప్రకటించిన భారత జట్టులో సంజూ శాంసన్‌కు చోటు దక్కింది. కాబట్టి సంజూ కెరీర్ ముగిసిపోలేదని, ఆసియా క్రీడల ద్వారా ఆయన మళ్లీ మైదానంలోకి దూకడం ఖాయమని తేలిపోయింది.

జింబాబ్వే టూర్‌కు టీమిండియా కొత్త స్క్వాడ్

జింబాబ్వే పర్యటన కోసం ఎంపిక చేసిన భారత జట్టును పరిశీలిస్తే పూర్తిగా యంగ్ బ్లడ్ కనిపిస్తోంది. ఈ టూర్‌కు శ్రేయస్ అయ్యర్ కెప్టెన్‌గా వ్యవహరించనుండగా.. తిలక్ వర్మ వైస్ కెప్టెన్‌గా బాధ్యతలు చేపట్టాడు.

భారత పూర్తి స్క్వాడ్ వివరాలు:

శ్రేయస్ అయ్యర్(కెప్టెన్), వైభవ్ సూర్యవంశీ, అభిషేక్ శర్మ, తిలక్ వర్మ (వైస్ కెప్టెన్), ఇషాన్ కిషన్ (వికెట్ కీపర్), శివం దూబే, సూర్యాంశ్ శెడ్గే, రింకూ సింగ్, హర్ష్ దూబే, వరుణ్ చక్రవర్తి, ప్రిన్స్ యాదవ్, యష్ ఠాకూర్, అశోక్ శర్మ, మయాంక్ యాదవ్, ప్రభ్‌సిమ్రాన్ సింగ్ (వికెట్ కీపర్).