Reading Time: 2 minutes
Ghaziabad 4 Crore Jewelry Heist Man Robs Shop For Marriage

Ghaziabad Jewelry Heist: ప్రేమ కోసం తాజ్ మహల్ కట్టించిన వాళ్లను చూశాం.. కానీ పెళ్లి కోసం ఏకంగా రూ.4 కోట్ల నగల దుకాణానికే కన్నం వేసిన ‘మహానుభావుడిని’ ఎప్పుడైనా చూశారా? లగ్జరీగా పెళ్లి చేసుకోవాలని ఆశపడ్డాడో ఏమో.. ప్రియురాలితో కలిసి సినిమా స్క్రీన్ ప్లేని తలపించేలా ఒక రేంజ్ స్కెచ్ వేశాడు. తోటి ఉద్యోగులకు మందు పార్టీ ఇచ్చి, క్యాషియర్‌ను మత్తులో ముంచి, కేవలం 25 నిమిషాల్లో రూ.4 కోట్ల విలువైన వజ్రాలు, బంగారాన్ని దోచేశాడు. తీరా కట్ చేస్తే.. పెళ్లి పీటలు ఎక్కాల్సిన ఈ ‘లవ్ బర్డ్స్’.. ఇప్పుడు తండ్రితో కలిసి జైలు ఊచలు లెక్కపెడుతున్నారు. గాజియాబాద్‌లో జరిగిన ఈ షాకింగ్ దోపిడీ వెనుక ఉన్న అసలు కథ వింటే మీ మైండ్ బ్లాక్ అవ్వడం ఖాయం.

తాజాగా గాజియాబాద్‌లో సంచలనం సృష్టించిన రూ. 4 కోట్ల నగల దోపిడీ కేసును ఉత్తర్‌ప్రదేశ్ పోలీసులు ఛేదించారు. లగ్జరీగా పెళ్లి చేసుకోవాలనే కోరికతో, ఒక ప్రియుడు తన ప్రేయసి, తండ్రితో కలిసి వేసిన భారీ స్కెచ్ పోలీసుల విచారణలో వెలుగుచూసింది. సినిమా స్క్రీన్ ప్లేని తలపించే ఈ క్రైమ్ స్టోరీ పూర్తి వివరాలను ఈ స్టోరీలో తెలుసుకుందాం. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. నితిన్ వర్మ అనే యువకుడికి కాజల్ వర్మతో వివాహం నిశ్చయమైంది. పెళ్లి వేడుకను అత్యంత ఘనంగా జరుపుకోవడానికి భారీగా డబ్బు అవసరమైంది. దీని కోసం గాజియాబాద్‌లోని ఒక ప్రముఖ జ్యువెలరీ షోరూమ్‌ను నితిన్ టార్గెట్ చేశాడు. ప్లాన్ ప్రకారమే నెలన్నర క్రితం ఆ నగల దుకాణంలో ఉద్యోగిగా చేరాడు. స్టోర్ లోపల భద్రతా ఏర్పాట్లు ఎలా ఉన్నాయి? విలువైన వజ్రాలు, బంగారు ఆభరణాలు ఎక్కడ భద్రపరుస్తారు? అనే కీలక విషయాలపై నిఘా పెట్టాడు.

మందు పార్టీతో మైండ్ బ్లాక్..

జూన్ 12న తన పెళ్లి ఖరారైందంటూ షోరూమ్ సిబ్బంది అందరికీ నితిన్ గ్రాండ్‌గా ‘మందు పార్టీ’ ఇచ్చాడు. ఈ పార్టీకి అతని ప్రియురాలు కాజల్, నితిన్ తండ్రి కూడా హాజరయ్యారు. షోరూమ్ తాళాల బాధ్యత చూసే క్యాషియర్ గౌతమ్ రాజ్‌కు నితిన్ ప్లాన్ ప్రకారమే ఎక్కువ మద్యం తాగించాడు. పార్టీ ముగిసిన తర్వాత పూర్తిగా మత్తులో ఉన్న క్యాషియర్‌ను ఇంటి దగ్గర దింపుతానని నమ్మించి, ఎవరికీ తెలియకుండా అతని దగ్గరున్న షోరూమ్ తాళాలను కాజేశాడు. మరుసటి రోజు ఉదయం రాత్రిపూట కాపలా ఉండే సెక్యూరిటీ గార్డు డ్యూటీ ముగించుకుని ఉదయం 7 గంటలకు ఇంటికి వెళ్లిపోయాడు. ఇదే అదనుగా భావించిన నితిన్, తన స్నేహితుడితో కలిసి దొంగిలించిన తాళాలతో షోరూమ్ షట్టర్ తెరిచాడు. లోపలికి దూరిన నిందితులు కేవలం 25 నిమిషాల వ్యవధిలోనే మొదటి అంతస్తులో ఉన్న రూ. 4 కోట్ల విలువైన వజ్రాలు, రత్నాలు, బంగారు ఆభరణాలను ఊడ్చేశారు. షోరూమ్‌లో కనీసం అలారం వ్యవస్థ కూడా లేకపోవడం నిందితులకు మరింత కలిసివచ్చింది.

కటకటాలపాలైన కుటుంబం..

బాధిత జ్యువెలర్ ఫిర్యాదుతో రంగంలోకి దిగిన పోలీసులు టెక్నికల్ ఎవిడెన్స్, సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా నితిన్ వర్మను అదుపులోకి తీసుకుని విచారించగా అసలు నిజం ఒప్పుకున్నాడు. పెళ్లి ఖర్చుల కోసమే ఈ దోపిడీకి పాల్పడినట్లు నిందితుడు అంగీకరించాడు. ఈ క్రైమ్ ప్లాన్‌లో భాగస్వామ్యులైన ప్రియుడు నితిన్ వర్మతో పాటు అతని ప్రేయసి కాజల్, నిందితుడి తండ్రిని కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. చోరీకి గురైన సొత్తును రికవరీ చేసేందుకు దర్యాప్తు ముమ్మరం చేశారు.