Sanju Samson: సంజూ.. సంజూ.. సంజూ.. భారీగా పెరుగుతున్న మద్దతు.. ‘మేనేజ్‌మెంట్‌కు ఏమైనా పిచ్చి లేచిందా’..

టీ20 వరల్డ్ కప్ 2026 హీరో, వికెట్ కీపర్-బ్యాటర్ సంజూ శాంసన్‌ను జింబాబ్వే పర్యటనకు ఎంపిక చేయకపోవడం ఇప్పుడు భారత క్రికెట్‌లో పెను తుఫాను సృష్టించింది. జూలై 23 నుంచి ప్రారంభం కానున్న ఈ మూడు మ్యాచ్‌ల టీ20 సిరీస్ నుంచి శాంసన్‌ను అకస్మాత్తుగా తప్పించడంపై మాజీ క్రికెటర్లు ఒక్కొక్కరుగా సెలెక్టర్ల తీరును ఎండగడుతున్నారు. మరోవైపు సోషల్ మీడియాలో నెటిజన్లు “టీమిండియా మేనేజ్‌మెంట్‌కు ఏమైనా పిచ్చి లేచిందా? వరల్డ్ కప్ గెలిపించిన హీరోను ఇలాగేనా గౌరవించేది?” అంటూ తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పిస్తున్నారు. దేశవ్యాప్తంగా సంజూ శాంసన్‌కు మద్దతు విపరీతంగా పెరుగుతోంది.
శాంసన్ వల్లే అగార్కర్‌కు ఎక్స్‌టెన్షన్..
భారత మాజీ ఓపెనర్ సదాగోపన్ రమేష్ తన యూట్యూబ్ ఛానెల్‌లో సెలెక్టర్లపై అత్యంత ఘాటైన వ్యాఖ్యలు చేశారు. చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కాంట్రాక్ట్ జూన్‌తో ముగిసిపోవాల్సి ఉందని, కేవలం భారత్ టీ20 వరల్డ్ కప్ గెలవడం వల్లే ఆయనకు పదవీకాలం పొడిగించారని గుర్తుచేశారు. ఆ వరల్డ్ కప్ విజయంలో సంజూ శాంసనే కీలక పాత్ర పోషించాడని రమేష్ స్పష్టం చేశారు.
“వరల్డ్ కప్‌లో ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్‌గా నిలిచిన ఆటగాడిని, ఆ తర్వాత కేవలం మూడు ఇన్నింగ్స్‌ల్లో వైఫల్యం (6 పరుగులు, ఒక గోల్డెన్ డక్) ఆధారంగా జట్టు నుంచి తొలగించడం అత్యంత ఘోరమైన నిర్ణయం. వెస్టిండీస్‌పై 97 నాటౌట్, సెమీస్‌లో ఇంగ్లాండ్‌పై 89, ఫైనల్లో న్యూజిలాండ్‌పై 89 పరుగులు చేసిన సంజూ.. స్వార్థం లేకుండా జట్టు కోసం ఆడాడు. ఆ మూడు ఇన్నింగ్స్‌లను సెలెక్టర్లు అంత త్వరగా ఎలా మర్చిపోయారు?” అని రమేష్ ప్రశ్నించారు.
సెలెక్టర్ల తీరుపై ఫైర్ అవుతున్న మాజీ క్రికెటర్లు
శాంసన్‌కు జరుగుతున్న అన్యాయంపై రాబిన్ ఉతప్ప, అజింక్యా రహానె, రవిచంద్రన్ అశ్విన్ వంటి సీనియర్ క్రికెటర్లు కూడా గళం విప్పారు.
రాబిన్ ఉతప్ప మండిపాటు: “ఇది ఏమాత్రం కరెక్ట్ కాదని క్రికెట్ చూసే ప్రతి ఒక్కరికీ తెలుసు. సంజూ శాంసన్ ఒక్కడి పట్లనే సెలెక్టర్లు ఎందుకు ఇంత కఠినంగా వ్యవహరిస్తున్నారో అర్థం కావడం లేదు. కొన్ని నెలల క్రితమే దేశానికి వరల్డ్ కప్ గెలిపించిన హీరోపై ఇంత త్వరగా వేటు వేస్తారా? అసలు సెలెక్టర్లకు, టీమ్ మేనేజ్‌మెంట్‌కు ఒక స్పష్టమైన క్లారిటీ ఉందో లేదో అనిపిస్తోంది.”
అజింక్యా రహానె ఆశ్చర్యం: “వరల్డ్ కప్ హీరోను ఇలా పక్కనపెట్టడం నిజంగా విచిత్రంగా ఉంది. అతడిని ఎందుకు తప్పించారో కనీసం మేనేజ్‌మెంట్ శాంసన్‌కు క్లారిటీ ఇచ్చి ఉంటుందని ఆశిస్తున్నా. దేశం గర్వించే ఆటగాడిని త్వరలోనే మళ్లీ జట్టులో చూడాలనుకుంటున్నా.”
రవిచంద్రన్ అశ్విన్: భారత సీనియర్ స్పిన్నర్ ఆర్. అశ్విన్ కూడా సంజూని తప్పించడం తప్పు అని తేల్చిచెప్పాడు. “వరల్డ్ కప్ లాంటి మెగా టోర్నీలో అంతటి ఒత్తిడిలో ఒంటిచేత్తో మ్యాచ్‌లు గెలిపించి ‘ప్లేయర్ ఆఫ్ ది టోర్నమెంట్’ అయిన ప్లేయర్‌ను, ఇంగ్లాండ్ సిరీస్‌లో కొన్ని మ్యాచ్‌లు ఫెయిల్ అవ్వగానే డ్రాప్ చేయడం సెలెక్టర్ల అనాలోచిత నిర్ణయానికి నిదర్శనం. ఆటగాళ్లకు మానసిక స్థిరత్వం, భద్రత కల్పించడంలో మేనేజ్‌మెంట్ విఫలమవుతోంది” అని విమర్శించాడు.
“మేనేజ్‌మెంట్‌కు పిచ్చి లేచిందా?” ..
ఈ నిర్ణయంపై సోషల్ మీడియా వేదికగా అభిమానులు సెలెక్టర్లపై దండయాత్ర చేస్తున్నారు. టీమిండియా సెలెక్షన్ కమిటీకి, మేనేజ్‌మెంట్‌కు ఏమైనా పిచ్చి లేచిందా? అంటూ ట్రోల్స్ చేస్తున్నారు. ఇంగ్లాండ్‌తో జరిగిన సిరీస్‌లో యువ ఆటగాడు వైభవ్ సూర్యవంశీని జట్టులోకి తీసుకువచ్చే క్రమంలో శాంసన్‌ను బలిపశువును చేశారని అభిమానులు ఆరోపిస్తున్నారు. శాంసన్ లాంటి నిస్వార్థమైన, టాలెంటెడ్ వికెట్ కీపర్-బ్యాటర్‌ను కావాలనే తొక్కేస్తున్నారనే భావన అభిమానుల్లో బలపడుతోంది.
సెలెక్టర్ల వివక్షా పూరిత నిర్ణయాల వల్ల శాంసన్‌కు లభిస్తున్న ప్రజాదరణ, సానుభూతి మునుపెన్నడూ లేనంతగా పెరిగింది. మాజీ క్రికెటర్ల మద్దతు, నెటిజన్ల ఒత్తిడి నేపథ్యంలో.. జింబాబ్వే సిరీస్ తర్వాత సెలెక్టర్లు తమ నిర్ణయాలను పునఃసమీక్షించుకోక తప్పని పరిస్థితి ఏర్పడింది.