Reading Time: < 1 minute
Watch Video: వడలో బల్లి తల.. చట్నీలో మిగతా భాగం.. టిఫిన్ తింటుండగా ఊహించని షాక్

వరంగల్, జూన్ 26: ఓ టిఫిన్ సెంటర్‌లో ఆహారం తీసుకుంటున్న కస్టమర్‌కు షాకింగ్‌ అనుభవం ఎదురైంది. ఉదయం పూట బ్రేక్ ఫాస్ట్‌ చేస్తుండగా బల్లి కనిపించడం కలకలం రేపింది. ఈ షాకింగ్‌ ఘటన వరంగల్ నగరంలోని కాశీబుగ్గ ప్రాంతంలో ఉన్న ఓ స్థానిక హోటల్‌లో గురువారం ఉదయం చోటు చేసుకుంది. అల్పాహారం చేస్తున్న సమయంలో వడలో బల్లి తల, చట్నీలో మిగతా భాగం కనిపించిందని కస్టమర్ ఆరోపించాడు. వివరాల్లోకెళ్తే..

వరంగల్‌ జిల్లా కాశీబుగ్గ దూపం సంపత్‌ కూడలిలో గురువారం కాశీబుగ్గకు చెందిన బేతి రాజు స్థానికంగా ఉన్న ఓ హోటల్‌లో వడ పార్శిల్‌ను ఇంటికి తీసుకెళ్లాడు. మొత్తం నాలుగు వడలు తీసుకెళ్లగా.. వాటిల్లో రెండింటిని తినేశాడు. మూడో వడ తినబోతుండగా వడలో బల్లి తల కనిపించింది. ఇక చట్నీలో బల్లి మిగతా శరీర భాగాలు కనిపించాయి. ఈ ఘటనతో షాక్‌కు గురైన కస్టమర్, ఆహార భద్రతా ప్రమాణాలపై ప్రశ్నలు లేవనెత్తుతూ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. నేను టిఫిన్ తింటుండగా వడలో బల్లి తల, చట్నీలో దాని శరీరం కనిపించాయి. ఇది చాలా ఆందోళనకరమైన దారుణ విషయమని పేర్కొన్నాడు. అంతేకాకుండా తాను వెంటనే హోటల్‌కు వచ్చి జరిగిన విషయం చెప్పగా.. హోటల్‌ నిర్వాహకులు సరైన సమాధానం ఇవ్వకుండా దురుసుగా మాట్లాడినట్లు తెలిపాడు. వరంగల్‌లోని హోటళ్లు, టిఫిన్ సెంటర్లలో ఆహార భద్రతా ప్రమాణాలు సరిగా అమలవుతున్నాయా అనే అంశంపై అధికారులు దృష్టి సారించాలని ఆయన కోరాడు. అన్ని ఆహార విక్రయ కేంద్రాల్లో ప్రత్యేక తనిఖీలు నిర్వహించాలని విజ్ఞప్తి చేశాడు.

 

ఈ ఘటనకు సంబంధించిన వీడియోలు, ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతుండగా, స్థానికులు ఆహార నాణ్యత, పరిశుభ్రతపై ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఘటనపై ఆహార భద్రతా అధికారులు స్పందించి విచారణ చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ఈ ఘటనపై స్పందించిన ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్‌ మౌనిక సారథ్యంలో మున్సిపల్‌ శానిటరీ విభాగం సిబ్బంది కాశీబుగ్గలోని సదరు హోటల్‌ను తనిఖీ చేశారు. హోటల్‌లో నిర్వహణ సరిగా లేకపోవడం, సరైన పత్రాలు లేనట్లు గుర్తించారు. దీంతో రూ.10 వేల జరిమానా విధించి, హోటల్‌ను సీజ్‌ చేశారు.